అమ్మకాలు అదుర్స్

29 Dec, 2015 00:56 IST|Sakshi
అమ్మకాలు అదుర్స్

అనకాపల్లి బెల్లం మార్కెట్లో  ఒక్క రోజులో రూ. కోటి వ్యాపారం
ఈ సీజన్‌లో ఇదే రికార్డు
బెల్లం ఉత్పత్తి వైపు రైతుల మొగ్గు నిరాశ పరిచిన ధరలు

 
అనకాపల్లి:  స్థానిక బెల్లం మార్కెట్లో సోమవారం రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి. ఈ సీజన్‌కు సంబంధించి  నెల రోజుల నుంచి లావాదేవీలు ఊపందుకున్న నేపథ్యంలో మార్కెట్లో సందడి నెలకొంది. సోమవారం ఒక్కరోజు జరిగిన లావాదేవీలు విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. ఈ నెల 8న మార్కెట్‌కు 24,121 దిమ్మలు రాగా సోమవారం మార్కెట్‌కు 29,788 దిమ్మలు వచ్చాయి. దీంతో మార్కెట్లోని యార్డులన్నీ   కొనుగోళ్లు, అమ్మకాలతో కిటకిటలాడాయి. బెల్లం లావాదేవీల్లో భాగంగా ఆన్‌లైన్ అమ్మకాలు ప్రతిపాదన, ప్రారంభం జరిగిన నేపథ్యంలో వ్యాపారంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నప్పటికీ లావాదేవీలపై ఈ ప్రభావం పడకపోవడంతో మార్కెట్ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఇదే సమయంలో గత ఏడాది హుద్‌హుద్ చేదు అనుభవాలు, ఈ ఏడాది తగ్గిన చెరకు పంట విస్తీర్ణం, బెల్లం ఉత్పత్తిపై పరోక్షంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. లావాదేవీల పరంగా రికార్డు నమోదైనప్పటికీ ధరలు మాత్రం రైతులను నిరాశ పరిచాయి. మొదటి రకం క్వింటాల్‌కు 2890 పలకడం రైతులకు అసంతృప్తి కలిగించింది. ఇక మూడోరకం కనిష్టంగా మరీ దయనీయంగా 2240 రూపాయలు పలకడంతో  ఏ మాత్రం గిట్టుబాటు లేకుండాపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు  చేసే నల్లబెల్లం కంటే మార్కెట్లో విక్రయించే మూడో రకం ధర తక్కువుగా ఉండడం రైతులను నిరాశ పరుస్తోంది.
    
బెల్లం తయారీపైనే మొగ్గు

మరో వైపు తుమ్మపాల కర్మాగారం గానుగాటపై స్పష్టత లేకపోవడం, ఏటికొప్పాక కర్మాగారం పరిధిలో  చెరకు మద్దతు ధర చెల్లింపుపై నెలకొన్న జాప్యం కారణంగా పలువురు  రైతులు చెరకును చక్కెర కర్మాగారానికి తరలించే కంటే బెల్లం తయారు చేయడం మేలని భావిస్తున్నారు. అయితే బెల్లం తయారు చేసేందుకు అవసరమైన సుదీర్ఘ ప్రక్రియ కొద్దిగా ప్రతిబందకంగా మారడం వలన  రైతులు తప్పనిసరి పరిస్థితిలోనే చెరకును కర్మాగారానికి తరలిస్తున్నారు.  తుమ్మపాల చక్కెర కర్మాగార గానుగాటపై స్పష్టత రాకపోవడంతో కర్మాగారంపై ఆధారపడిన కుంచంగి, తుమ్మపాల రైతుల్లో కలవరం మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో తుమ్మపాల రైతుల్లో కొందరు సమీపంలోని బెల్లం తయారీ కేంద్రాలకు చెరకును తరలించి బెల్లాన్ని వండుతున్నారు. తీరా బెల్లాన్ని ఎంతోఆశతో అనకాపల్లి మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు   ధర లేక నిరాశ పరుస్తోంది. కాకపోతే కర్మాగారం ద్వారా చెల్లించాల్సిన మద్దతు ధర రావాలంటే ఏడాది పడుతుంది. అదే బెల్లం విక్రయం ద్వారా వచ్చే ధర రోజుల వ్యవధిలోనే జమ కావడం వలన రైతులకు కొంత ఊరటగా ఉంటుంది.
 

మరిన్ని వార్తలు