నిందితులకు షెల్టర్‌జోన్‌గా అమరావతి

18 May, 2019 04:01 IST|Sakshi
ఏపీలోని టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి వద్ద ఆశ్రయం పొందుతున్న రవిప్రకాశ్, ఏపీఎస్పీ 6వ బెటాలియన్, ఇతర రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్న ఐటీ గ్రిడ్‌ అశోక్‌

తెలంగాణలో కేసులు ఆంధ్రప్రదేశ్‌లో దాగుడుమూతలు

చీటింగ్‌ కేసులో నిందితులు రవిప్రకాష్, శివాజీలకు ఏపీలో షెల్టర్‌

ఇటీవల డేటా స్కామ్‌లో ఐటీ గ్రిడ్స్‌ ఎండీ అశోక్‌కు అభయం

ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు గతంలో ఆశ్రయం

గరుడ పురాణం వల్లించిన శివాజీకి అండదండగా చంద్రబాబు టీమ్‌

సాక్షి, అమరావతి: సంచలనం రేకెత్తించిన కీలక కేసుల్లో నిందితులకు అమరావతి షెల్టర్‌ జోన్‌గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో అడ్డగోలుగా దొరికిపోయి, కేసుల్లో చిక్కుకున్న నిందితులు ఆంధ్రప్రదేశ్‌లో దాగుడుమూతలు ఆడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమన్నది బహిరంగ రహస్యం. ఓటుకు నోటు కేసు, డేటా స్కామ్, టీవీ 9కు సంబంధించిన చీటింగ్‌ కేసు వంటి వాటిలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికి పోయిన వారికి చంద్రబాబు అభయం ఇచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రమేయం ఉన్న కేసుల నుంచి, తన ప్రయోజనం కోసం పనిచేసే వారి కేసుల వరకు నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించేలా పరిణమిస్తున్నాయి.

అనేక కేసుల్లో నింది తులను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినట్టుగానే తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడైన సినీ నటుడు శివాజీలకు ఏపీలో షెల్టర్‌ ఇచ్చినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై తెలంగాణా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు శివాజీలు టీడీపీ పెద్దల సంరక్షణలో విజయవాడ, ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన వీరిని ప్రకాశం జిల్లాలోని ఒక రిసార్ట్స్‌లోను, మరో ఫామ్‌హౌస్‌లోను రెండు రోజుల క్రితం వరకు సకల సౌకర్యాలతో సాకినట్టు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సంరక్షణలోనే రవిప్రకాశ్‌ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. శివాజీకి కూడా విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో షెల్టర్‌ ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  

ఇప్పటికే తనపై పోలీసులు సీఆర్‌పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్‌ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉంటే అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు గడువు కావాలంటూ రెండు రోజుల క్రితం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఈ మెయిల్‌ పంపించడం గమనార్హం. ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్‌ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్‌పై సంతృప్తి చెందని తెలంగాణ పోలీసులు వారు ఎక్కడ ఉన్నా అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగడం గమనార్హం.

ఇప్పటికే రెండు పర్యాయాలు రవిప్రకాశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. రవిప్రకాశ్‌ అరెస్టుకు రంగం సిద్ధమైన తరుణంలో ఆయన్ను కాపాడేందుకు నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండటం విమర్శలకు తావిస్తోంది. రవిప్రకాశ్‌ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు చంద్రబాబు నేరుగా రామోజీరావును కలవడం కలకలం రేపుతోంది.  తన రాజగురువు రామోజీరావు ద్వారా టీవీ 9 యాజమాన్యానికి చెందిన రామేశ్వర్‌కు నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.  

ఇప్పటికీ దొరకని అశోక్‌ ఆచూకీ..
తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ అడ్డగోలుగా డేటా స్కామ్‌కు పాల్పడిన వ్యవ హారంలో ప్రధాన పాత్రధారి ఐటీ గ్రిడ్స్‌ ఎండీ దాకవరపు అశోక్‌ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అశోక్‌ తెలంగాణ పోలీసులకు చిక్కితే ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దల బండారం బయట పడుతుందనే భయంతో అతన్ని చంద్రబాబు సర్కారే కాపాడుతోందనే అనుమానాలున్నాయి.  ఆధార్‌ డేటాబేస్‌కు ఏపీ, తెలంగాణకు ప్రజల 7,82,21,397 రికార్డులు లింక్‌ అయ్యాయని, ఆధార్‌తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌) నిగ్గు తేల్చి, ఇప్పటికే ప్రా«థమిక రిపోర్టు ఇచ్చింది. అశోక్‌ను కాపాడేందుకు ఏపీఎస్‌పీ 6 బెటా  లియన్‌తోపాటు ఇతర రహస్య ప్రాంతాలకు తరలిస్తూ షెల్టర్‌ ఇస్తున్నట్టు సమాచారం. అశోక్‌ తెలంగాణ పోలీసులకు దొరక్కుండా ఏపీ సర్కార్‌ షెల్టర్‌ ఇవ్వడంతోపాటు ఇంటె లిజెన్స్‌కు చెందిన ఇద్దరు గన్‌మెన్‌లను కూడా ఇచ్చి వీఐపీ భద్రత కల్పించినట్టు ఓ సీనియర్‌ పోలీసు అధికారి చెప్పారు. 

ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు షెల్టర్‌
తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికేసిన చంద్రబాబు..ఆ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీకి చెందిన జెరుసలేం మత్తయ్యకు అప్పట్లో  విజయవాడలో షెల్టర్‌ ఇచ్చారు. ఓటుకు కోట్లు కేసును రాజకీయం చేసి దాని నుంచి తప్పించుకునేలా ఏపీలోనూ చంద్రబాబు కేసులు పెట్టించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌)ను ఏర్పాటు చేసి అది కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. 

గరుడ పురాణం  శివాజీకి దన్ను
ఇటీవల బీజేపీ, వైఎస్సార్‌సీపీలపై అనేక కట్టుకధలు అల్లిన గరుడ పురాణం సృష్టికర్త శివాజీ కొంతకాలం పాటు అజ్ఞాతంలో వెళ్లిపోయి ఎన్నికల సమయంలో ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబుకు నమ్మిన బంటులా వ్యవహరిస్తున్న సినీనటుడు శివాజీ గరుడ పురాణం స్క్రిప్ట్‌ అంతా టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఒక మంత్రి సహకారంతో సిద్ధం చేసినట్టు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రాజకీయపరమైన అనిశ్చితిని కల్పించేలా, ప్రతిపక్షం, కేంద్ర ప్రభుత్వంపైన అభూతకల్పనలతో ఆయన చెప్పిన గరుడ పురాణం గుట్టు విప్పేలా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలన్న డిమాండ్‌ రావడంతో ముందు జాగ్రత్తగా ఆయన అదృశ్యమయ్యారు.

ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరగబోతోందని ముందే చెప్పిన శివాజీ ఆ విషయం ఎలా గుర్తించారు? ఆయనకు టీడీపీ పెద్దలు ముందే లీకులు ఇచ్చి చెప్పించి నెపం వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేశారా? అనే అనేక ప్రశ్నలకు ఆయన్ను విచారిస్తేనే జవాబులు తెలుస్తాయనే బలమైన వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కొంతకాలం, అమెరికాలో మరికొద్ది రోజులు ఆయన తలదాచుకోవడం వెనుక టీడీపీ పెద్దల దన్ను ఉందనేది బహిరంగ రహస్యం. 

మరిన్ని వార్తలు