మూడు రాజధానుల ఆలోచన అద్భుతం

28 Jan, 2020 13:34 IST|Sakshi

సీమలో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ను స్వాగతిస్తున్నాం

అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థుల సదస్సు

అనంతపురం:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ఆలోచన అద్భుతంగా ఉందని అనంతపురం జిల్లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే రాయలసీమలో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయడాన్ని వారు స్వాగతించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటువల్ల శ్రీభాగ్ ఒప్పందానికి న్యాయం జరిగిందని గుర్తు చేశారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యార్థులు మాట్లాడుతూ.. ఏపీలో అధికార, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ వల్ల తమకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.


 
సీఎం యాక్షన్‌ ప్లాన్‌ బాగుంది
 ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ యాక్షన్ ప్లాన్ బాగుందని ఎస్కే యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. అభివృద్ధి ఒకేచోట ఉంటే ప్రాంతీయ అసమానతలు వస్తాయని పేర్కొన్నారు. అమరావతి రాజధానికి లక్ష కోట్ల అవసరమా? అని ప్రశ్నించారు. ఏపీలో మెగా క్యాపిటల్ అవసరం లేదని, మనకు కావాల్సింది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కాదు.. గ్రౌండ్ ఫీల్డ్ క్యాపిటల్ కావాలని, ఇదే విషయాన్ని బోస్టన్ గ్రూప్ కూడా స్పష్టం చేసిందని తెలిపారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదులుకోవటం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమని అన్నారు.

మేధావుల మద్దతు
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న అధికార వికేంద్రీకరణ నిర్ణయానికి మేధావులు మద్దతు ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధి ప్రజల హక్కు అని వారు స్పష్టం చేస్తున్నారు. శాసనమండలి రద్దు.. ప్రతిపక్ష టీడీపీ స్వయంకృతాపరాధమేనని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్ర అభివృద్ధిపై తిరుపతిలో అవగాహన సదస్సు జరిగింది. ప్రజల అభిష్ఠానాన్ని అడ్డుకుంటూ.. మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను చంద్రబాబు అడ్డుకోవడం దారుణమని అన్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో పట్టిన చంద్రగ్రహణం వీడిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు మూడు రాజధానులు అవసరం గురించి తిరుపతి ఎస్వీయూలో అవగాహన సదస్సు జరిగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి  విభాగం నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రొపెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరు మూడు రాజధానులకు మద్దతు తెలిపారు. చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు బట్టారు.

భారీ ర్యాలీ..
మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. జేఏసీ నేత రాజా రెడ్డి నేతృత్వంలో వందలాదిమంది ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జేఏసీ నేతలు ఈ సందర్భంగా అన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయానికి తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని తెలిపారు.

స్వాగతిస్తున్న ప్రవాసాంధ్రులు
ఏపీ సీఎం వైఎస్ జగన్  మూడు రాజధానులపై తీసుకున్న  నిర్ణయాన్ని ప్రవాసాంధ్రులు స్వాగతిస్తున్నారు. సౌతాఫ్రికాలో నివాసం ఉంటున్న తెలుగువారు సీఎం వైఎస్ జగన్ కు మద్దతు తెలుపుతూ అక్కడ ప్రదర్శన నిర్వహించారు. పాలన వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందంటున్నారు.

మరిన్ని వార్తలు