ఆత్మీయతా వారధులు.. అమెరికా నావికులు

14 Jun, 2019 13:14 IST|Sakshi
నావికులు తయారు చేసిన గాజులు, ఫ్లవర్‌వాజ్‌లు

దివ్యాంగులతో ఉత్సాహంగా మమేకం

సేవా సంస్థలో వెల్లువైన ఉల్లాసం

పర్యావరణ పరిరక్షణకు స్వయంగా ప్రయత్నం

విశాఖలో విదేశీ అతిథుల స్నేహరాగం

అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర):ఎక్కడో సుదూర దేశం నుంచి.. వేలాది మైళ్లకు ఆవల ఉన్న తీరం నుంచి తరలి వచ్చిన నావికులు వారు. స్నేహపూర్వకంగా, సామాజిక బాధ్యతలో భాగంగా వారు మన సాగర నగరానికి వచ్చారు. ఏదో చుట్టం చూపులా వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగి మరలకుండా ఓ మంచి పనిలో పాలుపంచుకున్నారు. దివ్యాంగుల దగ్గరకు వెళ్లి వారిని ఉత్సాహపరిచారు. వారి సమక్షంలో చాలా సేపు గడపడమే కాదు.. వారు చేసిన కళాకృతులను మెచ్చుకున్నారు. వారితో పాటు పని చేసి తామూ చేయి తిరిగిన హస్త కళాకారులమేనని నిరూపించుకున్నారు. కొన్ని కళాకృతులు తయారు చేసి ప్రదర్శించి.. దివ్యాంగుల గుండెల్లో ఆనందాన్ని నింపి బోలెడు అనుభూతులను మూటగట్టుకుని నిష్క్రమించారు.  నగరంలోని అక్కయ్యపాలెం చేరువలోని జగన్నాథపురంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా సైలర్లలో ఆత్మీయ కోణాన్ని ఆవిష్కరించింది. జగన్నాథపురంలో గల ప్రజ్వల వాణి వెల్ఫేర్‌  సోసైటీని  అమెరికా నావీ సైలర్స్‌  బృందం సందర్శించింది. పర్యావరణ పరిరక్షణలో దివ్యాంగులతో చేతులు కలిపింది. వారికి అంతులేని సంతోషాన్ని సమకూర్చింది.

తమ కళానైపుణ్యాన్ని చూపుతున్న నావికులు
కాదేదీ కళకు అనర్హం
పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నించడమే కాకుండా, పనికి రాని వస్తువులను కళాకృతులుగా మలచడం ఎలాగో అమెరికా నావికులు చేసి చూపారు. పనికిరాని వస్తువులతో అలంకరణ సామగ్రి ఎలా  తయారు చేయాలో ప్రయత్నించి నేర్చుకున్నారు. ఇందుకోసం వారు దివ్యాంగులతో కలిసి వర్క్‌ షాప్‌ నిర్వహించారు. తాగి పారేసిన గాజు సీసాలను జ్యూట్‌ థ్రెడ్, లేసులు, కుందన్స్, ఫ్లవర్‌తో అలంకరించి అందంగా ఫ్లవర్‌వాజ్‌లు తయారు చేశారు. జ్యూయలరీ తయారీని, ఇళ్లలోని పాత దుస్తులతో క్లాత్‌ బ్యాగ్స్‌ తయారీని దివ్యాంగుల నుంచి వారు నేర్చుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న యూఎస్‌  కాన్సులేట్‌ జనరల్‌ (ఆంధ్ర, తెలంగాణ) కేథరిన్‌ హడ్డా మాట్లాడుతూ దివ్యాంగులకు హితవచనాలు చెప్పారు. నచ్చిన రంగంలో కృషి చేస్తే అందరితో పాటు రాణించడం సాధ్యమేనని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా దివ్యాంగులతో కలిసి వర్క్‌షాప్‌లో పాల్గొనడం చాలా ఆనందంగాఉందన్నారు.  ప్రజ్వల్‌ వాణి సంస్థ ద్వారా దివ్యాంగులకు లభిస్తున్న శిక్షణ తమను ఆకట్టుకుందని తెలిపారు. తమ నావికులు నేర్చుకున్న అంశాలను అమెరికాలో పలువురికి నేర్పించనున్నట్టు తెలిపారు. సొసైటీ ప్రతినిధులు కె.వి.ఎల్‌ సుచిత్రా రావు, హరీష్‌ మాట్లాడుతూ అమెరికా నావికులు దివ్యాంగ విద్యార్థులతో కలిసి బెస్ట్‌ అవుటాఫ్‌ వేస్ట్‌ వర్క్‌షాప్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ తీరానికి వచ్చిన అమెరికా నౌకలో నావికులు, కాన్సులేట్‌  జనరల్‌ ప్రతినిధులు మూడురోజులుగా విశాఖలోని పలు కార్యక్రమాల్లో  పాల్గొన్నట్టు తెలిపారు. ప్రజ్వలవాణిని సందర్శించి  పర్యావరణపరిరక్షణలో బాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. అనంతరం  దివ్యాంగ విద్యార్ధులు కాన్సులేట్‌ జనరల్‌కు జ్ఞాపిక బహూకరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌వో ఆకాష్, టి.సెంథిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు