కాపులందరూ సిద్ధంగా ఉండండి: అంబటి

14 Aug, 2017 17:56 IST|Sakshi
‘దుర్భుద్ధితోనే బెజవాడలో కాపు ఆత్మీయ భేటీ’

నంద్యాల : కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కాపులు, బలిజలను మోసం చేసి మళ్లీ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం అంబటి రాంబాబు నంద్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామన్నారు. మూడేళ్లు అయినా కాపులకు ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. కాపు యువకులు, విద్యార్థులకు ఇచ్చే డబ్బును దోచుకునే యత్నం చేస్తున్నారు. చంద్రబాబు చేసే కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలి.

నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు వచ్చాయి. దీంతో దుర్భుద్ధితోనే ఇవాళ విజయవాడలో కాపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఛలో అమరావతి పాదయాత్ర బయలుదేరిన ముద్రగడ పద్మనాభంను 18 రోజుల నుంచి గృహ నిర్బంధం చేశారు. ఆయనతో చంద్రబాబు ఎందుకు చర్చలు జరపడం లేదు. కాపు కార్పొరేషన్‌, మంజునాథ కమిషన్‌ను చంద్రబాబు చిత్తశుద్ధితో వేయలేదు. త్వరలో మంజునాథ కమిషన్‌ వస్తుందని చెప్పారు.

బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. పనిలో పనిగా వైఎస్‌ఆర్‌ సీపీని కూడా చంద్రబాబు విమర్శించారు. మంజునాథ్‌ కమిషన్‌ చాలా సందర్భాల్లో కాపులను బీసీల్లో చేర్చేదానికి మాకు సంబంధం ఏంటన్నారు. తమది బీసీ కమిషన్‌ అని చాలాసార్లు మంజునాథ అన్నారు. ఓ వైపు ముద్రగడను వేధిస్తూ, మరోవైపు కాపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తారా?. కాపులపై రౌడీషీట్‌లు పెట్టి, ఇప్పుడు కాపు ఆత్మీయ సమావేశం అంటే ఎలా నమ్ముతారు. చంద్రబాబు కపట నాటకాలను తిప్పికొట్టేందుకు కాపులందరూ సిద్ధంగా ఉండాలి.’ అని పిలుపునిచ్చారు.