వరదలో రాజధాని

21 Aug, 2018 02:56 IST|Sakshi
రాజధాని ప్రాంతంలోని కొండవీటి వాగు ఉధృతి వల్ల నీరుకొండ వద్ద నీటి మునిగిన పొలాలు

     రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయం

     డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి చేరిన మురుగు నీరు

     నాలుగు వేల ఎకరాల్లో పంటలు మునక.. 

     తాడేపల్లిలో 14సెం.మీ, తుళ్లూరులో 12సెం.మీ., తాడికొండలో 9.6సెం.మీ.ల వర్షపాతం

     ప.గో జిల్లా కోయిడాలో 38.8 సెం.మీల రికార్డు వర్షం.. 

     ధవళేశ్వరం వద్ద రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ

     రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే వంతెనపై, ధవళేశ్వరం వద్ద భారీ వాహనాలకు బ్రేక్‌.. 

     తూర్పులో పడవ బోల్తా.. ఒకరి గల్లంతు

     స్థిరంగా అల్పపీడనం.. నేడూ వర్షాలు

సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి/నెట్‌వర్క్‌: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో శనివారం నుంచి కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. డ్రైనేజీ పొంగిపొర్లడంతో ఇళ్లలోకి మురుగు నీరు చేరింది. తాడేపల్లిలో 14 సెం.మీ, తుళ్లూరులో 12, తాడికొండలో 9.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. పాలవాగు, కొండవీటి వాగు, కోటెళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

చెరువులను తలపిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రోడ్లు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిర్మాణంలో ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రోడ్లు నీట మునిగాయి. డ్రైనేజీ, కేబుళ్ల కోసం తీసిన గుంతల్లో ఏడడుగుల మేర నీరు నిలిచింది. అలాగే, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో నిర్మించనున్న బ్రిడ్జిల కోసం తవ్విన గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. ఇక రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాలవాగు, కొండవీటి వాగు, కోటెళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో తుళ్లూరు–గుంటూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దపరిమి వద్ద కోటెళ్ల వాగు కూడా అదే స్థాయిలో ప్రవహిస్తోంది. తాడికొండ మండల పరిధిలో సుమారు మూడు వేల ఎకరాల పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. తాడేపల్లి పరిధిలో మరో వెయ్యి ఎకరాల్లో నీరు నిలిచి ఉంది. 

నాలుగేళ్లుగా ఏటా ఇంతే..
ప్రపంచ స్థాయి రాజధాని అంటూ సీఎం పదేపదే గొప్పలు చెబుతున్నారు తప్పితే రాజధాని పరిధిలోని గ్రామాల్లో నాలుగేళ్లల్లో సరైన రోడ్లు, డ్రైనేజీ నిర్మించలేకపోయారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇంతవరకు కనీస మౌలిక వసతులు లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితని వాపోతున్నారు. మరోవైపు, రాజధానిలో అనేక చెరువులను పూడ్చివేయడంతో వర్షపు నీరు వెళ్లే మార్గంలేక ఆ నీరంతా గ్రామాల్లోకి వెళ్తోంది.

ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
ఎగువ ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతరూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇటు గోదావరి, అటు శబరి నదులు పొంగి పొర్లడంతో ఏజెన్సీలో భయాందోళనలు నెలకొన్నాయి. విలీన మండలాల్లో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉధృతి కారణంగా కాటన్‌ బ్యారేజి, రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయగా.. సాయంత్రం నుంచి రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి నుంచి అనుమతిచ్చారు. చింతూరు మండలం చట్టి–చిడుమూరు మధ్య విజయవాడ–జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తడంతో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలో 30 గ్రామాలకు వాహనాలపై రాకపోకలు నిలిచిపోయాయి. పడవల మీద ప్రయాణాలను రద్దు చేశారు.

కోనసీమపై కూడా వరద ప్రభావం అధికంగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయపాళెంతోపాటు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ముంపునకు గురైన 22 మండలాల్లోని 28 గ్రామాల్లో సుమారు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆరు రాష్ట్ర విపత్తు సహాయక బృందాలకు చెందిన 220 మంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఇక విజయనగరం జిల్లాలోని గంట్యాడ, బాడంగి, జామి, మెంటాడ, గజపతినగరం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. పట్టణంలో పెద్ద చెరువు కింద, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖ నగరంలో ఆదివారం రాత్రి కుంభవృష్టి కురిసింది. మరోవైపు.. కోస్తాంధ్రలోనూ వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. తమ్మిలేరు ఉప్పొంగడంతో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు, పరిసర గ్రామాలు నీటి మడుగులా మారాయి. 

పశ్చిమ గోదావరిలో రికార్డుస్థాయి వర్షం
గత 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లా కోయిడాలో 38.8 సెం.మీల రికార్డు స్థాయి వర్షం కురిసింది. ఇదే జిల్లాలోని కుకునూరులో 29.1, వేలేరుపాడులో 28.1, కృష్ణా జిల్లాలోని తిరువూరులో 19.1, తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపూర్‌లో 16.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

నీట మునిగిన పొలాలు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పత్తి, మిరప, బీర, టమోటా, కాలిఫ్లవర్, బెండ, వంగ తదితర కూరగాయల తోటల్లో నీరు నిలిచాయి. అనేక ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగడంతో గుంటూరు జిల్లాలోని బాపట్ల, పిట్టలవానిపాలెం, భట్టిప్రోలు మండలాల్లో దాదాపు 700 ఎకరాల్లో వెద పద్ధతిలో సాగు చేసిన వరి చేలు దెబ్బతిన్నాయి. పంట పొలాల నుంచి నీరు బయటకు వెళ్లకపోవడంతో మొలక చనిపోయింది. జిల్లాలోని పశ్చిమ డెల్టా ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. ఈ జిల్లాలో 3 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగవుతుండగా వర్షాలకు పూత రాలిపోతోంది.

వర్షాలు కొనసాగితే తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 94,011 ఎకరాల్లో వరి చేలు, 1,572 ఎకరాల్లో పత్తి నీట మునిగింది. విశాఖ జిల్లా పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో దాదాపు 50 ఎకరాల్లోని వరిపంట నీట మునిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జల్లేరు, ఎర్రకాల్వ, తమ్మిలేరు జలాశయాలకు భారీఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తివేయడంతో దిగువునున్న వేలాది ఎకరాల పంట నీటమునిగింది.

పడవ బోల్తా.. యువకుడి గల్లంతు
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని గౌతమీ గోదావరి పాయలో 15మంది రైతులున్న నాటు పడవ బోల్తా పడిన సంఘటనలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మిగిలిన 14మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరోవైపు.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం తెల్లవారుజామున మహాగణపతి విగ్రహం వద్ద క్యూలైన్‌పై కొండ రాళ్లు జారిపడ్డాయిద్దా సమయంలో క్యూలైన్‌లో భక్తుల రద్దీ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అలాగే, నగరంలోని వన్‌టౌన్‌ ప్రాంతంలోని కొండ ప్రాంతాల్లో తెల్లవారుజామున రెండు చోట్ల రిటైనింగ్‌ వాల్‌ జారి సమీపంలోని నివాసాల మీద పడటంతో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

కృష్ణా జిల్లాలో తిరువూరు మండలం టేకులపల్లి వద్ద వాగులో చిక్కుకున్న రామకృష్ణ అనే రైతును, వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామంలో వరదల్లో చిక్కుకున్న మామిడి తోట కాపలాదారులు నలుగుర్ని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద గల వందేళ్ల నాటి బైనేరు బ్రిడ్జి వరద ఉధృతికి సోమవారం కుప్పకూలింది. దీంతో జంగారెడ్డిగూడెం వైపు నుంచి రాజమండ్రి వైపు రహదారి తెగిపోయింది. ప్రమాదం సమయంలో బ్రిడ్జిపై ఇద్దరు ద్విచక్ర వాహన చోదకులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాగా, ఈ జిల్లాలో ఆదివారం రాత్రి గుబ్బల మంగమ్మ  దర్శనానికి వెళ్ళి అనుకోకుండా వరదల తాకిడికి అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయిన సుమారు ఏడు వందల మందిని సోమవారం ఉదయం రెస్క్యూ టీములు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. విశాఖ జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏజెన్సీలో మూడు పెంకుటిళ్లు నేలకూలాయి.

మొరాయించిన గేట్లు
కర్నూలు జిల్లా తుంగభద్రలో వరద పోటెత్తడంతో గేట్లు తెరిచి దిగువకు వరదను వదిలేందుకు అధికారులు ప్రయత్నించగా 11 గేట్లు మొరాయించాయి. చేసేదిలేక స్కావర్‌ వెంట్లను తెరిచి వరదను దిగువకు విడుదల చేశారు. అలాగే, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఆదివారం రాత్రి ఎర్రకాలువ ఉప్పొంగింది. వరదను దిగువకు విడుదల చేసేందుకు ప్రాజెక్టుకు చెందిన నాలుగో గేటును తెరిచేందుకు అధికారులు యత్నించారు. కానీ అది తెరుచుకోలేదు. వరద ఉధృతికి కరకట్ట ఎడమ వైపున దెబ్బతింది. ఈ రెండు ఉదంతాలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నాయి. క్రస్ట్‌ గేట్లు, రివర్‌ స్లూయిస్‌లు, స్కావర్‌ వెంట్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయకపోవడం, ఏటా ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకపోవడంవల్ల ఇవి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సుంకేసుల బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులను 2017లో నీరు–చెట్టు కింద టీడీపీ నేతలకు అప్పగించారు. రూ.8 కోట్ల బిల్లులు మింగేశారు గానీ.. మరమ్మతులు సక్రమంగా చేయకపోవడంవల్లే గేట్లు మొరాయించినట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే, 2009లో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదతో శ్రీశైలం జలాశయం ఫ్లంజ్‌పూల్‌లో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యిని పూడ్చాలని ఎప్పటికప్పుడు నిపుణులు హెచ్చరిస్తున్నా ఇప్పటివరకూ పట్టించుకోకపోవడం ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వానికున్న శ్రద్ధ తెలియజేస్తోంది. ఎర్ర కాలువ గేట్లదీ ఇదే పరిస్థితి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పలు మధ్య తరహా ప్రాజెక్టుల గేట్లదీ ఇదే దుస్థితి కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు