‘రేవంత్‌, కిరణ్‌ కుమార్‌రెడ్డి కోవర్టులు’

23 Dec, 2018 11:23 IST|Sakshi
మీడియా సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డి

సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి 25 స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పే చంద్రబాబు.. ఇప్పడు 20 మంది ఎంపీలు ఉంటే ఏం సాధించారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు కేంద్రంలో కొనసాగి సాధించలేని విభజన హామీలను 25 మంది ఎంపీలు ఉంటే సాధిస్తాననటం హాస్యాస్పదమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో నారాయణరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. కడప ఉక్కు కర్మాగారంను తామే సొంతంగా నిర్మించుకుంటామని చంద్రబాబు ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. స్థానిక టీడీపీ ఎంపీలకు చెందిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకే సొంతంగా నిర్మిస్తామని అంటున్నారని ఆరోపించారు.

రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కడప ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో మరోసారి రాయలసీమ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేం‍ద్రమే ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని ఇదివరకే తెలిపింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే కొత్తకుట్ర చేస్తున్నారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగాయని చంద్రబాబు అంటున్నారు. మరి మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలపై ఆయన ఎందుకు మాట్లాడంలేదు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని ఆయనకు తెలుసు. ఓటమి భయంతోనే బాబు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రతీ మీటింగ్‌లో అమరావతిని షాంగై, సింగపూర్‌ చేస్తామని చెప్తున్నారు. కానీ నాలుగున్నరేళ్ల కాలంలో ఏమీ చేయలేకపోయారు’’ అని అన్నారు.

‘‘తిరుపతిని సిలికాన్‌ సిటీగా పేరు మార్చాలనే ప్రతిపాదన విరమించుకోవాలి. లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. గతంలో వెయ్యికాళ్ల మండపంను నిర్మూలించిన తరువాత ఏం జరిగిందో చంద్రబాబుకు బాగా తెలుసు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి, ఏపీలో కిరణ్‌ కుమార్‌లు చంద్రబాబుకు కోవర్టులుగా మారారు. చివరి బంతి అన్న కిరణ్‌ ఇప్పటివరకు ఎక్కడున్నారు. జగన్‌ను విమర్శించే స్థాయి కిరణ్‌కు లేదు. కోవర్టులను వాడుకుని రాహుల్‌ గాంధీని దెబ్బతీయాలనేది చంద్రబాబు ప్రయత్నం.’’ అని పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు