ఇక్కడే ఓనమాలు

19 Feb, 2015 02:17 IST|Sakshi

బాపట్ల : సినీ వినీలాకాశంలో ధ్రువతార దగ్గుబాటి రామానాయుడు. రాజకీయాల్లోనూ ఆయన తనదైన శైలిలో రాణించారు. బాపట్ల ఎనిమి దో ఎంపీగా పనిచేసిన ఐదేళ్లకాలంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పను లు చేశారు. ప్రజోపయోగ కార్యక్రమాల కోసం తన
 సొంత నిధులను భారీగా ఖర్చు చేశారు. సాయం చేయడంలో ఆయన చేతికి ఎముక లేదని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చెబుతుంటారు. సినిమా రంగంలో అత్యున్నతస్థాయిలో ఉన్న దగ్గుబాటి బాపట్ల నుంచే రాజకీయ ఓనమాలు దిద్దారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడీ శీలంపై 92,457 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ పరిణితి చెందిన రాజకీయ వేత్తగా ప్రజాసేవకే అంకితమయ్యారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన మార్క్ అభివృద్ధి చేశారు. బాపట్ల మండలం అసోదివారిపాలెం పంచాయతీని దత్తత తీసుకుని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు.
 
 దాదాపుగా పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రయాణికుల సౌకర్యం కోసం బస్ షెల్టర్లు నిర్మించారు. ఇక్కడి రైతులకు కాలువ పనులు, ఇతర పొలం అవసరాలకు జేసీబీలు అవసరమయ్యేవి. వారి కోసం తన సొంత నిధులతో జేసీబీ, పొక్లెయిన్‌ను ఏర్పాటుచేశారు. ఏ రైతుకు వాటితో అవసరం వచ్చినా వాడుకునేలా ఇక్కడే ఉంచారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేశారు. ట్యాంకర్ కొనుగోలు చేసి వాటితో మంచినీటి సరఫరా చేశారు. నియోజకవర్గంలో రక్షిత మంచినీటి పథకానికి ఓవర్‌హెడ్ ట్యాంకులు కట్టించారు.
 
  రైతుల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను నిర్మించారు. బాపట్ల పట్టణంలో పార్కుల అభివృద్ధికి కూడా తోడ్పాటునందించారు. ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఎంపీ నిధులతో పనిలేకుండా సొంత నిధులను అధికంగా ఖర్చు చేశారు. వ్యక్తిగతంగా అడిగిన వారికి లేదనకుండా సాయం చేశారు. ఆయన పనిచేసిన ఐదేళ్లలో పార్లమెంటు నియోజకవర్గంలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేయించినట్లు చెబుతున్నారు. 2004లో ఆయన మళ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి చేతిలో ఓటమి చెందారు. అయినా నియోజకవర్గంపై ఆయనకు మమకారం తగ్గలేదు. నియోజకవర్గంలో ఏ పని కోసం ఎవరు వెళ్లినా పనులు చేసి పెట్టారు.
 
 పలువురి సంతాపం .. రామానాయుడు మృతికి పలువురు సంతాపం తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి, మాజీమంత్రి పనబాక లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, కౌన్సిలర్ చేజర్ల కోటేశ్వరమ్మ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
 కోన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు
 - ఎమ్మెల్యే రఘుపతి
 
 సినీ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడుకు కోన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. రామానాయుడు మృతి బాధాకరమని కోన సంతాపం తెలిపారు. మద్రాసు నుంచి సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకు వచ్చేందుకు తన తండ్రి కోన ప్రభాకర్ ఆర్థిక శాఖ మంత్రిగా రామానాయుడికి తోడ్పాటు అందించారని గుర్తు చేసుకున్నారు. 2003లో పట్టణంలోని టౌన్‌హాలులో కళాక్షేత్రం నిర్మించేందుకు నిధులు కోరిన వెంటనే రూ.10 లక్షలు విడుదల చేశారని కోన తెలిపారు. సినీ పరిశ్రమలోనూ మాటల రచయిత కోన వెంకట్‌తో రామానాయకుడు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. రామానాయుడు చనిపోవడంతో సినీ పరిశ్రమకే విషాదమని అభిప్రాయపడ్డారు.
 
 తెనాలిలో ఎన్టీఆర్ అవార్డు ప్రదానం
 తెనాలి రూరల్: తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో 2012లో నిర్వహించిన 2వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సినీ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడును ఎన్టీఆర్ అవార్డుతో సత్కరించారు.
 
 అన్ని భారతీయ భాషల్లో సినిమాలు తీసిన తన కెరీర్‌కు ఎన్టీఆర్ నటించిన రాముడు-భీముడు చిత్రం ప్రారంభమైతే, కొన్ని ఫ్లాపుల తర్వాత నిలబెట్టింది ప్రేమ్‌నగర్ సినిమాగా ఆయన చెప్పారు. అవార్డు అందుకున్న రోజునే ఆయన ఇక్కడి వైకుంఠపురంలోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. డాక్టర్ రామానాయుడు మరణవార్త తెలుసుకుని తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ సభ్యులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు