చంద్రబాబుకు మతిభ్రమించింది: అంబటి రాంబాబు

21 Jan, 2015 03:54 IST|Sakshi
చంద్రబాబుకు మతిభ్రమించింది: అంబటి రాంబాబు

* వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం
ఎక్కువమంది పిల్లల్ని కనమనడం బాబు అజ్ఞానానికి అద్దం పడుతోంది
సీఎం మానసిక స్థితిపై అనుమానంగా ఉంది

 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రకటనలు ఆయన అజ్ఞానానికి అద్దం పట్టేవిగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అసలు ఆయన మానసిక పరిస్థితిపైనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పిన విధంగా ఎక్కువ మంది పిల్లల్ని కంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. ఒకరు లేదా ఇద్దరు చాలు అన్నది ప్రభుత్వ నినాదమైతే, చంద్రబాబు మాత్రం ఎక్కువ మందిని కనాలని పిలుపునివ్వడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జపాన్‌లో వృద్ధులు ఎక్కువగా ఉన్నారని, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎక్కువ మందిని కనాలని చెప్పడం ఆయన అజ్ఞానానికి తార్కాణమన్నారు.
 
 ఒకపక్క పౌష్టికాహారలోపం సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఇంకా పిల్లలను కనండి అని చంద్రబాబు చెప్పడం అర్థరహితమన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని, ప్రభుత్వోద్యోగులకు ఇంక్రిమెంట్లు కూడా రావని చెప్పారు. మరి అలాంటి వారు ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి చంద్రబాబు ఆయా సదుపాయాలు కల్పిస్తారా? అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుది పిచ్చి, చెత్త వాగుడు అంటూ రాంబాబు ద్వజమెత్తారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తూ అక్కడి మేధావులతో చర్చలు జరుపుతున్నట్లు హడావుడి చేస్తున్నారన్నారు. విదేశీయులు ఏపీ రాజధాని నిర్మాణానికి పోటీ పడుతున్నట్లు ఓ అందమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
 
 ఎన్టీఆర్ విగ్రహానికి శక్తి ఉంటే చంద్రబాబు భస్మమే..
 ఎన్టీఆర్ విగ్రహాన్ని ముట్టుకుంటే బాధలన్నీ మర్చి పోతామని, కోరికలన్నీ తీరుతాయని చంద్రబాబు చెప్పడాన్ని అంబటి ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్ విగ్రహానికి అద్భుత శక్తి ఉంటే తొలుత భస్మం అయ్యేది చంద్రబాబేనన్నారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి చిత్రహింసలు పెట్టి ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు.. ఇపుడు ఆయనను దైవాంశసంభూతుడని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడ్డం లేదని, ఆయనను ఒక మంచి పాలకుడుగా భావిస్తారని అయితే వేంకటేశ్వరస్వామితో పోల్చడం ఏ మాత్రం సరికాదన్నారు.
 
  పదవీ గండం భయంతో సైన్స్ కాంగ్రెస్ వేదికను మార్చడంపై మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మూఢ నమ్మకాలను పెంచుకుంటూ పోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కేటాయించిన భూములపై శాసనసభా సంఘాన్ని వేసి విచారణ జరిపిస్తామని మంత్రులు చెప్పడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో రూ. 1.60 లక్షల కోట్ల విలువ చేసే 26 వేల ఎకరాల భూములను విశాఖ ఫార్మా, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి అనేక సంస్థలకు కే టాయించారని, ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాటిపై కూడా న్యాయవిచారణ లేదా సభాసంఘం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
 

మరిన్ని వార్తలు