ఔను.. తుస్‌ చాలెంజే!

3 May, 2017 08:02 IST|Sakshi
ఔను.. తుస్‌ చాలెంజే!

► రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు సింగపూర్‌ కన్సార్టియంకు అప్పగింత
► రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర
► రూ. 5,721 కోట్లు ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం
► రూ. 306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్‌ కన్సార్టియం వాటా 58%
► త్వరలో ఏడీసీ, కన్సార్టియం ఒప్పందం


సాక్షి, అమరావతి: అంతా ముందు నుంచి అనుకున్నట్లే పక్కా ప్రణాళికతో జరిగిపోయింది. రాజధానిలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టింది. స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని తుస్సుమనిపిస్తూ.. ఇతర కంపెనీలేవీ బిడ్‌లు దాఖలు చేయకుండా, తాము కోరుకున్న కన్సార్టియంకే ఈ ప్రాజెక్టు దక్కేలా ప్రభుత్వ పెద్దలు సాగించిన మంత్రాంగం ఫలించింది. ఈ మేరకు మంత్రివర్గం దీనికి ఆమోదముద్ర వేసింది.

వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. అసెండాస్‌–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్‌లతో కూడిన సింగపూర్‌ కంపెనీల కన్సార్టియంకు స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో తన పెట్టుబడితోసహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా, కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్‌ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం. రాజధానిలో ప్రాజెక్టు పేరిట సింగపూర్‌ కంపెనీలతో కలిసి రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి ‘ముఖ్య’నేత స్కెచ్‌ వేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టులో 58 శాతం వాటాను సింగపూర్‌ కంపెనీలకు ఇచ్చి, కేవలం 42 శాతం వాటా మాత్రమే తాను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అగీకరించింది. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో గ్లోబల్‌ టెండర్‌ పిలిచినా ఇతరులెవరూ పోటీ బిడ్లు దాఖలు చేయకపోవడంతో సింగపూర్‌ కన్సార్టియంకే ఈ ప్రాజెక్టును అప్పగిస్తూ కేబినెట్‌ తీర్మానించింది. కేబినెట్‌లో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను చంద్రబాబు స్వయంగా మీడియాకు వెల్లడించారు.

స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కింద రాజధాని కోర్‌ ఏరియాలో 1,691 ఎకరాలను సింగపూర్‌ కన్సార్టియంకు అప్పగిస్తారు. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) కలిసి 15 సంవత్సరాల్లో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో 656, రెండో దశలో 514, మూడో దశలో 521 ఎకరాలను కన్సార్టియంకు అప్పగిస్తారు. మొదట 50 ఎకరాలను నామమాత్రపు ధరకే ఇస్తారు. లాభాల్లో 42:58 శాతం వాటాలు పంచుకోవడంతోపాటు భూమికి సంబంధించిన గ్రాస్‌ టర్నోవర్‌లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.

అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ), సింగపూర్‌ కన్సార్టియం కలిసి అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్‌(ఏడీపీ)గా ఏర్పడి ఈ ప్రాజెక్టును చేపడతాయి. అభివృద్ధి చేసిన ప్లాట్లను వేలం ద్వారా ప్రపంచంలోని కంపెనీలకు ఏడీపీ కేటాయిస్తుంది. మరోవైపు మౌలిక సదుపాయాలకు అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్‌ (ఏడీపీ) రూ.2,118 కోట్లను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. స్టార్టప్‌ ఏరియాలో మొదటి దశలో 8–9 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో ఏడీసీ, సింగపూర్‌ కన్సార్టియం ఒక ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

మరిన్ని వార్తలు