చెత్తగించగలరు..

12 Dec, 2013 02:02 IST|Sakshi

=అనకాపల్లిలో పారిశుద్ధ్య సిబ్బంది కొరత
 =వార్డుల్లో పేరుకుపోతున్న చెత్తా, చెదారం
 =పూడుకుపోతున్న మురుగునీటి కాలువలు
 =విజృంభిస్తున్న దోమలు, ఈగలు

 
అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి పట్టణంలో ఎక్కడికి వెళ్లినా ముక్కుమూసుకోవాల్సిందే. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. గబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. పూడిక తొలగించకపోవడంతో మురుగునీటి కాలువలు గబ్బుకొడుతున్నాయి. ఇది గ్రేటర్ విశాఖలో విలీనమై నాలుగు నెలలు గడిచినా  ఇక్కడి వారికి ‘చెత్త’కష్టాలు తీరడం లేదు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ల నుంచి పారిశుద్ధ్య కార్మికుల కొరతే ఇందుకు ప్రధాన కారణం.

ఫలితంగా దోమలు, ఈగలు విజృంభించి జనం రోగాల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీగా ఉన్నంత కాలం అయిదుజోన్లుగా ఉన్న పారిశుద్ధ్య వ్యవస్థను తాజాగా మూడు జోన్లుగా విభజించారు. 1, 3 సర్కిళ్లను మొదటి జోన్‌గా, 2,4 సర్కిళ్లను రెండవ జోన్‌గా, 5వ సర్కిల్‌ను మూడవ జోన్‌గాను విభజించారు. మొదటి జోన్‌కు శానిటరీ సూపర్‌వైజరే ఇన్‌స్పెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

రెండవ జోన్‌కు మరో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉండగా మూడవ జోన్‌కు హెల్త్ అసిస్టెంట్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. మూడు జోన్ల పరిధిలో 252 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం. ప్రస్తుతం 162 మందే ఉన్నారు. వీరిలో 20 మంది పాఠశాలలకు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో 144 మందే అందుబాటులో ఉంటున్నారు. అనకాపల్లి జోన్‌లో 67.19 కిలోమీటర్ల పరిధిలో సీసీ, 14.78 కిలోమీటర్ల పరిధిలో బీటీ, 2.5 కిలోమీటర్ల పరిధిలో డబ్ల్యూబీఎం, 12.11 కిలోమీటర్ల పరిధిలో కచ్చారోడ్లు ఉన్నాయి. అదేవిధంగా 113.4 కిలోమీటర్ల పరిధిలో పక్కా డ్రైన్లు, 11.90 కిలోమీటర్ల పరిధిలో తుపాను నీరు పారే కాలువలు ఉన్నాయి.

రహదారులు శుభ్రం చేసేందుకు రెండు కిలోమీటర్లకు ఒక స్వీపర్, కాలువల్లో ఊడ్చేందుకుకిలోమీటరుకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఉండాలి. కాలువలను శుభ్రం చేసే 25 మందిని ఇంటింటా చెత్త సేకరణకు వినియోగిస్తున్నారు. దీంతో కాలువలు శుభ్రంచేసే కార్మికులు 17 మందే సేవలు అందిస్తున్నారు. 48 ఖాళీలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా పబ్లిక్ హెల్త్ అధికారులే అంగీకరిస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా కాలువలను శుభ్రం చేయలేకపోతున్నామని సంబంధిత విభాగం అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కాలువల శుభ్రం చేసేందుకు తక్షణమే సిబ్బందిని నియమించకపోతే అనకాపల్లి కంపు కంపుగానే కనిపిస్తుంది. ఇదిలా ఉండగా రూ.27 కోట్లతో చేపడుతున్న సమగ్ర పారిశుద్ధ్య అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా సాగడం వల్లే అనకాపల్లిలో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడలేదన్న వాదన ఉంది.
 

మరిన్ని వార్తలు