‘నగు’బాట

28 Feb, 2019 08:58 IST|Sakshi
కణేకల్లు రోడ్డును కలుపుతూ ఏర్పాటు చేసిన సర్కిల్‌లో కట్టిన మరుసటి రోజే కూలిన డివైడర్‌

మంత్రి కాలవ.. ప్రజలను మాయ చేయడంలో దిట్ట. జనం కళ్లకు గంతలు కట్టి లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు నమ్మిస్తున్నారు. అభివృద్ధి మాటున రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపుతూ ఓట్లు దండుకునేందుకు పన్నాగం పన్నారు. ఇందుకోసం ఒకే పనికి పదే పదే భూమిపూజలు, శంకుస్థాపనలు చేసేస్తున్నారు. రాయదుర్గం పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు కూడా తన ఓటు రాజకీయానికి వాడుకున్నారు. 2014లో ప్రారంభమైన 4 కి.మీ రోడ్డు విస్తరణ పనులకు గతంలోనే రెండుసార్లు శంకుస్థాపన చేసిన మంత్రి కాలవ.. ఎన్నికల కోడ్‌ వస్తుండటంతో 1.3 కి.మీ మాత్రమే పూర్తయిన పనులకు ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసి నవ్వులపాలయ్యారు. 

రాయదుర్గం : పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరం కావడంతో రోడ్డు విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు పంపగా.. 2014 డిసెంబర్‌లో ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అనంతపురం రోడ్డులోని పాలశీతలీకరణ కేంద్రం నుంచి లక్ష్మీబజార్, పాతబస్టాండ్, వినాయక సర్కిల్, తేరు బజార్‌ మీదుగా మొలకాల్మూరు రోడ్డులోని చెక్‌పోస్టు సమీపంలో హైవే రోడ్డుకు లింక్‌ కలుపుతూ 4 కి.మీ, రోడ్డు విస్తరణకు రూ.9.10 కోట్లు మంజూరయ్యాయి. అంతేకాకుండా తాగునీటి పైపులైను, డ్రైనేజీ, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు కోసం అదనంగా మరో రూ.4.59 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో మొత్తంగా రూ.13.69 కోట్లు మంజూరు కాగా.. అంతా తానే చేయించినట్లు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన కాలవ శ్రీనివాసులు ప్రచార ఆర్భాటం చేశారు. ఆరు నెలల్లో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిడంతో పాటు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామంటూ ప్రతి సమావేశంలోనే ప్రసంగాలు దంచేశారు.

మార్కింగ్‌లో లోపించిన పారదర్శకత 
2015 నవంబర్‌ 26న రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాగా... తొలుత ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అయితే ఆక్రమణల తొలగింపులో కూడా అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. తమకు కావాల్సిన వారి భవనాలు, స్థలాలు కాపాడేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చే మార్కింగ్‌ మార్చేశారు. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారాయి. అందువల్లే లక్ష్మీబజార్‌లో 80 అడుగుల మేర వేసిన మార్కింగ్‌....వినాయక సర్కిల్‌  నుంచి తేరుబజార్‌ వరకు 72 అడుగులకే కుచించుకుపోయింది. అంతేకాకుండా రోజుకోసారి మార్కింగ్‌ మారుస్తూ ఇక్కడి టీడీపీ కీలక నేతలు వ్యాపారుల నుంచి భారీగా దండుకున్నారు.
 
ఇప్పటికి మూడుసార్లు 
రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కాలవ శ్రీనివాసులు ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడల్లా పట్టణంలో ఆర్భాటంగా సమావేశం నిర్వహించడం.. రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇలా ఇప్పటికి మూడుసార్లు భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ధ పనులు చేయించడంపై లేకపోవడంతో నాలుగేళ్లు గడిచినా పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు 1.3 కి.మీ మేర మాత్రమే పూర్తయ్యాయి. అయినప్పప్పటికీ తన వల్లే రాయదుర్గం పట్టణం సుందరమైపోయినట్టు, జిల్లాలో ఎక్కడా లేని అభివృద్ధి జరిగినట్లు మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారు.
 
సగం పనులతో సంబరాలు 
పట్టణంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి వినాయకసర్కిల్‌ , తేరుబజార్‌ వరకు కేవలం 1.3 కి.మీ. సీసీ రోడ్డు వేశారు. అరకొరగా డివైడర్లు వేసి, విద్యుత్‌ దీపాలు అమర్చారు. 1.3 కి.మీ.లలో కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. లింక్‌ రోడ్లను కలుపుతూ రోడ్లు వేయలేదు. రెండు రోడ్ల మధ్య దారులు వదిలిన చోట డివైడర్ల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అయినప్పటికీ త్వరలోనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి కాలవ హడావుడి చేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయని చెప్పి ప్రజలను మభ్య పెట్టేందుకు ఈ నెల 22వ తేదీన రాత్రి వేళ హడావుడిగా జెడ్పీ చైర్మన్‌ పూల నాగరాజుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.
 
అన్నీ అప్పటికప్పుడే  
మంత్రి కాలవ రోడ్డు విస్తరణ పనులకు ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించుకోవడంతో...అధికారులు కూడా హడావుడిగానే పనులు చేసేశారు. సీసీ రోడ్డుకు లింక్‌ కలుపుతూ 140 మీటర్ల బీటీ రోడ్డును ప్రారంభోత్సవానికి మూడు రోజుల ముందు వేశారు. అలాగే డివైడర్లకు అక్కడక్కడా రంగుల ప్యాచ్‌లు వేశారు. అలాగే ఆఘమేఘాల మీద శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో కణేకల్లు రోడ్డును కలుపుతూ ఏర్పాటు చేసిన సర్కిల్‌లో 20వ తేదీ కట్టిన డివైడర్‌ 21వ రోజే పడిపోయింది.
 
తేరుబజార్‌ రోడ్డు విస్తరణలో  అధికార పార్టీ రాజకీయం 
ఇక తేరుబజార్‌లో జరిగిన రోడ్డు విస్తరణ పనులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అడ్డుకున్నారు. వినాయక సర్కిల్‌ నుంచి తేరుబజార్‌ వరకు 1.5 మీటర్ల డివైడర్‌ వేయగా, పట్టుపట్టి దాన్ని ఒక మీటర్‌కు కుదించారు. అలాగే తేరు వద్ద నుంచి గుమ్మఘట్ట, మొలకాల్మూరు రోడ్డు క్రాస్‌ వరకు సీసీ రోడ్డు వేయకుండా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే బాధితులతో కోర్టులో కేసు వేయించినట్లు అధికార పార్టీలోని ఒకవర్గం నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రచార ఆర్భాటం మాని...చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేయాలని, లేకపోతే సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పితీరుతామని దుర్గం వాసులు మంత్రి హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు