పెట్టుబడులతో రండి

28 Aug, 2018 03:35 IST|Sakshi
బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ బెల్‌ మోగిస్తున్న సీఎం చంద్రబాబు

బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ బెల్‌ మోగించిన సీఎం చంద్రబాబు

ఏపీలో ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వినతి

ప్రపంచం ఇప్పుడు రాష్ట్రం వైపు చూస్తోందని వెల్లడి

సాక్షి, అమరావతి: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో అనుకూల వాతావరణం ఉందని, ఇందుకు అమరావతి అభివృద్ధి బాండ్ల ద్వారా పెట్టుబడులే తాజా ఉదాహరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌(బీఎస్‌ఈ)లో సీఆర్డీఏకి చెందిన అమరావతి బాండ్ల లిస్టింగ్‌ బెల్‌ మోగించిన సీఎం చంద్రబాబు.. పలువురు ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులతో హోరెత్తించాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. హైదరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధి ద్వారా మంచి పేరు తెచ్చి పెట్టగలిగామని, అలాగే అమరావతిని పెద్దఎత్తున అభివృద్ధి చేయతలపెట్టామని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బీఎస్‌ఈ అధికారులను చంద్రబాబు కోరారు. సృజనాత్మక విధానాలదే భవిష్యత్‌ అని, దాని ద్వారానే అనేక కొత్త కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తూ జ్ఞాన భూమిగా మారుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పాలనలో రియల్‌ టైం గవెర్నెన్స్‌ కీలక భూమిక పోషిస్తోందన్నారు. సమర్థ ఆర్థిక నిర్వహణ, ఈ–ఆఫీస్, కంటెంట్‌ కార్పొరేషన్‌ వంటి వినూత్న ఆవిష్కరణలు రాష్ట్ర పరిపాలనలో ఒక కొత్త ఒరవడి సృష్టించాయని వివరించారు. బీఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.  

అమరావతిపై ప్రజెంటేషన్‌
అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు ముంబై తాజ్‌ పాలెస్‌లో పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలని, 2050 నాటికి ప్రపంచంలో బెస్ట్‌ డెస్టినేషన్‌గా ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన భూ బ్యాంకు అందుబాటులో ఉందని, భవిష్యత్‌లో విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పారు. పారిశ్రామిక వేత్తలకున్న ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వనరులకు సంబంధించిన సమాచారం అంతా సిద్ధంగా ఉందన్నారు. వాటిని వినియోగించుకుని పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. రాష్ట్రంలో పర్యాటక పరంగా అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాజధానికి రైతులు ఇచ్చిన భూమిలో కొంత భాగాన్ని పెట్టుబడులకు కేటాయించి అమరావతిని ఆర్థిక వనరుల కేంద్రంగా మార్చనున్నట్లు తెలిపారు.  

టాటా గ్రూప్‌ భాగస్వామ్యం కావాలి
ఆంధ్రప్రదేశ్‌లో హోటల్, పర్యాటక శాఖ, ఎలక్ట్రికల్‌ బస్సు రవాణా వంటి రంగాల్లో భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు టాటా గ్రూప్‌ను ఆహ్వానించారు. టాటా సంస్థ మాజీ చైర్మన్‌ రతన్‌ టాటాతో కలిసి సీఎం ముంబైలో టాటా ఎక్స్‌పిరియన్స్‌ సెంటర్‌ను సందర్శించారు. టాటా గ్రూప్‌ సామాజిక పరంగా చేపట్టిన మహిళా సాధికారత వంటి కార్యక్రమాలపై ప్రాజెక్టులను టాటా అధికారులు వివరించారు. వెల్‌స్పన్‌ గ్రూపు చైర్మన్‌ బాలకృష్ణ గోయెంకాతోనూ సీఎం భేటీ అయ్యారు. సేంద్రియ పత్తి సాగులో ఆంధ్రప్రదేశ్‌తో ఉమ్మడిగా పని చేయడానికి ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర కన్నా 33 శాతం అధిక ఆదాయం పొందేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని గోయెంకా వివరించారు. దీనిపై ప్రతిపాదనలతో రావలసిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, పెట్టుబడులు, మౌలిక సౌకర్యాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఎం ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్, రాష్ట్ర ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈవో జె.కృష్ణ కిశోర్, రియల్‌ టైం గవెర్నెన్స్‌ సీఈవో బాబు అహ్మద్, సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు