గోదావరి-కృష్ణా అనుసంధానానికి బృహత్తర ప్రణాళిక

29 Oct, 2019 03:29 IST|Sakshi

గోదావరి – కృష్ణా అనుసంధానానికి బృహత్తర ప్రణాళిక

పోలవరం నుంచి బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు గోదావరి జలాల తరలింపు

రెండు ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తున్న వ్యాప్కోస్‌ 

గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీలతో భారీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌

లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. కరవు ప్రాంతాలకు సాగు, తాగునీరు

ప్రాథమికంగా రూ.60 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా

ప్రాజెక్టు ప్రతిపాదనలపై జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్ష

సముద్రం పాలవుతున్న నీటిని ఒడిసిపట్టడమే లక్ష్యం అన్న వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి:  సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి.. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుని.. కరవు నేలను సుభిక్షం చేసే దిశగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గోదావరి వరద జలాలను కరవు నేలకు మళ్లించడానికి అనేక రకాలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో ప్రతిపాదనపై దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారు చేయిస్తోంది. గోదావరి నది నుంచి సముద్రంలో కలిసిపోతున్న వరద జలాల్లో రోజుకు 23 వేల క్యూసెక్కుల చొప్పున అంటే 2 టీఎంసీల నీటిని.. 105 రోజులపాటు తరలించి.. మొత్తంగా 210 టీఎంసీలను ఒడిసి పట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టులోని 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని, నాగార్జునసాగర్‌ రెండో దశలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని భావిస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చాలని యోచిస్తోంది.

మరోవైపు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇటు పులిచింతల, అటు నాగార్జున సాగర్‌ మీద ఆధారపడ్డ ప్రాంతాలకు బొల్లాపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోని నీటిని ప్రాణాధారంలా నిలపాలని భావిస్తోంది. 15 ఏళ్లుగా గోదావరిలో నీటి ప్రవాహాన్ని ప్రామాణికంగా తీసుకుని 105 రోజుల్లో రోజుకు 1,200 క్యూమెక్కులు (35.315 క్యూసెక్కులు అయితే ఒక క్యూసెక్కు.. అంటే రోజుకు దాదాపు 3.7 టీఎంసీలు) ప్రవాహం ఉంటుందని వ్యాప్కోస్‌ (ప్రభుత్వ రంగ సంస్థ) అంచనా వేసింది. ఇలా వచ్చే నీటిలో గోదావరి డెల్టా అవసరాలు పోను, మిగిలిన నీరు సముద్రంలోకి పోతోంది. ఇలా సముద్రంలో కలిసిపోతున్న జలాలను కరువు, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడం ద్వారా భారీ మేలు చేకూరుతుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వెలిగొండతోపాటు, కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్ట్, ఎస్సార్‌బీసీ తదితర అవసరాల కోసం బనకచర్ల రెగ్యులేటర్‌ ద్వారా నీరందించే అవకాశం ఉంటుంది.  

పోలవరం టు బనకచర్ల ప్రతిపాదన–1 
పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచి రోజుకు రెండు టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదికి తరలిస్తారు. అక్కడి నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా పులిచింతల ప్రాజెక్టును నింపుతారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్‌ కుడి కాలువకు తరలిస్తారు. బుగ్గవాగు ప్రాజెక్టును నింపుతారు. నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. బొల్లాపల్లి నుంచి గ్రావిటీపై వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని అందిస్తూ.. నల్లమల అడవుల్లో ఒక టన్నెల్‌ తవ్వడం ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలిస్తారు. 

ప్రతిపాదన–2 
పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడి కాలువలోకి ఎత్తి పోస్తారు. అక్కడ నుంచి బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదిత బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని లిఫ్ట్‌ చేస్తారు. బొల్లాపల్లి నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని అందిస్తూ, మరోవైపు నల్లమల అడవుల్లో ఒక టన్నెల్‌ను తవ్వడం ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో 460 కిలోమీటర్ల మేర నీటిని గ్రావిటీ ద్వారా, మరికొన్ని చోట్ల ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. సముద్ర మట్టానికి 37 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు ఉంటే.. 260 మీటర్ల ఎత్తులో బనకచర్ల  క్రాస్‌ రెగ్యులేటర్‌ ఉంది. అంటే దాదాపు 230 మీటర్ల ఎత్తుకు వివిధ దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. మొత్తంగా దీనికోసం 2,100 మెగావాట్ల కరెంటు అవసరం అవుతుంది. ప్రతిపాదిత ప్రాజెక్టు విలువ రూ.60 వేల కోట్లపైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి సీఎం ఆదేశం  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం జలవనరుల శాఖ సమీక్షా సమావేశంలో పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలించే రెండు ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. సముద్రంలో కలుస్తున్న ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. ప్రస్తుతం సాగునీటి వసతి ఉన్న ప్రాంతాలను స్థిరీకరించడమే కాకుండా, నిత్యం కరువుతో, తాగునీటి కొరతతో అల్లాడుతున్న ప్రాంతాలకు జలాలను తరలించి కష్టాలను తీర్చాలన్నదే తన ప్రయత్నమన్నారు. ఈ రెండు ప్రతిపాదనలపై అధ్యయనం చేసి.. డీపీఆర్‌ తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలపై వ్యాప్కోస్‌ అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా పనులు చేపట్టనున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా