నేటి నుంచి ‘అమరావతి’ పాలన

3 Oct, 2016 01:53 IST|Sakshi
నేటి నుంచి ‘అమరావతి’ పాలన

- హైదరాబాద్ నుంచి వెలగపూడికి చేరిన ఫైళ్లు, కంప్యూటర్లు
- దసరా రోజున సీఎం,సీఎస్ పేషీలు ప్రారంభం

 
సాక్షి, హైదరాబాద్/అమరావతి బ్యూరో: రాష్ట్ర పరిపాలన ఇకపై పూర్తిస్థాయిలో ‘అమరావతి’ నుంచే కొనసాగనుంది. కార్యదర్శులు సోమవారం లాంఛనంగా పూజలు చేసి వెలగపూడి నుంచి విధులు ఆరంభిస్తారు. ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల ఛాంబర్లను సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ప్రారంభించేందుకు ఉద్యోగులు పూలమాలలు, మామిడి తోరణాలతో అలంకరించారు. సచివాలయ ఉద్యోగులకు సోమవారం ఉదయం ఆత్మీయ స్వాగతం పలికేందుకు విజయవాడ, గుంటూరులోని ఆయా శాఖల సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ సచివాలయం నుంచి 80 శాతానికి పైగా సామాగ్రిని వెలగపూడికి తరలించారు. పంచాయతీరాజ్ శాఖ మాత్రం మరికొన్ని రోజులు హైదరాబాద్‌లోనే కొనసాగనుంది.
 
దసరా నుంచి సీఎం, సీఎస్..
దసరా పర్వదినం సందర్భంగా(అక్టోబర్ 11)న  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ పేషీలను పూజాదికాలతో ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచి పూర్తిస్థాయిలో సీఎం, సీఎస్ పేషీలు వెలగపూడి సచివాలయ కేంద్రంగానే పనిచేయనున్నాయి.

వారానికి ఐదు రోజులే పని
హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లిన సచివాలయ, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు ఏడాది పాటు వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయి.

నేడు ప్రారంభమయ్యేనా?!
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఏర్పాట్లు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. భవనాల్లో పనులు ఇంకాకొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల హడావుడి కనిపిస్తుందే గానీ పాలనకు సంబంధించి పనులేవీ పూర్తి కాలేదు. ప్రభుత్వం చెబుతున్నట్లు సోమవారం నుంచే ఏపీ పరిపాలన వెలగపూడిలో పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు