ఆర్టీఏలో 'మోనార్క్‌'

11 Feb, 2020 11:56 IST|Sakshi

చిరుద్యోగులతో అనధికార విధులు  

ఆరు నెలలుగా ఇంటిలో పనిమనిషిగా సెక్యూరిటీ గార్డ్‌

చెక్‌పోస్టులో విధులు కావాలంటే విజయవాడకు టర్న్‌ డ్యూటీ

చిరుద్యోగులకు మెలిక పెట్టిన అధికారి  

అంతా తానై చూసుకుంటున్న ఓ కానిస్టేబుల్‌

అధికారి చర్యలతో విస్తుపోతున్న సిబ్బంది

రోడ్డు రవాణా శాఖలో ఓ ఉన్నతాధికారి మోనార్క్‌ పాలన సాగిస్తున్నాడు. కాసుల కోసం చేయి తిరిగిన సిబ్బందికి దగ్గరలోనే విధులు కేటాయించడం, నిక్కచ్చిగా ఉన్న వారిని దూరప్రాంతాలకు పంపడం పరిపాటిగా మారుతోంది. చిరుద్యోగులతో అనధికారిక విధులు చేయిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మొత్తం ఈ వ్యవహారం వెనుక ఓ కానిస్టేబుల్‌ తతంగం నడిపిస్తుండడం గమనార్హం.  

అనంతపురం సెంట్రల్‌: రోడ్డు రవాణాశాఖలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అధికారి దారితప్పిన ఓ ఉద్యోగిని చేరదీశాడు. దీని వెనుక అసలు కథ చాలానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సదరు అధికారి అవసరాలన్నీ ఆ కానిస్టేబులే చూసుకుంటున్నాడు. గతంలో ఇతని ఉచ్చులో పడిన అధికారులు బలి పశువులయ్యారు. ఓ షోరూంలో పనిచేసే మహిళతో అక్రమ వ్యవహారంలో పడి ఓ అధికారి విలవిలలాడిపోయారు. రూ. లక్షలు చెల్లించి కేసు రాజీ చేసుకోవాల్సి వచ్చింది. తాజాగా బదిలీ వేటు పడిన అధికారి గానా బజానా ఏర్పాటు చేయడం.. దానికి ఓ షోరూం నిర్వాహకుడు ఫైనాన్స్‌ చేయడం వెనుక సదరు కానిస్టేబుల్‌ ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం పెద్ద దూమారం రేగి రాష్ట్ర అధికారుల వరకు వెళ్లింది. దీంతో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. 

ఇంట్లో పనిమనిషిగా సెక్యూరిటీ గార్డు
సదరు అధికారి ఇంట్లో పనిమనిషిగా ఓ సెక్యూరిటీ గార్డు ఏడెనిమిది నెలలుగా పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సోము అనే సెక్యూరిటీ గార్డు కార్యాలయానికి రావడమే మానేశాడు. ఉదయం పాల ప్యాకెట్లు తెచ్చే దగ్గర నుంచి అన్ని పనులూ అతనే చూసుకుంటున్నట్లు సమాచారం. ఆయన విధులు మాత్రం మిగతా సెక్యూరిటీ గార్డు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు పనిభారం అవుతోందని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.  ఇదిలా ఉంటే హోంగార్డుల అత్యాశను సదరు అధికారి అలుసుగా తీసుకొని ఉన్నతాధికారుల వద్ద మార్కులు కొట్టేసే పనిలో పడ్డారు. ఆర్టీఏలో పని చేసే ప్రతి ఒక్కరూ చెక్‌పోస్టులో పనిచేయాలని కోరుకుంటారు. రోజూ రూ.లక్షల్లో అక్రమ ఆదాయం ఉంటుంది. అక్కడ పనిచేస్తే అందులో అందరికీ సమానంగా వాటాలు వస్తాయి. అక్కడికిపోవాలని కోరుకునే సిబ్బందికి ముందుగా విజయవాడ టర్న్‌ డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. దీంతో కొంతమంది వేలకు వేలు ఖర్చు పెట్టుకొని విజయవాడలో అధికారుల వద్ద పనిచేసి వస్తున్నారు. ఇలా అనేక విషయాల్లో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.  

తాజాగా సదరు కానిస్టేబుల్‌ అంతా తానై ఆర్టీఏను నడిపిస్తున్నాడు. ఆర్టీఏలో ఏ అధికారిని ఎక్కడ పెట్టాలి... జిల్లా కేంద్రంలో ఎవరుండాలి... తదితర అంశాలపై ఆ కానిస్టేబుల్‌ సలహా తీసుకునే అధికారి నడుచుకుంటున్నారు. గతంలో అనేక ఏళ్లుగా ఇక్కడే తిష్టవేసి పనిచేస్తుండడంతో గతంలో సాక్షిలో కథనం రావడంతో అప్పటి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాడు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలోనే ఇతర ఆర్టీఏ కార్యాలయాల వెళ్లాల్సి ఉంది. కాగా ఇటీవల మళ్లీ చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. ఇటీవల అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్లాడు. ఇప్పుడు తిరిగి అనంతపురానికి వచ్చాడు. తొలుత ఓ ఎంవీఐకి అటాచ్‌ చేశారు. అక్కడ ఎక్కువ ఆదాయం ఉండదనుకున్నాడో ఏమో రెండు రోజుల్లో అక్కడే మరో ఎంవీఐకి ఆగమేఘాలపై బదిలీ చేయించుకున్నాడు. మిగిలిన వారికి మాత్రం గుంతకల్లు, హిందూపురం, కదిరి ప్రాంతాలకు తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. అవినీతిపరుడిగా ముద్రపడిన ఇతడికి ఇటీవల ఉత్తమ అధికారిగా సత్కారం చేయడం గమనార్హం. 

మరిన్ని వార్తలు