'మేలు'కొన్నారు

26 Mar, 2020 10:21 IST|Sakshi
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉగాది రోజునా తెరుచుకోని అనంతపురం మొదటిరోడ్డులోని శివాలయం

జిల్లాలో పకడ్బందీగా లాక్‌డౌన్‌

ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలు 

సామాజిక బాధ్యత చాటిన వైనం

అనంతపురం క్రైం: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ వైరస్‌ ప్రబలకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించగా.. బుధవారం జనం స్వచ్ఛందంగా ఆచరించారు. మంగళవారం కాస్త రోడ్లపైకి వచ్చినా వైరస్‌ వ్యాప్తి చెందితే కలిగే ప్రమాదాన్ని గుర్తించి మేల్కొన్నారు. ఎవరికి వారు చైతన్యవంతులై తెలుగు సంవత్సరాది ఉగాది రోజున కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఇక బయటి ప్రాంతాల వారి రాకపోకల వల్లే వైరస్‌ ప్రబలుతున్నట్లు తెలుసుకున్న చాలా గ్రామాల వారు ఇతరులు గ్రామంలోకి రాకుండా రోడ్డుపై ముళ్లకంపలు వేసి ఇతర ప్రాంతాల వారు తమ గ్రామంలోకి రావ్వొద్దంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక దూరం పాటిస్తూ కోవిడ్‌ వైరస్‌ తమ దరి చేరకుండా కృషి చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ విజయవంతం
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్‌ 14 వరకు 21 రోజులు లాక్‌డౌన్‌లో ఉండాలని దేశ ప్రజలను కోరారు. ఈక్రమంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లతో పాటు వివిధ నియోజకవర్గాల్లో పోలీసులు రోడ్లన్నీ బ్లాక్‌ చేశారు. ప్రధాన కూడళ్లలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీంతో పాటు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. రాత్రి వేళల్లో వివిధ స్టేషన్‌ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

మీడియాపై ఓవరాక్షన్‌  
కోవిడ్‌ నేపథ్యంలో మీడియా, పత్రికల పాత్ర కీలకంగా మారింది. వైద్యులు, పోలీసులతో పాటు పత్రికారంగం కోవిడ్‌ నియంత్రణలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాను కూడా అత్యవసర సేవల కింద గుర్తిస్తూ జర్నలిస్టులు ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతులు ఇచ్చింది. సాక్షాత్తు ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించకండని ఆదేశాలు జారీ చేశారు. దాన్ని అమలు చేయాల్సిన పోలీసులే నిబంధనలు ఉల్లంఘించారు. చేతిలో లాఠీ ఉంది కదా అని రెచ్చిపోయారు. మంగళవారం డీఐజీ కాంతిరాణా ప్రెస్‌మీట్‌కు వెళ్తున్న ఓ వీడియోజర్నలిస్ట్‌పై ఏఆర్‌ కానిస్టేబుల్‌ నాగేంద్ర నోరుపారేసుకున్నాడు. ప్రెస్‌ అని చెప్పినా వినకుండా.. దుర్భాషలాడారు. పక్కనే ఉన్న ఎస్‌ఐ నాగమధు ప్రేక్షకపాత్ర పోషించడం గమనార్హం.
లెక్చరర్స్‌ కాలనీలో ఉంటూ ఆస్పత్రిలో పనిచేసే ఓ స్టాఫ్‌నర్సు విధులు నిర్వర్తించేందుకు ఈ నెల 24న తన భర్తతో కలసి ఆస్పత్రికి దేరగా.. ఆర్ట్స్‌ కళాశాల కూడలిలోని పోలీసులు వారిని ఆపేశారు. తాను ఆస్పత్రిలో పనిచేస్తున్నానని సదరు ఉద్యోగిని చెప్పినా వారు వినిపించుకోలేదు.  
ఇక అనంతపురంలోని నడిమివంక వద్ద మంగళవారం రాత్రి ఓ మీడియా సంస్థలో పనిచేసి చిరు ఉద్యోగి తన గుర్తింపు కార్డు చూపినా పోలీసులు లాఠీన్యం చూపారు.  
సోమవారం కూడా నడిమివంక వద్దే బైక్‌పై ఫ్యామిలీతో బయటకు వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. కుటుంబం సహా బయటకు ఎందుకు వచ్చాడో కనీసం ఆరా తీయలేదు. పైగా కుటుంబీకుల ముందే సదరు వ్యక్తిని లాఠీలతో బాదిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా జనమంతా పోలీసుల తీరును తప్పుపడుతున్నారు.

మీడియా ప్రతినిధులను అడ్డుకోవద్దు
అనంతపురం అర్బన్‌: ఏప్రిల్‌ 14 వరకు లాక్‌ డౌన్‌ నేపథ్యంలో జిల్లా ప్రింట్,  ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులను అడ్డుకోకూడదని కలెక్టర్‌ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కట్టడిలో భాగంగా వార్తల కవరేజీ, విధులు నిర్వహించే ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులను ఆదేశించారు. మీడియా ప్రతినిధులను అడ్డుకుంటూ తమ విధులకు పోలీసులు ఆటంకం కల్గిస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్‌ స్పందించారు. అక్రిడిటేషన్‌ కార్డు లేదా ఆయా పత్రికా యాజమాన్యాలు జారీ చేసిన ఐడీ కార్డులను పరిశీలించి వారి విధులకు ఆటంకం లేకుండా చూడాలని కలెక్టర్‌ పోలీసులను ఆదేశించారు.    

మరిన్ని వార్తలు