వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లు

2 May, 2020 03:46 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అమిత్‌షా ఫోన్‌ 

ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించడానికి రోజుకు ఐదు చొప్పున రైళ్ల కేటాయింపు 

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీకి రోజుకు ఐదు చొప్పున ప్రత్యేక రైళ్లు కేటాయించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలను తరలించేందుకు కూడా ఆయా రాష్ట్రాలకు రైళ్లను కేటాయించింది. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఏ జిల్లాలో ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని సేకరించే బాధ్యతను జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించింది.

వలస కూలీల కోసం మెయిల్‌కు గత రెండ్రోజుల్లో పది వేల మంది సమాచారం వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. గ్రీన్‌జోన్లలో పరిశ్రమలను తెరిచినందున ఆసక్తి చూపిన వారినే వారి రాష్ట్రాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు, మత్స్యకారులు తమిళనాడు, యూపీ, ఒడిశా, కాశీ తదితర ప్రాంతాల్లో ఉన్నారని, వారిని రప్పించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వలస కూలీల విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు.

► ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వారు 12,602 మంది ఉన్నారు. రాష్ట్ర పరిధిలోని వారు ఆయా జిల్లాల్లో 66 వేల మందికి పైగా ఉన్నారు.
► రాష్ట్ర పరిధిలోని వారిని తరలించేందుకు ఆర్టీసీ 750 బస్సులను ఏర్పాటు చేసి ఇప్పటికే 22,866 మంది వలస కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చింది.
► స్వస్థలం చేరుకున్నాక క్వారంటైన్‌లో,  తర్వాత హోం క్వారంటైన్‌లో ఉండాలి.
► రవాణా శాఖ 200 ప్రైవేటు బస్సులను కూడా అందుబాటులో ఉంచింది.
► రాష్ట్రంలోని జాతీయ రహదారులపై గూడ్స్‌ వాహనాల ట్రాఫిక్‌ 45% పెరిగింది. 

మరిన్ని వార్తలు