ఉద్యోగాలకు వయస్సు పెంపు

6 Nov, 2016 02:14 IST|Sakshi
ఉద్యోగాలకు వయస్సు పెంపు

- 42 ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం
- 2017 సెప్టెంబర్ 30 వరకూ వర్తింపు : ప్రభుత్వం ఉత్తర్వులు
 
 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి దాటిపోతున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. వివిధ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకూ జారీ అయ్యే ఉద్యోగ నియామక ప్రకటనలకు ఇది వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని నియామక ఏజెన్సీలు ప్రత్యక్ష పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి జారీ చేసే ప్రకటనల్లో ఈ సడలింపు అమలవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించి  ఈ సడలింపు నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో పేర్కొంది. వివిధ కేటగిరీల అభ్యర్థులకు ఏపీ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996లోని 12వ నిబంధన ప్రకారం వయోపరిమితి మినహాయింపులు అమలవుతాయి. సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లయితే ఎస్సీలకు ఐదేళ్లు సడలింపుతో కలిపి 39 ఏళ్లు ఉంటుంది. తాజా మినహాయింపు ప్రకారం ఎస్సీలకు గరిష్ట వయోపరిమితి 47 (42 ప్లస్ 5) అవుతుంది.

 అక్కరకురాని గతంలోని పెంపు..
 వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు. ప్రభుత్వం ఏళ్లతరబడి పోస్టులు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు దరఖాస్తుకు అర్హత కోల్పోయారు. దీంతో వయోపరిమితిని పెంచాలని వారు విన్నవించారు. ఈ డిమాండ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీ గతనెల 30న ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది.

 యూనిఫాం సర్వీసులకు వర్తించదు..
 సీఎం అంగీకారంతో ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వయోపరిమితి సడలింపు జీవో యూనిఫాం సర్వీసులైన పోలీసు, ఎక్సైజ్, ఫారెస్టు, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లోని ప్రత్యక్ష నియామకాలకు ఇది వర్తించదు. ఈ మేరకు జీవోలో ప్రభుత్వ సీఎస్ టక్కర్ స్పష్టీకరించారు.
 
 934కు పెరిగిన గ్రూప్2 పోస్టులు
 ఏపీపీఎస్సీ భర్తీ చేయబోయే గ్రూప్2 పోస్టుల సంఖ్య 934కు పెరిగింది. పదివేల పోస్టులకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో లో 4,009 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని గతంలో ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోలో పేర్కొంది. ఆ పోస్టుల్లో గ్రూప్-1కు సంబంధించి 94, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో 1000 పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇవిగాక హోమ్ శాఖకు సంబంధించి 9 పోస్టులున్నాయి. గతంలో నోటిఫికేషన్లు జారీచేసినా భర్తీకాని 184 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ కింద ప్రస్తుత గ్రూప్2లోకి వచ్చి చేరాయి. వీటితో గ్రూప్2 పోస్టులు ఈసారి 934కు చేరుతున్నాయి. ఇప్పటి వరకూ వయోపరిమితి పెంపు జీవో కోసం ఏపీపీఎస్సీ ఎదురు చూసింది. ఇపుడు ఆ జీవో విడుదల కావడంతో మూడు, నాలుగు రోజుల్లో నోటిిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రూప్2 నోటిఫికేషన్ తర్వాత గ్రూప్3లోని 1,000 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. ఈనెలాఖరులోగా గ్రూప్3 నోటిఫికేషన్ కూడా విడుదలచేయనున్నామని ఏపీపీఎస్సీ అధికారవర్గాలు వివరించాయి.

>
మరిన్ని వార్తలు