నీరుగారిన అక్రమాల నివేదిక!

5 Mar, 2014 02:34 IST|Sakshi
నీరుగారిన అక్రమాల నివేదిక!

   విశ్రాంత అధికారితో దర్యాప్తు హామీకే పరిమితం
   ఉన్నతాధికారి కనుసన్నల్లో నివేదిక తయారీ
    కమిటీ వేస్తే సిబ్బంది అక్రమాలు
     బయట పడతాయని భయం
    పాల బిల్లుకే అక్రమాలు పరిమితం చేసిన వైనం
    బీఆర్‌ఏయూ అధికారుల తీరుపైవిమర్శల హోరు
 
 
 ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: సరస్వతీ నిలయమైన అంబేద్క ర్ యూనివర్సిటీ అధికారుల పాలనా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్న చందంగా వీరి పరిపాలన ఉందనే గుసగుసలు వస్తున్నా యి. గత నెలలో జరిగిన ఓ సంఘటన విచారణ నివేదికను ఏకంగా నీరుగార్చారంటే వీరు ఎంతకు బరితెగిస్తున్నారో అర్థమవుతోం ది. ఇక్కడ కేవలం 15 డిపార్టుమెంట్లు, 16 కోర్సులుండగా, రాజకీయాలు మాత్రం చాలా ఎక్కువ.
 
  విద్యార్థులు రెడ్ హ్యాండెడ్‌గా అక్రమాలు వెలికితీసినా బాధ్యులపై చర్యలు మాత్రం లేవు. అక్రమాలను వెలికితీసే విద్యార్థులను అభినందించాల్సిందిపోయి కక్ష సాధింపులకు ప్రణాళికలు వేయడంలో ఇక్కడి అధికారులు దిట్ట. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారి చెప్పే మాట లకు.. చేసే పనులకు కనీసం పొంతన ఉండ టం లేదు. దీంతో వీరి పాలనా తీరును చాలామంది విద్యార్థులు వ్యతిరేకిస్తుండగా, మరికొం దరు మాత్రం పీజీ డిగ్రీతో ఇక్కడ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో రాజీ పడుతున్నారు. యూనివర్సిటీలోని వంశధార  వసతిగృహంలో గత నెల 12వ తేదీన విద్యార్థుల పాల బిల్లులో అక్రమాలు జరిగిన విషయాన్ని గుర్తించారు.
 
  యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులు, పాల వ్యాపారి కలిసి ఈ అక్రమాలకు పాల్పడిన విషయాన్ని ఆధారాలతో సైతం వెలిగితీశారు. బిల్లులో దిద్దుబాటు ఉన్న విషయాన్ని గుర్తించారు.ఆరు నెలల్లో వెయ్యి లీటర్ల పాలకు 26 వేల రూపాయలను అక్రమ బిల్లు చెల్లించినట్లు కనుగొన్నారు. ఇలాంటి పరిస్థితిలో మిగతా కొనుగోళ్లకు సంబంధించి అన్ని బిల్లులను విద్యార్థులు పరిశీలించారు. రాత్రివేళ నిద్ర లేకుండా అక్రమాలను గుర్తించేందుకు కృషి చేశారు. వారి ప్రయత్నం విఫలం కాలేదు. బియ్యం, ఇతర వస్తువుల కొనుగోలులో లక్షలాది రూపాయల అవినీతి జరిగిందనే నిర్థారణకు వచ్చారు. ఈ పాపంలో వసతి గృహం సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అయితే సిబ్బందిపై చర్యలకు అధికారులు కనీసం స్పందించక పోవటంతో రెండు రోజులు తరగతులు బహిష్కరించారు.
 
 అర్ధరాత్రి సైతం ఆందోళన చేపట్టారు. దీంతో దిగివచ్చిన ఉన్నతాధికారులు విచారణకు సైతం ఆదేశించారు. దీంతో రెక్టార్ మిర్యాల చంద్రయ్య, ప్రిన్సిపాల్, ఇన్‌చార్జి సీడీసీ డీన్ గుంట తులసీరావు, చీఫ్ వార్డెన్ బిడ్డిక అడ్డయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. వీరి దర్యాప్తులో పాల బిల్లులో ఆక్రమణలు వెలుగు చూశాయి. మిగతా సరుకులకు చెందిన బిల్లులపై మాత్రం విశ్రాంత అధికారితో కమిటీ వేస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చి తప్పుకున్నారు. ఆ తరువాత దీని గురించి కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు.
 
 అక్రమాలు జరగలేదట!
 విద్యార్థుల ఆందోళన సమయంలో రాజకీయ నాయకుల్లా హామీలిచ్చిన అధికారులు ఆ తరువాత మాత్రం తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. విచారణ చేపట్టిన ముగ్గురు ఆధ్వర్యంలోనే కమిటీ వేసి తూతూ మంత్రంగా ముగించారు. అసలు అక్రమాలే జరగలేదని నివేదికను తయారు చేసినట్టు సమాచారం. పాలు కంటే బియ్యం, కిరాణా సామాన్లు, కోడి గుడ్లు ఖర్చు ఎక్కువ. వీటికి సంబంధించిన బిల్లులు పెద్దఎత్తున దిద్దుబాట్లు ఉన్నట్లు విద్యార్థులు చాలా గట్టిగా చెబుతున్నారు. అయితే కమిటీ మాత్రం ఈ కోణంలో కనీసం విచారణ చేపట్టలేదు. ఆరోపణలను సైతం పరిగణలోకి తీసుకోలేదు. నివేదికను వర్సిటీలోని ఓ ఉన్నతాధికారి సూచనల మేరకు నీకు గార్చారు. పాము చవ్వదు...కర్ర విరగదు అనే చందంగా అక్రమాలకు అవకాశమే లేదని నివేదిక తయారు చేసి సమర్పించారు. దీనిపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
  సిబ్బందిపై చర్యలు తీసుకుంటే అధికారులు చేస్తున్న అక్రమాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని వర్సిటీలోని ఓ వర్గం భావిస్తుంది. దీంతో తీగ లాగితే డొంక కదులుతుందని భావించిన అధికారులు ముందుచూపుతో తీగ లాగటం మానేశారు. కేవలం ముగ్గురు విద్యార్థులకు మాత్రమే పాల బిల్లు అక్రమాలతో ప్రమేయం ఉన్నట్లు తేల్చేశారు. పాల వ్యాపారికి అక్రమాలతో సంబంధం ఉందని తొలుత చెప్పిన అధికారులు ప్రస్తుతం ఆమె ప్రమేయం కూడా లేదని నివేదికలో తేల్చేశారు. అంతటితో ఆగకుండా అమెపై సానుభూతి చూపుతున్నారు.  పాల బిల్లు రూ. ఐదు లక్షలు వర్సిటీ  చెల్లించాల్సి ఉన్నా ఇంకా సరఫరా చేస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు.దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు సర్దుకుపోతున్నారు. దీనికి తోడు నాలుగు, ఆరు సెమిస్టర్ విద్యార్థులు ఏప్రిల్ నాటికి రిలీవ్ అవుతారు. దీంతో పాటు గట్టిగా ప్రశ్నిస్తేకొందరిని ఫెయిల్ చేయటం, మరి కొందరికి ఈ గ్రేడులతో సరి పెట్టటం చేస్తే ఇకపై కూడా అవినీతిపై ప్రశ్నించే వారే ఉండరన్నది ఇక్కడి అధికారులు ఆలోచనగా తెలుస్తుంది.
 
 ఆధారాలు లేవు:ప్రిన్సిపాల్
 అక్రమాలపై కమిటీ నివేదిక అంశాన్ని ప్రిన్సిపాల్ జి.తులసీరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తా వించగా విద్యార్థుల ఆరోపణలు తప్పితే మిగతా కొనుగోళ్లపై అక్రమాలు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. పాల బిల్లులో దిద్దుబాట్లు సైతం కేవలం విద్యార్థులు పనేనన్నారు. పాల వ్యాపారులకు సైతం దీంతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో విచారణ పూర్తి చేసి అధికారులకు నివేదిక అందజేశామన్నారు. అక్రమాలకు పాల్పడిన విద్యార్థుల నుంచి రికవరీ బాధ్యత చీఫ్ వార్డెన్‌కు అప్పగించామన్నారు. విచారణ కమిటీలో ఉండేందుకు విశ్రాంత అధికారులు సైతం ముందుకు రాలే  దన్నారు.

మరిన్ని వార్తలు