పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై అమిత్‌షా హ్యాపీ

22 Oct, 2019 17:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ భేటీ ఫలప్రదం అయింది. మంగళవారం జరిగిన ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్‌, అమిత్‌ షాతో చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన మరోసారి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ. 838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని అమిత్‌షాకు సీఎం జగన్‌ తెలిపారు.

హెడ్‌ వర్క్స్‌, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులో రూ. 780 కోట్లు, టన్నెల్‌ పనుల్లో రూ. 58 కోట్లు ఆదా అయిన విషయాన్ని వివరించారు. సుహృద్భావ వాతావరణంలో.. రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై సానుకూల చర్చ జరిగింది. 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మర్గాని భరత్‌, నందిగం సురేశ్‌, రఘురామకృష్ణంరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
(చదవండి : అమిత్‌ షాతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ)

ప్రజాధనం ఆదాపై సంతోషం..
పోలవరం రివర్స్ టెండర్ విధానంపై అమిత్ షా సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు. రూ. 838 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదాపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పోలవరం  పై  ఇలాగే  ముందుకు వెళ్లాలని అమిత్ షా సూచించారు. ఇక తన పుట్టిన రోజు కావడంతో కేంద్ర మంత్రులు, అధికారులు తరలివచ్చినా సీఎం జగన్‌తో అమిత్‌షా  45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఈ సందర్భంగా అమిత్‌షా  భరోసా ఇచ్చారు. ఏపీ సమస్యలపై తాను ఇతర శాఖల మంత్రులతో మాట్లాడతానని అమిత్‌షా హామీనిచ్చారు. ఆ తర్వాతనే మంత్రులను కలవాలని ఆయన సీఎం జగన్‌కు సూచించారు. దాంతో మంత్రులతో భేటీ వాయిదా పడింది.

మరిన్ని వార్తలు