నేను, నాది కాదు.. మనం, మనది!

23 Feb, 2020 08:47 IST|Sakshi

సచివాలయాలతో గడప వద్దకే పాలన 

మన అనే భావన కోసమే ‘మన అనంత – సుందర అనంత’ 

విలువలతో కూడిన విద్యకే ప్రాధాన్యత 

నేనున్నాననే ధైర్యాన్నివ్వడం ఉద్యోగుల బాధ్యత 

కలెక్టర్‌ గంధం చంద్రుడు

‘‘అభివృద్ధి అంటే ఆర్థికంగా మాత్రమే కాదు. సామాజిక అజెండా కూడా ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణమవుతుంది. ఈ భావనతోనే పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టంగా ఈ ఆలోచనతోనే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవడం.. ఇది మనదనే భావన పెంపొందించడం, సొంతంగా మన పనులు మనం చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆలోచనలను తొలగించడం వంటి ప్రాధమ్యాలతో పనిచేస్తున్నాం. కేవలం అధికారంతో పనిచేయించడం కాదు.. ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలనే అభిప్రాయంతో ముందుకెళుతున్నాం’’ అని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అన్నారు. ‘కాఫీ విత్‌ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన ‘సాక్షి’ ఎడిషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. పత్రిక ఎలా డిజైన్‌ అవుతుంది? ఎలా ప్రింట్‌ అవుతుందనే అంశాలను పరిశీలించడంతో పాటు జిల్లా అభివృద్ధిలో తన ప్రాధాన్యతలను ఆయన వివరించారు.    – సాక్షి ప్రతినిధి, అనంతపురం 

‘కాఫీ విత్‌ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా రీడర్స్, సాక్షి ఉద్యోగులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు

విద్యకు ప్రాధాన్యం
గతంలో నాతో పాటు చదువుకునే ఒక మిత్రుడిని వాళ్ల తండ్రి.. కూలికి వెళితే రూ.10 వస్తాయి. చదువుకుంటే ఏం వస్తుందని పనులకు తీసుకెళ్లారు. కూలికి పోవడం వల్ల ఆ రోజు ఆదాయం కనిపించింది. కానీ నేను చదువుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఉద్యోగంతో పాటు ఐఏఎస్‌ కాగలిగాను. ప్రతి ఒక్కరూ పిల్లల చదువుకు ప్రాధాన్యత    నివ్వాలి. 

భరోసా కల్పిద్దాం 
‘‘ఈ కార్యాలయం మనందరిది. ఇక్కడి అధికారులను కలిసే సమయంలో దయచేసి చెప్పులు విడవవద్దు. చేతులు కట్టుకుని ఒంగి నిలబడవద్దు. కన్నీళ్లు పెట్టుకోకండి. కాళ్లు మొక్కకండి.’’ అనే పోస్టర్‌ను రూపొందించాం. ప్రజల భుజం మీద చేయి వేసి.. మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వాలి. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే ప్రజలకు భరోసా కల్పించినప్పుడే ఉద్యోగ జీవితానికి సార్థకత. 

విలువలు ముఖ్యం 
ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కుల వెంట పరుగులు తీస్తుండటం విద్యార్థుల మానసిక స్థితిపై పెను ప్రభావం చూపుతుంది. అలా కాకుండా విద్యార్థి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఫలితాలు ఉండాలి. ఏదో ఒకటి చేసి ఉత్తీర్ణత శాతం చూపించడం వల్ల.. ఆ విద్యార్థి భవిష్యత్తులో దేనికీ పనికిరాకుండా పోతాడు. అలాంటి చదువు వద్దు.. విలువలతో కూడిన విద్య ముఖ్యం.   

‘‘ప్రభుత్వం అంటే ప్రజలది అనే భావన రావాలి. అందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాతో (అధికారులతో) మాట్లాడేటప్పుడు కూడా మనం, మనది అనే చెబుతుంటారు. నేను, నాది అనే భావన కనిపించదు. అందరూ కలిసి పని చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.’’   చదవండి: అదిరిందయ్యా చంద్రం


అధికారి తలుచుకుంటే.. 
అధికారులు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి పనులు చేయాలి. అధికార దర్పంతో కాదు. ఇదెందుకు చెబుతున్నానంటే.. ‘‘నేను కర్నూలులోని జవహర్‌ నవోదయలో పదో తరగతి చదువుతున్న సమయంలో ఆర్‌ఆర్‌బీకి ఎంపికయ్యాను. ఆ ఉద్యోగంలో చేరేందుకు నాకు టీసీ అవసరం. నవోదయలో టీసీ తీసుకోవాలంటే రెండు నెలల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రిన్సిపాల్‌ను కలిస్తే, నిబంధనలు అలా ఉన్నాయని.. హైదరాబాద్‌కు వెళ్లి ఉన్నతాధికారిని కలవమని సూచించారు. చిన్న వయస్సులోనే ఉద్యోగం వచ్చిందనే సంతోషం ఒకవైపున్నా.. టీసీ వస్తుందో రాదోననే టెన్షన్‌. హైదరాబాద్‌కు వెళ్లి నా పరిస్థితిని అంతా వివరించగా ఆ అధికారి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ టీసీ మంజూరుకు అనుమతించారు. ఒక అధికారి తలుచుకుంటే.. ఎంతో కొంత సహాయం చేయగలరనేందుకు ఇదొక నిదర్శనం. ఆ భావన ప్రతి ఒక్కరిలో రావాలి.’’ 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘నేనూ రాయలసీమవాడినే. ఇక్కడి ప్రజల బాధలు, ఆశలు, ఆకాంక్షలు నాకు బాగా తెలుసు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో వర్షపాతం చాలా తక్కువ. విపరీతమైన కరువు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులతో పాటు చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువగా పొలాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల గడప వద్దకే ప్రభుత్వ పాలన వచ్చింది. మనదనే భావన అందరిలో పెంపొందినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. ఇక అధికారంతో పనులు చేయించడం నా విధానం కాదు.. ఆలోచనల్లో మార్పు తెచ్చి పనిచేయించాలన్నదే నా అభిమతం.’’ అని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అన్నారు.

మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా అభివృద్ధి, సంక్షేమం ఏదైనా ప్రభుత్వానికి రెండు కళ్లుగా ఉంటాయి. అయితే, కేవలం ఎకనమిక్‌ అజెండా(ఆర్థిక అభివృద్ధి) మాత్రమే కాకుండా సోషల్‌ ఎజెండాతో కూడా మిళితం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాంటి వారు మంచి స్టేట్స్‌మెన్‌గా గుర్తింపు పొందుతారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి–సంక్షేమంతో పాటు వాటి అమలులో సోషల్‌ ఎజెండా కూడా ఉంది. అది వివిధ ప్రభుత్వ పథకాల్లో కూడా ప్రతిఫలిస్తోంది. ఇందుకు ఉదాహరణలు.. నామినేషన్‌ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం భాగస్వామ్యం కల్పించడం, నామినేషన్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్ల అమలు వంటివి ఉన్నాయి. ఇది నేరుగా మనకు కనపడుతోంది. పరోక్షంగా కూడా ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో. ప్రభుత్వ సేవలు కేవలం కొద్ది మందికి మాత్రమే కాకుండా.. వాయిస్‌ లేని వారికి కూడా అందుబాటులోకి తేవడం. గతంలో ఎవ్వరూ చేయని విధంగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.
 
ఇది మనదనే భావనతో.. 
ప్రభుత్వం అంటే ప్రజలది అనే భావన రావాలి. అందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాతో(అధికారులతో) మాట్లాడేటప్పుడు కూడా మనం, మనది అనే చెబుతుంటారు. నేను, నాది అనే భావన కనిపించదు. అందరూ కలిసి చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే మన బడి నాడు–నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో బడి మనది అనే భావన కేవలం విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, గ్రామస్తుల్లో కూడా రావాలన్నదే అభిప్రాయం. తద్వారా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. వాస్తవానికి విద్యారంగం మీద ప్రభుత్వం చేసే ప్రతీ పైసా ఖర్చు భావితరాలకు ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు అది ఆర్థిక ఫలితాలు ఇవ్వకపోవచ్చుకానీ.. దీర్ఘకాలంలో రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం, పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం చేస్తున్నారు. కచ్చింగా మూడేళ్ల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చెందుతాయి.   చదవండి:  అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు 

గడప వద్దకే...! 
గతంలో ఏదైనా ప్రభుత్వ అధికారిని కలవాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఏ సమయంలో అందుబాటులో ఉంటారనే విషయం కూడా ప్రజలకు తెలిసేది కాదు. మండల కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం గ్రామ సచివాలయాలతో ప్రభుత్వ పాలన ప్రజల గడప వద్దకే వచ్చింది. ఒక గ్రామంలో ఏకంగా 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం.. అందుకు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థ ఇంటి వద్దకు వెళ్లి సేవలందించడం ఇది ఒక చరిత్ర. ఇప్పుడు ఏదైనా పనికావాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏయే అధికారి ఎక్కడ ఉంటారు? ఏయే పనులు చేస్తారు? కూడా స్పష్టంగా పేర్కొంటున్నాం. ఇప్పటికే జిల్లాలో గ్రామ సచివాలయాల వ్యవస్థ పనిచేస్తోంది. ఇంకా ఇబ్బందులు ఉన్న చోట సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తాం. ఎక్కడా లేనివిధంగా జిల్లాలో మొదటిరోజే ప్రజలకు అవసరమైన సేవలను ప్రారంభించాం. 1బీ అడంగల్, డెత్, బర్త్‌ సర్టిఫికెట్లను జారీచేస్తున్నాం. అన్ని సేవలను కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజల గడపవద్దకే పాలన అందిస్తాం.  

ఎవరో వచ్చి ఏదో చేస్తారని.. 
మనకు ఏదైనా సమస్య వస్తే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భావన ఎక్కువగా నాటుకుపోయింది. మన పనులను సొంతంగా మనమే చేసుకోవాలనే భావనను పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగా మన అనంత–సుందర అనంత కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన ఇంటి పక్కన చెత్తను మనమే తీసేద్దాం. మన పరిసరాలను  శుభ్రంగా ఉంచుదామనే అభిప్రాయాన్ని ప్రజల్లో నాటేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది ఒక్క రోజులో అయ్యే పనికాదు. మన భావనలో మార్పులు రావాలంటే సమయం పడుతుంది. అయినప్పటికీ భవిష్యతులో వీటి ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. కేవలం ఉన్న అధికారాలతో ఆదేశాలు జారీచేసి పనులు చేయించే అవకాశం ఉంది. అయితే, అది కేవలం అప్పటివరకే ఉంటుంది. అలా కాకుండా అందరి ఆలోచనల్లో మార్పు వస్తే ఆ మార్పు మనం ఉన్నా లేకపోయినా ఎల్లకాలం ఉంటుంది.  

ఫలితాలకు లింకు లేదు 
చదువు అంటే కేవలం మార్కులు అనే భావన పోవాలి. బట్టీపట్టో, కాపీయింగ్‌ చేసో మార్కులు సాధించడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. మా పాఠశాలలో 100 శాతం రిజల్ట్స్‌ వచ్చింది. మా జిల్లాలో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాం అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అందుకే కేవలం మార్కుల మీద కాకుండా విజ్ఞానం పెంచుకోవడం మీద ధ్యాస ఉంచాలి. గతంలో పాఠశాల ఉత్తీర్ణత శాతానికి.. ప్రమోషన్లకీ లింకు ఉంది. అందుకే ఉత్తీర్ణత శాతం ఎక్కువ తెచ్చేందుకు ఉపాధ్యాయులు ఆరాటపడేవారు. ఇప్పుడు నేను పదో తరగతి ఉత్తీర్ణత విషయంలో కచ్చితంగా అందరికీ చెప్పాను. మీ ఫలితాలకు, ప్రమోషన్లకీ సంబంధం ఉండదని వివరించాం. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి.. స్ట్రిక్టుగా ఉంటామని చెప్పడం వల్ల ఫలితం ఉండదు. మన ఆలోచనల్లోనే మార్పులు రావాలి. ఆ దిశగానే 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఒక లేఖ రాశాను. త్వరలో 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులతో టెలీ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను.  

మరిన్ని వార్తలు