డబ్బులిచ్చిన వారికే ఉద్యోగాలు..

23 Mar, 2016 04:21 IST|Sakshi
డబ్బులిచ్చిన వారికే ఉద్యోగాలు..
 

ఐసీడీఎస్ బాలసదన్‌లో ఇష్టానుసారంగా కాంట్రాక్టు పోస్టుల భర్తీ
ఇంటర్వ్యూ జరపకుండా.., మెరిట్ జాబితా ఇవ్వకుండా..
అర్హులను కాదని అనర్హులకు పోస్టులు కట్టబెట్టిన వైనం

 
నెల్లూరు(అర్బన్) : జిల్లాలో మొత్తం ఐదు బాలసదన్ వసతి గృహాలున్నాయి. నెల్లూరు, గూడూరు, కోట బాలసదన్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మ్యూజిక్, డ్రాయింగ్, కంప్యూటర్, విద్యాబోధన, సైకాలజీ, సహాయకులు తదితర 43 పోస్టులను భర్తీ చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా జనవరి నెల 19వ తేదీన ఖాళీలను కాంట్రాక్టు పద్దతిన  భర్తీ చేస్తున్నామని,  జనవరి 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పత్రికాముఖంగా అధికారులు ప్రకటన ఇచ్చారు. డిగ్రీ, బీఈడీ, సోషల్ వర్క్, పదోతర గతి పాస్/ఫెయిల్ తదితర అర్హతలుండాలని చెప్పారు. అర్హతలను బట్టి అభ్యర్థులను ఎంపికజేసి ఇంటర్వ్యూకి పిలుస్తామని ప్రకటించారు. దీంతో 46 మండలాల నుంచి వందలాది మంది నిరుద్యోగులు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
 
 ప్రకటించని మెరిట్ జాబితా..
 ఎంఎస్సీ, డిగ్రీలు చేసిన వారిని ఎంతకీ ఇంటర్వ్యూకి పిలవలేదు. దీంతో వారు జనవరి 28వ తేదీ తర్వాత ఐసీడీఎస్ కార్యాలయం చుట్టూ తిరగడం ప్రారంభించారు. అధికారులు ఇంటర్వ్యూకి కాల్‌లెటర్ పంపిస్తామని వారికి   చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు పూర్తయినా ఇంటర్వ్యూలు జరపలేదు. అసలు పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితానే ప్రకటించలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా పోస్టులను భర్తీ చేశారు. దీంతో అసలైన అభ్యర్థులను కాదని డబ్బులు తీసుకొని ఉద్యోగాలు భర్తీ చేశారని దరఖాస్తుదారులు కొందరు ఆరోపిస్తున్నారు.

 చేతులు మారిన పైసలు..
పోస్టులను భర్తీ చేశారని తెలుసుకున్న పలువురు దరఖాస్తుదారులు ఏం జరిగిందా అని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది.  డబ్బులు తీసుకొని అనర్హులకు పోస్టులు కట్టబెట్టిన వైనం వెలుగుచూసింది. ఒక్కో పోస్టు భర్తీ కోసం రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు చేతులు మారినట్లు తెలిసింది. అలాగే అధికార పార్టీ నేతల సిఫార్సులు బాగా పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలానే గతంలోనూ అధికారులు రెండు దఫాలు నోటిఫికేషన్‌లు ఇచ్చి ఎవరీకీ తెలియకుండానే ఖాళీ పోస్టులు భర్తీ చే శారు. మెరిట్ జాబితా ఇవ్వకుండా పోస్టులు భర్తీ చేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. జిల్లా కలెక్టర్ కలుగ చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

మెరిట్ ప్రకారమే భర్తీ..
 ఐసీడీఎస్ పీడీ విద్యావతి సెలవులో ఉండటంతో  ఈ విషయమై సూపరింటెండెంట్ ఎలిజిబెత్‌ను సాక్షి వివరణ కోరింది.  రెండు, మూడు సార్లు ఫైలు తిప్పి పంపాక మెరిట్ ప్రకారమే తయారు చేసిన జాబితాను కలెక్టర్ ఆమోదించారని ఆమె చెప్పారు. అసలు మెరిట్ లిస్ట్‌ను తయారు చేయలేదు కదా అని అడగ్గా ఇప్పుడు మెరిట్ జాబితాను నోటీసు బోర్డులో పెట్టమని క్లర్కు సుధాకర్‌కు చెబుతానన్నారు.జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అభాగ్యులు, అనాథల కోసం నడిచే బాలసదన్ వసతిగృహాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారనేందుకు మరో ఉదాహరణ ఇది. కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులిచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టారు అధికారులు.. దీంతో అసలైన అర్హులు లబోదిబోమంటున్నారు. అంతా రహస్యంగా జరిగిన ఈ వ్యవహారం ప్రస్తుతం ఆశాఖలో చర్చనీయాంశంగా మారింది.
 

మరిన్ని వార్తలు