నిర్లక్ష్యపు డయేరియా!

5 Dec, 2013 03:35 IST|Sakshi
 చదువుల తల్లి కొలువుదీరాల్సిన విశ్వవిద్యాలయం వ్యాధుల నిలయంగా మారింది. గత నాలుగు రోజులుగా నిర్లక్ష్యపు డయేరియాతో నీరసించిపోయింది. విద్యార్జన కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆడపిల్లలు అతిసార బారిన పడి అస్వస్థులయ్యారు. ఒకపక్క సెమిస్టర్ పరీక్షలు.. మరోవైపు అనారోగ్యంతో మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. వంటశాల, కొళాయిలు, నీళ్ల ట్యాంకు పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తున్నా పట్టించుకోని వర్సిటీ యంత్రాంగం నిర్లక్ష్యమే పరీక్షల ముందు తమను ఆరోగ్యపరంగా విషమ పరీక్షకు గురిచేసిందని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. శనివారం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా అదుపు చేయడంలో వర్సిటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బుధవారంనాటికి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినా పరిస్థితి ఇప్పటికీ గంభీరంగానే ఉంది.
 
 ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: పరిసరాల పరిశుభ్రతపై అంతులేని నిర్లక్ష్యం డయేరియా రూపంలో దాడి చేసింది. వందలాది విద్యార్థు లు బస చేసే వసతిగృహం, వంటశాలల్లో పరిశుభ్రత పాటించే విషయంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధికారులు అవలంభించిన నిర్లిప్త ధోరణి  వారి పాలిట శాపంగా పరిణమించింది. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరగడంతో విద్యార్థినులు ఇటు అనారోగ్యంతోనూ, అటు పరీక్షలు సరిగ్గా రాయలేక నానా ఇబ్బందులు పడ్డారు. హఠాత్తుగా డయేరియా ప్రబలడానికి కారణాలు అన్వేషించి, నివారణ చర్యలు తీసుకోవాల్సిన వర్సిటీ ఉన్నతాధికారులు రకరకాల సాకులతో కాలక్షేపం చేసి ఆలస్యంగా స్పందించారు. నష్టం జరిగిపోయిన తర్వాత తీరిగ్గా పారిశుధ్య చర్యలు చేపట్టారు. 
 
 శనివారం నుంచే మొదలు
 వర్సిటీలోని మహిళావసతి గృహం నాగావళిలో బస చేస్తున్న విద్యార్థినులు శనివారం నుంచి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారికి హాస్టల్లోనే ఉంచి చికిత్స చేయించిన అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆదివారం రాత్రి ఈ విషయం తెలుసుకున్న ‘న్యూస్‌లైన్’ హాస్టల్‌కు వెళ్లి ఆరా తీయగా అక్కడి దుర్భర పరి స్థితులను విద్యార్థినులు వెల్లడించారు. సోమవారం ఈ వార్త పత్రికల్లో రావడంతో ఉలిక్కిపడిన అధికారులు ఆ తర్వాతే నివార ణ, పారిశుధ్య చర్యలు ముమ్మరం చేశారు. అయినా బుధవారానికి గాని పరిస్థితి కాస్త అదుపులోకి రాలేదంటే ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట ఆహా రం కలుషితం కావడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారన్న వాదన వినిపిం చింది.
 
 అయితే తర్వాత అది డయేరియా అని ప్రకటించారు. శనివారం అస్వస్థతకు గురైన వారిలో  సుమారు 13 మంది ఆది వారం సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోయారు. సుమారు 42 మంది విద్యార్థినులు డయేరియా బారిన పడగా వర్సిటీ అధికారులు మాత్రం 15 మందేనని చెబుతున్నారు. మిగ తా విద్యార్థినులు ఇతర సమస్యలతో బాధపడుతున్నారని వాదిస్తున్నారు. అయితే అంతమందికి ఒకేసారి ఆరోగ్య సమస్యలు ఎలా ఉత్పన్నమవుతాయో అధికారులే వివరించాలి. ఎక్కువగా ఆర్గానిక్ కెమిస్ట్రీ, మ్యాథ్స్  విద్యార్థినులు అస్వస్థులు కావడం తో 3న జరగాల్సిన ఆ రెండు పరీక్షలను ఏడో తేదీకి వాయిదా వేశారు.  డయేరియా ప్రబలడం వల్ల కాకుండా సాంకేతిక కారణాలతోనే పరీక్షలు వాయిదా వేశామంటున్న అధికారులు, ఆ  కారణాలేమిటన్నది ఇప్పటికీ వెల్లడించలేదు. అసలు డయేరియా ఇంత తీవ్రంగా ఎందుకు దాడి చేసిందన్నదానిపైనా అధికారలు దృష్టి పెట్టలేదు. 
 
 పరీక్షల ఫోబియా కారణమట!
 పారిశుధ్య దుస్థితిని, డయేరియా తీవ్రతను తక్కువ చేసి చూపిస్తున్న వర్సిటీ ఉన్నతాధికారులు మరోవైపు వింత వాదన కూడా చేస్తున్నారు. పరీక్షల ఫోబియా వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని చెప్పుకొస్తున్నారు. బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు మాత్రం వేరే కారణాలు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి విద్యార్థినులకు పెట్టిన అన్నం గట్టిగా ఉండటం, వంట గది లో పారిశుధ్యం పాటించకపోవడం, మంచి నీళ్ల ట్యాంకులో క్లోరినేషన్ చేయకపోవడం వంటి కారణాల వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వారు విశ్లేషించారు. వర్సిటీ వైద్యుడు మనోజ్, హెల్త్ అసిస్టెంట్ మౌళీశ్వర రావు రెండు రోజల నుంచి విద్యార్థులకు చికిత్స అందించగా, మంగళవారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్ వైద్య బృందం, ఎచ్చె ర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బృందం వైద్య పరీక్షలు నిర్వహించాయి. ఆహార పదార్థాల నమూనాలను పరీక్షలకు పంపామని చెప్పిన వర్సిటీ అధికారులు.. పరిస్థితి తీవ్రరూపం దాల్చిన తర్వాతే వంటగది, వసతి గృహం ఆవరణ, మరుగుదొడ్లలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారని విద్యార్థినులు చెప్పారు. నీళ్ల ట్యాంకుపై చెత్తా చెదారం పేరుకుపోయినా ఇంతకాలం పట్టించుకోలేదని వాపోయారు.
 
 బయట ఆహారంపై ఆంక్షలు
 ఇదిలా ఉండగా బుధవారం ఉదయం అల్పాహారంగా ఉప్మా పెట్టారు. దాన్ని తినలేక కొందరు విద్యార్థినులు తోటి విద్యార్థుల ద్వారా బయట నుంచి అల్పాహారం తెప్పించుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది, వసతి గృహం వార్డెన్ యు.కావ్యజోత్స్న అడ్డుకున్నారు. డయేరియాకు బయటి ఆహారమే కారణమంటూ టిఫిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
 
 వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు
 మరోవైపు బుధవారం సెమిస్టర్ పరీక్షలు వైద్యుల పర్యవేక్షణలో జరిగాయి. డయేరియా బారిన పడిన కాస్త కోలుకున్న విద్యార్థులు  పరీక్షలకు హాజరుకాగా వైద్యులు వారిని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ద్రవ ఆహారాన్ని అందజేశారు. ఒక విద్యార్థిని మాత్రం అనారోగ్యంతో పరీక్షకు హాజరు కాలేకపోయింది. ఆమె వేరే అనారోగ్యంతో బాధపడుతోందని వర్సిటీ వైద్యుడు మనోజ్ చెప్పారు. విద్యార్థునులు తరచూ అస్వస్థతకు గురవుతుండటంతో వర్శిటీ అధికారులు వసతి గృహం వద్ద అంబులెన్సు అందుబాటులో ఉంచారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్, చీఫ్ వార్డెన్ బిడ్డిక అడ్డయ్య వసతి గృహాన్ని పరిశీలించారు. 
 
 పలువురి పరామర్శ
 బాధిత విద్యార్థులను మహిళా పోరాట కమిటీ నాయకురాలు తాండ్ర అరుణ, జిల్లా స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి పరామర్శించారు. వైద్య సేవలు, పారిశుధ్య పరిస్థితుల గురించి వర్సిటీ అధికారులను అడిగారు. అయితే పరామర్శలు, పరిశీలనలు కాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు సూచించారు.
 
 పరిస్థితి అదుపులో ఉంది: రిజిస్ట్రార్
 ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్ చెప్పారు. వైద్యుల ను అప్రమత్తం చేశామన్నారు. పరీక్షలు కుడా సజావుగా జరుగు తున్నాయని చెప్పారు.
 
 
>
మరిన్ని వార్తలు