హుబ్లీ ప్యాసింజర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

19 Sep, 2014 02:42 IST|Sakshi

సాక్షి, గుంటూరు: హుబ్లీ ప్యాసింజర్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వరద ఉద్ధతికి ట్రాక్ దెబ్బతిన్నట్టు గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. గురువారం ఉదయం నల్లపాడు- పేరేచర్ల మార్గంలో కొండల పైనుంచి పొలాల్లోకి ప్రవహిస్తున్న వరద నీటి తీవ్రతకు రైల్వేట్రాక్ కింద ఉన్న కట్ట కోతకు గురైంది.

ఉదయం పది గంటల సమయంలో విజయవాడ నుంచి హుబ్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఆ ప్రదేశానికి రాగానే వరద నీరు ప్రవహించడాన్ని డ్రైవర్ బి.ఉదయభాస్కర్, అసిస్టెంట్ డ్రైవర్ శేఖర్‌బాబులు గుర్తించి, వెంటనే రైలును నిలిపివేశారు. రైలు దిగి వెళ్లి చూడగా కింద ఎలాంటి సపోర్టు లేకుండా సిమెంటు దిమ్మెలతో పట్టాలు గాలిలో తేలియాడుతున్నాయి. దీంతో రైలును అక్కడి నుంచి వెనక్కి నడుపుకుంటూ దగ్గర్లో ఉన్న నల్లపాడు రైల్వేస్టేషన్‌కు తరలించారు. అధికారులు దెబ్బతిన్న ట్రాక్‌ను మధ్యాహ్నం 12.30 గంటల కల్లా మరమ్మతులు చేయించి, రైళ్లను నడిపించారు. అప్రమత్తతతో వ్యవహరించిన డ్రైవర్లకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు