అల్లూరి ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయం

5 Jul, 2015 01:32 IST|Sakshi

 కొత్తపేట(గుంటూరు) : అల్లూరి ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే అన్నారు. అల్లూరి సీతారామరాజు 118 వ జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం స్ధానిక నాజ్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ కాంతిలాల్ దండే, సినీ దర్శకుడు కె.విశ్వనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన హక్కులను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహా మనిషి అల్లూరి సీతారామరాజు అని కొనియడారు.  కె.విశ్వనాధ్ మాట్లాడుతూ మన్యం వీరుడి విగ్రహాన్ని రాజధానిలో ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ బాంధవ్యాలను సైతం విడిచి దేశం కోసం సాయుధ పోరాటంలో అశువులు బాసిన  అల్లూరి సంకల్పసిద్ధి అజరామరం అని చెప్పారు.
 
  మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్‌అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, జిల్లా గిరిజన సంక్షేమమాధికారి విజయ్‌కుమార్, గుంటూరు తహశీల్దార్ శివన్నారాయణమూర్తి, విగ్రహ దాత పి.రామచంద్రరాజు, విగ్రహ కమిటీ అధ్యక్షుడు ఎంవీ రమణారావు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 అల్లూరి సీతారామరాజు జీవితం ఆదర్శప్రాయం
 గుంటూరు వెస్ట్ :  గిరిజనుల హక్కులను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 118వ జయంతి వేడుకలు జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ మందిరంలో శనివారం జరిగాయి.
 
  కార్యక్రమానికి గిరిజన సంక్షేమాధికారి జి.విజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజన బాలికల వసతిగృహంలో చదువుతున్న దేవి అనే బాలిక సీతారామరాజుగా చేసిన ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. 10వ తరగతిలో మంచిమార్కులు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు, పదనిఘంటువులు అందజేశారు.
 
 వివిధ గిరిజన సంఘాల నాయకులు మొగిలి భరత్‌కుమార్, కె.నాగేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు, దారునాయక్ తదితరులను కలెక్టర్ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి టి.సూర్యనారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి శ్రీనివాస్, డ్వామా పి.డి బాలాజీనాయక్, తహశీల్దార్ శివన్నారాయణ, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు