అన్ని రంగాలకూ భారీగా కోతలు!

12 Mar, 2015 15:21 IST|Sakshi

గతేడాదితో పోలిస్తే సాంఘిక సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో భారీగా కోతపడింది. ఏకంగా రూ. 534 కోట్లను ఈ రంగానికి తగ్గించారు. గత ఆర్థిక సంవత్సరంలో సాంఘిక సంక్షేమానికి రూ. 2657 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది కేవలం రూ. 2123 కోట్లు మాత్రమే కేటాయించారు. గిరిజనులకు ఇచ్చే నిధుల్లో కూడా కోత విధించారు. గత ఏడాది రూ. 1150 కోట్లు కేటాయించగా, ఈసారి అందులో రూ. 157 కోట్లు కోతపెట్టి.. రూ. 993 కోట్లే ఇచ్చారు. అలాగే బీసీ సంక్షేమానికి కూడా అరకొరగానే నిధులు ఇచ్చారు. గత సంవత్సరం రూ. 3130 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది రూ. 101 కోట్లు మాత్రమే పెంచి.. రూ. 3231 కోట్లు కేటాయించారు.

ఇక అత్యంత ప్రాధాన్యమైన సాగునీటి రంగానికి పడినంత కోత మరే శాఖకూ పడలేదు. 2014-15 బడ్జెట్లో ఈ రంగానికి రూ. 8465 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 3207 కోట్లు కోత పెట్టి.. కేవలం రూ. 5258 కోట్లు కేటాయించారు. పట్టిసీమ ప్రాజెక్టును చేపడతామని చెప్పినా.. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయమై మాత్రం అసలు ఊసెత్తలేదు.

ఇలా ప్రధాన రంగాలన్నింటికీ బాగా కోతలు పెట్టిన ప్రభుత్వం.. కొన్ని కొన్ని రంగాలకు నామమాత్రంగా పెంచి.. మమ అనిపించారు. మైనార్టీల విభాగానికి గత సంవత్సరం రూ. 371 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం 8 కోట్లు మాత్రమే పెంచి.. రూ. 379 కోట్లు కేటాయించారు. అలాగే స్త్రీ శిశు సంక్షేమానికి గత ఏడాది రూ. 1049 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 31 కోట్లు మాత్రమే పెంచి, రూ. 1080 కోట్లు ఇచ్చారు. ఇక గత ఏడాది 25 వేల ఇళ్లు కడతామని చెప్పి.. ఆ రంగానికి రూ. 808 కోట్లు కేటాయించిన సర్కారు.. ఇప్పుడు 2 లక్షలకు పైగా ఇళ్లు కడతామని చెప్పి కూడా కేవలం రూ. 897 కోట్లే కేటాయించింది.

మరిన్ని వార్తలు