విభజనపై ఎన్టీఆరే ప్రకటనలు ఇచ్చారు: కేటీఆర్

24 Aug, 2013 03:16 IST|Sakshi
విభజనపై ఎన్టీఆరే ప్రకటనలు ఇచ్చారు: కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ కోరుకున్న తెలుగుజాతి సమైక్యత కోసం రాజీనామా చేస్తున్నట్టుగా టీడీపీ నేత హరికృష్ణ చెప్పడం పూర్తిగా అవాస్తవమని టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు కె.తారక రామారావు విమర్శించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించాలని ఎన్టీఆర్, ఎఎన్నార్ కలసి సంయుక్తంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని వెల్లడించారు. వాటికి సంబంధించిన పత్రికా ప్రతులను ఆయన విడుదల చేశారు. జై ఆంధ్రాకు మద్దతుగా కృష్ణ, విజయనిర్మల వంటివారు ఏకంగా దీక్షలే చేశారని గుర్తుచేశారు. అనేక మంది నటులు విభజనకు అనుకూలంగా ప్రకటనలు చేశారని వివరిం చారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలతో నిరసన చేయిస్తున్న తెలుగుదేశం పార్టీ తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకుందని దుయ్యబట్టారు.
 
  తెలంగాణ ఏర్పాటుకు టీడీపీ అనుకూలంగా ఉంటే.. పార్లమెంటును అడ్డుకుంటున్న ఆ పార్టీ ఎంపీలను చంద్రబాబు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే విద్వేషాలు లేని విభజనకు సహకరించాలని కేటీఆర్ సూచించారు. నరేంద్రమోడీ కోసం దేశం ఎదురు చూస్తున్నదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అంటే భారతదేశం అనుకున్నామని, ఇప్పుడు టీడీపీ ఎంపీలకు మద్దతు చేయడం చూస్తుంటే తెలుగుదేశం అని అర్థమైపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందేమోనని ఇప్పటిదాకా అనుకున్నామని, వెంకయ్యనాయుడు వ్యవహారంతో ఆ పార్టీపై మరోసారి అనుమానాలు పెరుగుతున్నాయని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఎప్పుడు పెడతారో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు