‘అనంత’లో అరేబియన్ పంట

20 Jul, 2014 03:55 IST|Sakshi
‘అనంత’లో అరేబియన్ పంట
  • ప్రయోగాత్మకంగా ఖర్జూరం సాగు
  • ఖర్జూరం పండులో క్యాల్షియం, సల్ఫర్, ఇనుము, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, రాగి, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నివారించే శక్తి ఈ పండుకు ఎక్కువ. ఖర్జూరం శాస్త్రీయ నామం ఫీనిక్స్‌డాక్టిలిఫెరా. తాటిచెట్టు మాదిరిగా పెరిగే ఈ చెట్లు ఆడ, మగ వేరువేరుగా ఉంటాయి.
     
    రాయదుర్గం :  అరబ్ దేశాల్లో పండించే ఖర్జూరం పంట ఇప్పుడు మన ప్రాంతానికీ విస్తరించింది. కరువు పీడిత ప్రాంతంగా పేరొందిన ‘అనంత’ నేలలో పండించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం బెణకల్లుకు చెందిన రామక్రిష్ణారెడ్డి తన స్నేహితుడి సలహా మేరకు ఆరేళ్ల క్రితం 15 ఎకరాల విస్తీర్ణంలోని నల్లరేగడిలో దాదాపు 1500 మొక్కలు నాటాడు. రెండు వ్యవసాయబోర్ల ద్వారా మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీటిని అందిస్తున్నాడు.

    మొదట్లో ఇరుగుపొరుగు రైతులు ఎగతాళి చేసినా పట్టించుకోకుండా కంటికి రెప్పలా ఖర్జూరం మొక్కలను కాపాడుకుంటూ వచ్చాడు. పశువుల ఎరువును ఎక్కువశాతం వాడుతూ, అడపాదడపా క్రిమిసంహారక మందు కూడా తక్కువ మోతాదులో ఉపయోగిస్తున్నాడు. మొక్కకూ.. మొక్కకూ 20 అడుగుల దూరం పాటించాడు. కట్టెల నుంచి కాల్చిన బొగ్గును కూడా ఎరువుగా ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం వంద ఖర్జూరం చెట్లు కాపుకొచ్చాయి. ఆరు నెలల క్రితం అంతర్ పంటగా 1500 దానిమ్మ మొక్కలు నాటాడు.
     
    ఫలదీకరణ ప్రక్రియ :ఖర్జూరం పంట మొగ్గదశలో మగచెట్ల పరాగరేణువులను తీసుకుని, ఆడ ఖర్జూర చెట్లకు సంబంధించిన పండ్ల గుత్తిలో పెట్టి వల ఏర్పాటు చేస్తారు. 50 ఆడ చె ట్లను ఫలవంతం చేయడానికి ఒక మగచెట్టు పరాగరేణువులు ఉపయోగపడుతాయి. ఈ పంట 5 నుంచి 8 సంవత్సరాలకు కాపుకొస్తుంది.
     

మరిన్ని వార్తలు