అంబేడ్కర్‌ స్మృతి వనం.. మాటలకే పరిమితం

14 Apr, 2019 09:47 IST|Sakshi
నేలపాడులోని అంబేద్కర్‌ స్మతి వనం నిర్మాణ ప్రాంతం

సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో అంబేడ్కర్‌ స్మృతి వనం నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రకటన మాటలకు, గ్రాఫిక్‌లకే పరిమితమైంది. గుంటూరులో 2017లో రాష్ట్రస్థాయి దళితుల సమావేశం నిర్వహించిన ప్రభుత్వం.. అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మిస్తున్నామని, అది ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాలని కోరింది. అంతకుముందు ప్లాన్‌ల పేరుతో గ్రాఫిక్స్‌ రూపొందించేందుకు ఆరు నెలలకు పైగా సమయం పట్టింది. మూడేళ్లలో కనీసం 15 సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో దీనికి మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రూపకల్పన చేయగా.. అమలు బాధ్యతను మంత్రి నక్కా ఆనందబాబు తీసుకున్నారు. 2017, 2018 సంవత్సరాల్లో అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రూ.వంద కోట్లతో స్మృతి వనం నిర్మిస్తున్నట్టు చెప్పారు. కానీ నేటికీ దానిపై దృష్టి పెట్టలేదు.

వంద అడుగుల ఎత్తున..
సచివాలయానికి సమీపంలోని నేలపాడులో 25 ఎకరాల్లో వంద అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఆధ్యాత్మిక కేంద్రం, పుస్తక పఠన కేంద్రం, గ్రంథాలయం, విశాలమైన కాన్ఫరెన్స్‌ హాల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బౌద్ధ మతం విశిష్టతను చాటేవిధంగా నిర్మాణాలు ఉంటాయని వెల్లడించింది. భూమిపూజ చేసి మూడేళ్లు గడచినా పట్టించుకోకపోవడంతో దళిత వర్గాలు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నాయి. దీంతో గత ఏడాది డిసెంబర్‌లో అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా పునాదులు వేశారు. నాలుగు నెలలు గడచినా పిల్లర్లు కూడా పూర్తి కాలేదు. ఇదిలావుంటే.. బాబూ జగ్జీవన్‌రామ్‌ పేరిట రాజధానిలో స్మారక వనం నిర్మించి, ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని రెండేళ్లుగా చెబుతూ వస్తున్నారు. దానికీ రూపకల్పన చేయలేదు. దీనికి 10 ఎకరాల స్థలం కేటాయించినట్టు ముఖ్యమంత్రి అనేకసార్లు చెప్పారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంబేడ్కర్‌ జయంతిని ప్రభుత్వం ఆదివారం గుంటూరులో రాష్ట్రస్థాయి ఉత్సవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగానైనా ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తిచేసే దిశగా నిర్ణయం తీసుకుంటారేమోనని దళిత వర్గాలు ఆశిస్తున్నాయి.

చిత్తశుద్ధి లేదు
ప్రభుత్వానికి అంబేడ్కర్‌ స్మృతివనం నిర్మించాలనే చిత్తశుద్ధి లేదు. మూడేళ్లుగా మాటలు చెబుతూ కాలం గడిపింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందో ఓటర్ల తీర్పు వెలువడితే కాని తెలియదు. కొత్త ప్రభుత్వం వస్తే ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వం స్మృతివనం నిర్మాణాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలను అన్నివర్గాల వారికి తెలియజేయాలి. అంబేడ్కర్‌ అంటే ఒక్క దళిత వర్గానికి పరిమితం కాదు. బలహీన వర్గాల వారందరికీ కావాల్సిన వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన అందరికీ ఆదర్శం.  
– కరవది సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి, దళిత హక్కుల పోరాట సమితి.

మరిన్ని వార్తలు