అమ్మ ఒడి అద్భుతం

18 Mar, 2019 14:57 IST|Sakshi

ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదనే వైఎస్‌ జగన్‌ ఉన్నత ఆలోచన

సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): ప్రాథమిక విద్య అనంతరం ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు విద్యార్థులను ఎన్నో ఆశలతో బడికి పంపిస్తుంటారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో తగిన వసతులు లేకపోవడం, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివించుకునే స్తోమత లేకపోవడంతో విద్యార్థులను చదువు మధ్యలో బడి వేయాల్సిన పరిస్థితి దాపరిస్తోంది. దీంతో విద్యార్థులు బడికి పోవాల్సిన వయసులో బాల కార్మికులుగా మారుతున్నారు. దీంతో వారి జీవితాలు బాల్యంలోనే కుంటుపడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ప్రత్యక్షంగా పాదయాత్రలో చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని నవరత్నాల్లో భాగం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఏ ఒక్క పేద విద్యార్థి బడి మానేయకూడదని బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో సంవత్సరానికి రూ. 15వేలు జమ చేసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. విద్యార్థుల చదువులకు భరోసా కల్పించే దిశగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటనలు చేయడంతో పలవురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో  నియోజకవర్గంలో సుమారు 50 వేలకుపైగా విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. ఈ పథకం ప్రయోజనాన్ని తెలుసుకున్న పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

‘అమ్మ ఒడి’ పథకం ద్వారా పేద విద్యార్థులకు ప్రయోజనం ఇలా..
ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.500.. ఇద్దరు ఉంటే రూ.1000 అందుతుంది 
♦ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.750.. ఇద్దరుంటే రూ.1500 చెల్లిస్తారు
♦ ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికీ ప్రతి నెలా రూ.1,000.. ఇద్దరుంటే రూ.2,000 అందుతుంది
♦ ఇంటర్మీడియట్‌ తర్వాత డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ చదువులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమలు

నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు (సుమారు)

 మండలం  విద్యార్థుల సంఖ్య
 వెంకటగిరి,రూరల్‌  5250
కలువాయి  3150
సైదాపురం  3100
బాలాయపల్లి  4100
డక్కిలి  4050
రాపూరు 4150 

పేద విద్యార్థులకు వరం
ఆర్థిక స్థోమత లేక చాలా మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నారు. పేదరికం వారి చదువులకు ఆటంకంగా మారుతోంది. జగనన్న ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా ప్రతి విద్యార్థికీ ఆర్థిక తోడ్పాటు అందుతుంది. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించేందుకు వెనకడుగు వేయరు. ఈ పథకం పేద విద్యార్థులకు వరం.  
– ఎం.బాలాజీ, 9వ తరగతి విద్యార్థి, బంగారుపేట, వెంకటగిరి

తల్లిదండ్రులకు భరోసానిస్తుంది 
జగనన్న ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పథకం పేద విద్యార్థులకు భరోసానిస్తుంది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.500, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి నెలా రూ.750 అందుతుంది. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది.
– జి.మల్లెమ్మ, విద్యార్థి తల్లి, వెంకటగిరి

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం
అమ్మఒడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల శాతం పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి  తల్లిదండ్రుల ఖాతాలో రూ. 15వేలు జమచేస్తే అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపేందుకు ఇష్టపడతారు. దీంతో రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం తగ్గి అక్షరాస్యత శాతం పెరుగుతుంది.
– రంగినేని రాజా, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, డక్కిలి

మరిన్ని వార్తలు