ఆదర్శం.. అవినీతి పర్వం

15 Nov, 2018 12:25 IST|Sakshi

అభివృద్ధిలో అర్బన్‌ నియోజకవర్గం ఆదర్శమంటూ వైకుంఠం వ్యాఖ్యలు

అవినీతిలోనే  ఆదర్శంగా నిలిచిందని విపక్షాల విమర్శలు

నాలుగున్నరేళ్లలో రూ.కోట్లలో     అవినీతి జరిగిందంటూ మండిపాటు

పర్సెంటేజీలు లేకుండా ఏ పనికీ     అనుమతి ఇవ్వలేదని ఆరోపణలు

ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పరస్పర     వ్యాఖ్యలపై ప్రస్తుతం      జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. జిల్లాలోనే అర్బన్‌ నియోజక ఆదర్శమని ఎమ్మెల్యే గొప్పలు చెబుతుండగా...అవినీతిలోనే ఆదర్శంగా నిలిచారంటూ మాజీ ఎంపీ అనంతతో పాటు విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

(సాక్షిప్రతినిధి, అనంతపురం) : అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం జిల్లాకే ఆదర్శం. నాలుగున్నరేళ్లలో అవినీతి లేకుండా, అభివృద్ధిని అందించాం. జిల్లాకే ‘అనంత’ ఆదర్శం’’
– పలు సందర్భాల్లో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వ్యాఖ్యలు

‘అనంత’ అభివృద్ధిలో కాదు...అవినీతిలో జిల్లాకు ఆదర్శం. ఏ పని చూసినా, ఏ వార్డుకు వెళ్లినా అవినీతి తాండవిస్తోంది. గతంలో మేం చేసిన అభివృద్ధి మినహా నాలుగున్నరేళ్లలో ఎక్కడా అభివృద్ధి కన్పించలేదు.’’– మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు 

జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అనంత అర్బన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లా కేంద్రం కావడం, నియోజకవర్గంలోని ఎక్కువశాతం ఓటర్లు విద్యావంతులు, రాజకీయంగా చైతన్యం ఉన్నవారే కావడంతో ఈ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు జిల్లాలోని తక్కిన నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. మొదటినుంచి ‘అనంత’లో టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభాకర్‌చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే నాలుగున్నరేళ్లలో ‘అనంత’ అభివృద్ధిని ఎమ్మెల్యే, మేయర్‌ పూర్తిగా విస్మరించారు. ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆధిపత్యపోరుతో ‘అనంత’ అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందనేది నగరవాసుల వాదన. కానీ ఎమ్మెల్యే మాత్రం తాను నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, అవినీతికి దూరమని, శాంతి కాముకుడినని, రాజకీయంగా అందరికీ అండగా ఉంటున్నాని ప్రచారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే మాటలకు.. నియోజకవర్గ వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేదు.

అభివృద్ధిలో కాదు...అవినీతిలోనే ఫస్ట్‌
ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి అనుమతి లేకుండా నVýæరంలో చిన్న మురుగు కాలవ పనులు కూడా ముందుకు సాగవన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ప్రతీ పనికి ఈయన కమిషన్‌ ఆశిస్తారని... ఆ పార్టీలోని కార్పొరేటర్లు, నేతలే బాహాటంగా చెబుతున్నారు. జేఎన్‌టీయూ పరిధిలో రూ.150 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో 2 శాతం కమిషన్‌ ఎమ్మెల్యేకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌ పరిధిలో ఐహెచ్‌పీ చేపట్టిన రూ.191 కోట్లతో తాగునీటి పైపులైన్‌ పనుల్లోనూ మొబలైజేషన్‌ అడ్వాన్స్‌కింద మొదట్లో కంపెనీకి ఇచ్చిన రూ.7.5 కోట్లు  ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినట్లు కార్పొరేటర్లే చెబుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేతో పాటు మేయర్‌కూ వాటాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే రాంనగర్‌ బ్రిడ్జి నిర్మాణంలోనూ ఎమ్మెల్యేకు 3 శాతం ‘గుడ్‌విల్‌’ ముట్టజెప్పినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇటీవల వడ్డెర ఫెడరేషన్‌కు చెందిన రూ.12 కోట్లు దారి మళ్లినట్లు బాధితులుపోలీసులను ఆశ్రయించారు. నిజానికి రూ.24 కోట్ల మేర దారి మళ్లాయని, ఇందులో వడ్డెర ఫెడరేషన్‌ చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యే పాత్ర ఉందని కూడా తెలుస్తోంది. 

ఇద్దరికీ వాటాలు
టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి భారీ భవంతులు నిర్మాణాలకు మేయర్‌కు వాటాలు ముట్టందే పని ముందుకు కదలదని కార్పొరేటర్లే చెబుతున్నారు. ‘అనంత’లో భారీ సంఖ్యలో నిర్మాణాలు జరుగుతుండటం, ఆదాయం ఎక్కువగా ఉండటంతో టౌన్‌ప్లానింగ్‌లోని ఓ అధికారి అండతో ఎమ్మెల్యే ఇంటికీ పర్సెంటేజీలు వెళుతున్నాయని తెలుస్తోంది. పైకి మేయర్‌తో విభేదాలు ఉన్నట్లు కనిపించినా.... వాటాల పంపకంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో ఉంటారని ఆపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో రూ.107 కోట్ల అభివృద్ధి పనులు కార్పొరేషన్‌లో జరిగితే రూ.40 శాతం అవినీతి జరిగిందనేది అధికారులు, కార్పొరేటర్లే చెబుతున్నారు. ఇందులో సింహభాగం ఎమ్మెల్యేకు, ఆపై మేయర్‌కు, అధికార పార్టీ కార్పొరేటర్లకు కొద్ది మేర వాటాల పంపకం జరిగిందని తెలుస్తోంది. 2005లో రాష్ట్రపతి పర్యటన ‘అనంత’లో లేకపోయినా ఇక్కడికి వస్తారని సాకు చూపి 36వ డివిజన్‌లో రెండురోజుల్లో రూ.2 కోట్ల ఖర్చుపెట్టి నాసిరకమైన పనులు చేశారు.

సొంతపార్టీ నేతల్లోనే అసంతృప్తజ్వాలలు
టీడీపీలో జయరాంనాయుడు క్రియాశీలకంగా పనిచేశారు. అయితే ఎమ్మెల్యే వైఖరితో విభేదించి అవినీతిపై విమర్శలు చే స్తున్నారు. దీంతో బుల్లెట్‌ లింగమయ్య అనే వ్యక్తి ద్వారా తనను హత్య చేసేందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రయత్నించారని ఇటీవల జయరాం పోలీసులను కలిశారు. ఓ స్కార్పియో ఇవ్వడంతో పాటు రాజకీయంగా ఎదిగేందుకు సహకరిస్తానని లింగమయ్యకు చౌదరి భరోసా ఇచ్చారని జయరాం చెబుతున్నారు. శాంతిస్థాపన కోసం ‘అవే’ను స్థాపించానని చెప్పే చౌదరి... రాజకీయంగా అడ్డొచ్చేవారిని అంతమెందించాలనుకోవడం దారుణమని విమర్శలు వచ్చాయి. ఎవరైనా తనను విమర్శించినా, అడ్డొచ్చినా వారి డివిజన్లపై చౌదరి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయి. కార్పొరేటర్లు ఉమామహేశ్వరరావు, లాలెప్ప, విద్యాసాగర్‌తో పాటు పలువురి కార్పొరేటర్లపై ఈ తరహా ధోరణి అవలంభించారు. ఇలా ‘అనంత’ అవినీతిలో నాలుగున్నరేళ్లుగా అడుగులు వేస్తూ వచ్చిన చౌదరి వ్యాఖ్యలు చూస్తుంటే ‘వేయిగొడ్లను తిన్న రాబంధు ఓ గాలివానకు నెలకూలిందన్నట్లు’ ప్రతీ పనిలో వాటాలు తీసుకునే చౌదరి కూడా వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదని విపక్షపార్టీ నేతలతో పాటు సొంతపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.  

మరిన్ని వార్తలు