‘ఫైళ్లు మోసుకుని..కాలినడకన పెట్టుబడులకు తిరిగా’

2 Mar, 2017 15:43 IST|Sakshi
కాలినడకన పెట్టుబడులకు తిరిగా: చంద్రబాబు

అమరావతి : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీని తన కోసం కాదని....ప్రజల కోసం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గురువారం వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గతంలో కట్టుబట్టలతో..పెద్ద ఎత్తున అప్పులతో విభజన జరిగినా అభివృద్ధి చేసి చూపించామన్నారు. రాష్ట్ర విభజన చాలా బాధాకరమని, ఎవ్వరినీ అడగకుండా కేవలం అరగంటలో విభజించారని ఆయన అన్నారు.

 ఫైళ్లు మోసుకుని..కాలినడకన పెట్టుబడుల కోసం తిరిగానని చంద్రబాబు చెప్పుకొచ‍్చారు. జరిగిన అన్యాయాన్ని అభివృద్ధితో పూడ్చగలం కానీ అవమానాన్ని మరువలేమన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుతో తన జీవితంలో ఎన్నడూ పడని ఆవేదన అనుభవించాను అని తెలిపారు. విభజన నాటి కసి..కోపం తగ్గడానికి వీల్లేదని, దాన్నుంచే అభివృద్ధి చేసి తీరాలన్నారు. ఇకపై ఈ గడ్డ నుంచే చట్టాలు చేస్తామన్నారు.  

ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం సీఎంగానూ.. ప్రతిపక్ష నేతగానూ ఉన్నానని, తనకు హైకమాండ్ ప్రజలేనని తెలిపారు. ఢిల్లీ వాళ్లకో.. వేరే పార్టీకో తాను ఏనాడూ తలొగ్గలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి తన కోసం చేయలేదని, తెలుగు జాతి కోసం చేశానని అన్నారు. అమరావతిని నెంబర్ వన్‌ రాజధానిగా తీర్చిదిద్దుతానని, ఎడారిగా మారుతోన్న రాయలసీమను సస్య శ్యామలంగా మార్చి రతనాల సీమగా మారుస్తానని, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథాన నడిపిస్తానని తెలిపారు.

ఉత్తరాంధ్ర వలసలను నిరోధిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మంచి పనులు చేసేటప్పుడు తనను విమర్శించినా పట్టించుకోనని,  ప్రజల కోసం..రాష్ట్రం కోసం.. భావి తరాల కోసం అన్నీ భరిస్తున్నానని చెప్పారు.అసెంబ్లీలో ప్రజల కోసం అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. బడ్జెట్‌లో పేదలకు భారీగా నిధులు కేటాయిస్తామని సీఎం తెలిపారు.

మరిన్ని వార్తలు