ఏటి ‘గొప్పా’క

4 Nov, 2019 05:13 IST|Sakshi

అంకుడు కర్ర నుంచి అద్భుత కళారూపాలు

సహజసిద్ధమైన రంగులతో చిరకాల మన్నిక

ఇంటీరియర్‌ డెకరేషన్‌లో విరివిగా వినియోగం

ఖండాంతర ఖ్యాతి పొందిన మన ఊరి బొమ్మ

యలమంచిలి రూరల్, అచ్యుతాపురం: విశాఖ జిల్లా యలమంచిలి మండలం వరాహనది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామంలో అంకుడు కర్రతో రూపొందించిన బొమ్మలు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించాయి. ఇక్కడి కళాకారులు  సహజసిద్ధంగా లభించే కర్ర,, మైనం, సహజ రంగులతో తమ సృజనకు పదునుపెట్టి అనేకరూపాల్లో బొమ్మలు తయారు చేస్తారు. ఏటా ఈ గ్రామం నుంచి రూ. 10 కోట్ల వ్యాపారం జరుగుతోంది.  రిటైల్‌ అమ్మకం దారులు, సరుకురవాణాచేసేవారు.. ఇలా అనేక కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఏటికొప్పాక కళ వందేళ్లక్రితం ఉప్పుచిప్ప, కుంకుమ భరిణి, పిల్లలు ఆడుకునే దొండకాయ తయారీతో ప్రారంభమయింది. 

ఒక తరం నుంచి మరో తరానికి.. 
ఏటికొప్పాక బొమ్మల తయారీకి ఎటువంటి శాస్త్రం లేదు. ఒక తరం నుంచి మరోతరం నేర్చుకోవడమే జరుగుతోంది. ఒక బొమ్మ తయారీకి 3 నుంచి 10 విడిభాగాలు తయారుచేస్తారు. పలు బొమ్మల సమాహారం ఒక చిత్రరూపంగా రూపొందుతుంది. అంకుడు కర్రను విడిభాగాలుగా చెక్కి వాటికి మైనం పూస్తారు. ఒక్కొక్క భాగానికి రంగులు అద్ది ఆరబెడతారు. విడిభాగాలన్నీ కలిపి బొమ్మ తయారుచేస్తారు. రాజు, రాణి, పల్లకీ, భటులు.. ఇలా బొమ్మలను కలిపి చిత్రరూపంగా తయారుచేసి అమ్మకానికి పెడతారు. చారిత్రక కథారూపాలు, గ్రామీణ ఉత్సవ సందడి, అన్నమయ్య, దశావతారాల ఆలయం, పెళ్లిసందడి, రథం, పల్లెటూరు, ఎడ్లబండి వంటి చిత్రరూపాలను కళాకృతులుగా తయారుచేసి ఏటికొప్పాక కళాకారులు తమ సత్తా చాటారు.  

వైఎస్సార్‌ ఆసరాతో ఉలి పట్టిన బాలికలు 
కొన్నాళ్ల క్రితం వరకు కళాఖండాల తయారీలో మహిళలు ఉలిపట్టుకునేవారు కాదు. మగవారు బొమ్మల్ని తయారుచేస్తే మహిళలు మైనం, రంగులు అద్దేవారు. వైఎస్సార్‌ హయాంలో రూ. 50 లక్షలతో గ్రామంలో కళాకారులకు కమ్యూనిటీహాల్‌ నిర్మించారు. ప్రత్యేక కాలనీ, విద్యుత్‌ మోటార్లు ఇచ్చారు. కళాకారుల సంక్షేమ సంఘం ద్వారా పాఠశాల స్థాయిలో బొమ్మల తయారీపై శిక్షణ ప్రారంభించారు. దీంతో ఎక్కువగా బాలికలు బొమ్మల తయారీ నేర్చుకుంటున్నారు. విద్యుత్‌ మోటార్ల వినియోగం పెర గడంతో బొమ్మల తయారీలో శారీరక శ్రమ తగ్గింది. 

అవార్డుల పంట 
అంకుడుకర్రతో కళాకృతులు రూపొందించి ఈ గ్రామానికి చెందిన  కళాకారులు అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. శ్రీశైలపు చిన్నయాచారి 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. శ్రీశైలపు రమణ, పెదపాటి ఆనందాచారి జాతీయ మెరిట్‌ పురస్కారం పొందారు. పీఆర్వీ సత్యనారాయణ, కొత్తలి శ్రీను, కె.సోమేశ్వరరావు, లక్కరాజు నాగేశ్వరరావు, పెదపాటి శివకృష్ణ రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారు.  

‘అమ్మ’కాల్లో అగ్రస్థానం...  
బిడ్డను ఎత్తుకొని లాలించే అమ్మ బొమ్మను ఏటికొప్పాక కళాకారులు దశాబ్దం క్రితం రూపొందించారు. ఈ బొమ్మ విశేష ఆదరణ పొందింది. ఈ ఆకృతిలో ఉండే బొమ్మల అమ్మకాలే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఏటా వేల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఈ బొమ్మనే చాలా కార్యక్రమాల్లో అవార్డుగా ప్రదానం చేస్తున్నారంటే దీని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలోనూ ఏటి కొప్పాక బొమ్మల్నే మెమెంటోలుగా అందజేశారు.

తరతరాలుగా కొనసాగుతున్న కళ.. 
బొమ్మల తయారీని తరతరాల నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్నాము. బ్రిటీషు వారి హయాంలోనే కుంకుమ భరణి, ఉప్పుచిప్ప, దొండకాయ, పెళ్లికొడుకు పెళ్లికూతురు బొమ్మల్ని చెక్కారు. ఉప్మాక తీర్థంలో అమ్మకానికి పెట్టేవారు. 1910 నాటికి మా తాత పెదపాటి సత్యం హయాంలో చిలుకలు ,పెళ్లికి వ్రతంకి నగిసీలుదిద్దిన పీటలు, డబ్బులపెట్టి తయారుచేసేవారు. మా నాన్న ఆనందాచారి హయాంకి నాజూకైన బొమ్మల తయారీపై దృష్టి పెట్టారు. మా నాన్నగారి హయాంలో రంగులను తగుమోతాదులను మార్చడంద్వారా కొత్తరంగులను కనుక్కున్నారు. ద్రాక్ష గుత్తులు, అరటి పళ్లు వంటివి తయారుచేసేవారు. మా తరంలో ఆలయ సముదాయం, గుర్రపు బండి పెండ్లిసందడి వంటి సన్నివేశాలను ప్రదర్శించేలా కళాకృతుల సమ్మేళనాలను తయారుచేస్తున్నాము. అప్పట్లో ఈ పరిశ్రమ లాభసాటిగా ఉండేది.  ఈ మధ్య చైనా బొమ్మల పోటీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రోత్సాహం ఉంటే మరింత మంది కళాకారులు తయారయ్యే అవకాశం ఉంది.
– పెదపాటి శరత్, జాతీయఅవార్డు గ్రహీత

సిరామిక్, ప్లాస్టిక్‌తో తయారు చేసే దేశ, విదేశీ బొమ్మలు కుప్పలు తెప్పలుగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఏటి కొప్పాక బొమ్మల్లో సహజసిద్ధమైన రంగుల్ని మాత్రమే వినియోగించడం వల్ల ఎన్నాళ్లు ఉన్నా గాలిలో రసాయన మార్పులు చెందవు.  

సహజరంగుల తయారీ ఇలా.. 
మైనంకి ఎటువంటి రంగు ఉండదు. మైనం కరిగించి దీనిలో స్వయంగా తయారు చేసుకున్న సహజ రంగుల్ని కలిపి కర్రకు పూస్తారు. 
ఎరుపు రంగు: బిక్షా ఒరిల్లా  విత్తనాల నుంచి ఎరుపురంగు తయారుచేస్తారు. కేజీ విత్తనాలను లీటరు నీటిలో నానబెట్టి రంగునీళ్లు సేకరిస్తారు. దీన్ని మరిగించడంతో చిక్కటి ఎరుపురంగు ద్రావణం తయారవుతుంది. నీలంరంగు: ఇండిగో మొక్కల ఆకులనుంచి నీలంరంగు సేకరిస్తారు. ఇండిగో ఆకుల్ని డ్రమ్ములో కుళ్లబెట్టి పసరు తీస్తారు. ఈ పసరును ఘనీభవింపజేసి ఇండిగో రంగు ముక్కలుగా నిల్వచేసుకుంటారు.  పసుపురంగు: పసుపు కొమ్ములనుంచి తీసుకుంటారు. మైనంలోకలిపి వినియోగిస్తారు. ఆకుపచ్చరంగు: ఇండిగో ముక్కల్లో పసుపు కలపడంతో తయారవుతుంది.  నలుపురంగు: పాడైపోయిన నల్లబెల్లం, ఇనుపతుప్పుని వేడినీళ్లలో కలిపి నెలరోజులపాటు కుండలో నిల్వచేస్తారు. కరక్కాయ తొక్కల్ని నీటిలో మరిగించి కషాయం తయారుచేస్తారు. నల్లబెల్లం నీటి కషాయాన్ని కలిపి మరిగిస్తే నల్లరంగు వస్తుంది. ప్రధానరంగులను తగు మోతాదులో కలపడం ద్వారా కళాకారులు తమకు అవసరమైన పలు వర్ణాలు తయారు చేసుకుంటారు. 

కళ నిలబడాలంటే.. 
- అటవీశాఖ ఆధ్వర్యంలో అంకుడు కర్ర సాగు చేపట్టాలి. కర్ర సరఫరాలో అడ్డంకులు లేకుండా చూడాలి. కర్ర సాగు, అమ్మకాన్ని చట్టబద్ధం చేయాలి.  
- కళాకారులకు వడ్డీలేని రుణాలు అందించాలి. సొసైటీద్వారా షెడ్లు నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి.
- మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ , బస్‌కాంప్లెక్స్‌ పరిధిలో దుకాణాలు ఏర్పాటుచేసుకోవడానికి స్థలాలు కేటాయించాలి. 
కళలో కంప్యూటర్‌ డిజైనింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జొప్పించాలి.
చైనా బొమ్మలను తెచ్చి ఏటికొప్పాక బొమ్మలుగా నమ్మంచి అమ్ముతున్న వర్తకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

పింఛను సౌకర్యం కల్పించాలి.. 
కళ నేర్చుకోవడం మానసిక స్థైర్యాన్నిస్తుంది. ఈ నమ్మకంతోనే బాలికలు ఎక్కువ మంది బొమ్మల తయారీ నేర్చుకుంటున్నారు. మా పూర్వీకుల నుంచి పారంపర్యంగా దీన్ని నేర్చుకుంటున్నాము. సీనియర్‌ కళాకారులకు ప్రభుత్వం పింఛన్‌ సౌకర్యం కల్పించాలి. 
– పి.శ్రావణి, యువకళాకారిణి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా