అల్లూరికి విప్లవబీజం పడిందిక్కడే

4 Jul, 2014 00:13 IST|Sakshi
అల్లూరికి విప్లవబీజం పడిందిక్కడే

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 117వ జయంతి నేడే. ఆ సందర్భంగా జిల్లాతో ఆయన అనుబంధంపై కథనం...
 రాజమండ్రి కల్చరల్:దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు సాయుధపోరాటమే సాధనంగా ఎంచుకున్న విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుకు రాజమండ్రితో విడదీయలేని అనుబంధం ఉంది. అల్లూరి సీతారామరాజు అక్షరాభ్యాసం, ప్రాథమిక విద్య, స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి పొందినది రాజమహేంద్రిలోనే కాగా ఆయన పోరాటాలకు జిల్లా వేదిక అయింది. అల్లూరి సీతారామరాజు 1897 జూలై7న ప్రస్తుత భీమిలి నియోజకవర్గంలోని పాడ్రంగి గ్రామంలో జన్మించారు.

ఆయన తండ్రి వేంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. వేంకటరామరాజుకు నేటి డీలక్స్ సెంటర్ వద్ద ఫొటో స్టూడియో ఉండేది. సీతారామరాజు ఉల్లితోట వీధిలోని బంగారయ్య ప్రాథమిక పాఠశాలలో ఒకటో తగరతినుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నారు. పాత బ్రిడ్జి సమీపంలో,  పుష్కరాలరేవు ప్రాంతంలో సీతారామరాజు ఉభయ సంధ్యల్లో  గోదావరి జలాల్లో స్నానం చేసేవాడు. తండ్రితో కలసి నిత్యం గోదావరి గట్టుపై వ్యాహ్యాళికి వచ్చేవాడు.

ఒకరోజు సాయంత్రం వ్యాహ్యాళి సమయంలో ఒక బ్రిటిష్ అధికారి గుర్రంపై సీతారామరాజుకు ఎదురు వచ్చాడు. ఆ బ్రిటిష్ సైనికునికి సీతారామరాజు వందనం చేయగా తండ్రి మందలించారు. ఆంగ్లేయుల పాలన వలన మనదేశానికి కలుగుతున్న అనర్థాను ఆయన తనకుమారుడికి వివరించి చెప్పారు. తండ్రి మాటలే సీతారామరాజుకు స్వాతంత్య్ర పోరాటం వైపు మళ్లడానికి నాందిపలికాయి. 1908లో వేంకటరామరాజు మరణించడంతో సీతారామరాజుకు రాజమండ్రితో బంధం తెగిపోయింది.  
 
పోలీసుస్టేషనులపై దాడి

సాయుధపోరాటంలో సీతారామరాజు కొయ్యూరు మండలం, కృష్ణాదేవిపేట వద్ద నడింపాలెం గ్రామంలో పోలీసు స్టేషనులపై దాడులకు వ్యూహరచన చేశారు. 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి, 23న కృష్ణాదేవిపేట, 24న రాజవొమ్మంగి పోలీసుస్టేషనులపై అల్లూరి తన అనుచరులతో కలసి దాడులు చేసి, ఆయుధాలను తీసుకువెళ్లారు. అక్టోబర్ 15న అడ్డతీగల పోలీసుస్టేషనుపై దాడి చేశారు.
 
పట్టుబడిన సింహం
1924 మే 1 నుంచి ఆరో తేదీ వరకు రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామంలో అల్లూరి అనుచరులకు, ఆంగ్లేయులకు భీకర పోరాటాలు కొనసాగాయి. ఆ పోరాటాలలో అల్లూరి కుడిభుజం అగ్గిదొర పట్టుబడ్డాడు. అల్లూరికి గాయాలు తగిలాయి. మే 7వ తేదీన కొయ్యూరు మండలం ముంపలో ఒక ఏరులో అల్లూరి గాయాలను కడుగుకుంటుండగా  మేజర్ గుడాల్ అల్లూరిని బంధించాడు. నులకమంచానికి అల్లూరిని కట్టివేసి, రాజేంద్రపాలెం పుంతరోడ్డుకు తీసుకువెళ్లి చెట్టుకు కట్టి కాల్చి చంపాడు.

అధికారికంగా అల్లూరి జయంతి వేడుకలు
కల్చరల్(కాకినాడ) : విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు జయంతి వేడుకలను రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. కాకినాడ పీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని తెలిపారు.  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోటనరసింహం, కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి పాల్గొంటారన్నారు.

సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు స్థానిక నాగమల్లి తోట జంక్షన్ వద్దగల  అల్లూరి విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అల్లూరి జయంతి సందర్భంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వపోటీలను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.  
 
పుష్కరాల్లోగా గోదావరి గట్టుపై     అల్లూరి విగ్రహాన్ని నెలకొల్పాలి
విప్లవ సింహం అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని గోదావరిగట్టుపై ప్రతిష్ఠించేందుకు 2009 జూన్ 11న రాజమండ్రి నగరపాలకసంస్థ తీర్మానించింది. అయితే అది ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. పుష్కరాలలోగా గోదావరి గట్టుపై అల్లూరి విగ్రహాన్ని నెలకొల్పాలి.
 - పడాల వీరభద్రరావు, అధ్యక్షుడు, రాష్ట్ర అల్లూరి సీతారామరాజు యువజన సంఘం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు