‘రెండవ శ్రేణి పౌరులుగా భావించడం విచాకరం’

19 Oct, 2019 15:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ : మనోభావాలకు సంబంధించిన మత ఆచార వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. మతాలకు అతీతంగా అభివృద్ధి జరిగి, అవకాశాలు మెరుగు పరిచినపుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని కె హోటల్‌లో జరిగిన మిల్లి కౌన్సిల్‌ 20వ జాతీయ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. భారతదేశంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్యపరమైన సమస్యలపై ప్రజాసామ్య పద్ధతులలో పరిష్కరించడం, భిన్నత్త్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ పనిచేయడం ఈ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యానికై ప్రాణ త్యాగాలు చేసిన వారిలో ముస్లిం మేధావులు, మత పెద్దలు, సామాన్య ప్రజలు సైతం ఉన్నారన్నారని తెలిపారు.

అదే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాసామ్య దేశమైన భారతదేశంలో ప్రతీ ఒక్కరు తమ మతాచారాలు, సంప్రదాయాలను స్వేఛ్చగా ఆచరించుకొనే వెసలుబాటు ఉందన్నారు. అయితే కొన్ని ప్రభుత్వాలు ముస్లింల షరియత్, ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ముస్లింలను రెండవ శ్రేణి పౌరులుగా భావించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఇక దేశంలోని ముస్లింలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలలో నిరక్షరాస్యత, పేదరికం, వరకట్న దురాచారం, నిరుద్యోగం ముఖ్యమైనవన్నారు. ప్రభుత్వాలతో కలసి ప్రజాసామ్య పద్ధతులలో సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు.. భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాషా పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ముస్లిం మేధావులతో పాటు కర్నూలు ఎమ్యెల్యే హఫీస్ ఖాన్, ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు, మత పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు