ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత

26 Apr, 2018 02:18 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రాంగోపాల్‌పేట్‌: మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. మూత్రకోశ క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న అయన బుధవారం ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వివేకానందరెడ్డి ఈ నెల 13వ తేదీన హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు వివేకానందరెడ్డి శరీరం సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటించారు.మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తదితరులు ఆసుపత్రికి వచ్చి నివాళులర్పించారు.  

నెల్లూరుకు భౌతికకాయం  
ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నెల్లూరులోని ఏసీ సెంటర్‌లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

విలక్షణ నేత : 1950 డిసెంబర్‌ 25 నెల్లూరులో జన్మించిన వివేకానందరెడ్డి విలక్షణ రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. మాజీ మంత్రి, తన తండ్రి ఆనం వెంకటరెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని 1980లో నెల్లూరు జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో నెల్లూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, వైస్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. వివేకానందరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి కాగా, రెండో కుమారుడు ఆనం రంగమయూర్‌రెడ్డి ప్రస్తుతం నెల్లూరులో కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు.  

సీఎం చంద్రబాబు సంతాపం  
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆనం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 

ఆనం కుంటుంబీకులకు జగన్‌ సానుభూతి
సీనియర్‌ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. వివేకా కుటుంబ సభ్యులకు జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

ఉత్తమ్‌ సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.  

రఘువీరా, కేవీపీ దిగ్భ్రాంతి 
వివేకానందరెడ్డి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు