జనవరి 26న అమ్మఒడి పథకం ప్రారంభం

11 Jul, 2019 12:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : తమ పిల్లలను బడికి పంపే తల్లులకు భరోసానివ్వాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన ‘అ‍మ్మ ఒడి’ పథకం 2020 జనవరి 26న ప్రారంభం కానుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు పిల్లలను పంపించే అర్హురాలైన ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని చెప్పారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.  ప్రభుత్వ స్కూళ్లలో విలువలతో కూడిన విద్యను అందిస్తామని, నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించటమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలను వసతుల ద్వారా, విద్యా ప్రమాణాల ద్వారా మార్పు చేస్తామని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేరికలు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని తెలిపారు. తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశామన్నారు. విద్యాశాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం విషయంలో సీఎం స్పందించిన తీరు అద్భుతమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందిస్తామని చెప్పారు.

ఆనాధ పిల్లలకు ఐదు శాతం, గిరిజన పిల్లలకు ఐదు శాతం, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి విద్యా హక్కు చట్టంలో భాగంగా 25 శాతం ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత విద్యను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్బన్‌ ఏరియలో ప్రతి నెల రూ.70 ఫీజు ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజన్న బడిబాట ద్వారా విద్యార్థులను బడిబాట పట్టించామని తెలిపారు. గత ప్రభుత్వం ఇదే అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. జీవో 42, 44 గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌ ప్రక్రియ ద్వారా వందల, వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ వ్యవస్థపై ప్రతిపక్షం అవహేళనగా మాట్లాడుతోందన్నారు.

మరిన్ని వార్తలు