'నా టైమ్‌ వస్తే మిమ్మల్ని కాలితో తొక్కేస్తా'

15 Mar, 2020 10:23 IST|Sakshi

విత్‌డ్రా చేస్తుందని ఎంపీటీసీ అభ్యర్థినిని బంధించిన వైనం 

టీడీపీ శ్రేణుల నుంచి ఆమెను కాపాడిన పోలీసులు 

పోలీసులపై జులుం ప్రదర్శించిన మాజీమంత్రి 

అభ్యర్థిని ఫిర్యాదుతో బట్టబయలైన నాటకం

చేసేదంతా చేసి నెపాన్ని ఇతరులపై నెట్టేయడంలో రాటుదేలిన టీడీపీ నాయకులతో కలసి మాజీమంత్రి ఆడిన నాటకం రక్తికట్టలేదు. గంగవరం మండలంలో నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి పలమనేరులో శనివారం హైడ్రామా నడిచింది. ఏమి చేసినా తమ పప్పులు ఉడక్కపోవడంతో ఆ బాధనంతా పోలీసులపై చూపారు మాజీ మంత్రి అమరనాథరెడ్డి. జరిగిన సీన్‌ను తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైఎస్సార్‌సీపీ కుట్రేనంటూ  పోలీసులుపై నడివీధిలో విరుచుకుపడ్డారు.   

సాక్షి, పలమనేరు: గంగవరం మండలం కంచిరెడ్డిపల్లికి చెందిన సోమశేఖర్‌రెడ్డి భార్య కామాక్షమ్మ మామడుగు సెగ్మెంట్‌కు ఎంపీటీసీగా టీడీపీ తరఫున నామినేషన్‌ వేసింది. కుటుంబ సభ్యుల సూచనతో ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకుంది. పట్టణంలోని మాజీమంత్రి ఇంటికి సమీపంలో తన బంధువుల ఇంటి వద్ద ఆమె ఉండగా, గంగవరం మండల టీడీపీ నాయకులు మాజీమంత్రితో కలసి ఆమెను విత్‌డ్రా చేయవద్దంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఏఆర్‌ డీఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, సీఐ శ్రీధర్‌ సిబ్బందితో కలసి అభ్యర్థిని ఉన్న ఇంటి వద్దకెళ్లి టీడీపీ నాయకులను బయటకు పంపారు. ఆమెను బయటకు పిలిపించి, విచారించారు. తాను స్వచ్ఛందంగా నామినేషన్‌ విత్‌డ్రాకు వెళుతుంటే టీడీపీ నాయకులు వద్దంటూ ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. దీంతో ఆమెకు రక్షణ కల్పించి గంగవరం పోలీసుల ద్వారా ఎంపీడీఓ కార్యాలయానికి పంపారు.   

పోలీసులపై అక్కసు వెళ్లగక్కుతూ వస్తున్న అమరనాథ రెడ్డి, నాయకులు  
పోలీసులపై మాజీ మంత్రి ప్రతాపం 
తాము అనుకున్న పథకం సాగకపోవడంతో మంత్రి అక్కడున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం  చేశారు. ‘నా టైమ్‌ వచ్చినప్పుడు కాలితో తొక్కేస్తా, ఇది పనికిమాలిన రాజకీయం’ అంటూ పోలీసులపై తన ప్రతాపాన్ని చూపారు. పత్రికల్లో రాయలేని భాషలో దూషించారు. ప్రజలు చూస్తుండగానే పోలీసులు, ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కారు. పోలీసులను దూషించిన విషయాలను అప్పటికప్పుడే ఎస్పీకి  డీఎస్పీ  స మాచారమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పోలీసులు భద్రం చేశారు. చదవండి: మద్యం, డబ్బు పంపిణీపై ఉక్కుపాదం

మరో డ్రామాకు సిద్ధం 
జరిగిన సంఘటనను టీడీపీకి సానుభూతి దక్కేలా చేసే ప్రయత్నంలో భాగంగా మాజీ మంత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ ఎంపీటీసీ అభ్యర్థిని వైఎస్సార్‌సీపీ వారే బలవంతంగా విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నించారని, తాను వెళ్లి ఆమెకు రక్షణగా నిలిచానని తెలపడం విశేషం. పోలీసులే ఆమెతో విత్‌డ్రా చేయించారని బురదచల్లే ప్ర యత్నం చేశారు. 

పోలీసులకు అభ్యర్థిని ఫిర్యాదు 
జరిగిన సంఘటనపై అభ్యర్థిని కామాక్షమ్మ గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను టీడీపీ వారే విత్‌డ్రా చేయవద్దంటూ బలవంతం చేశారని, దీంతో పలమనేరు పోలీసులు తనను కాపాడారని తెలిపారు. తాను కుటుంబ సభ్యుల సూచన మేరకు స్వచ్ఛందంగా నామినేషన్‌ను విత్‌డ్రా చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాజీ మంత్రి నాటకం బట్టబయలైంది.  

మరిన్ని వార్తలు