కర్నూలు సిమెంట్‌ ఫ్యాక్టరీకి అనంతపురం ఇసుక 

23 Aug, 2019 12:24 IST|Sakshi
భారీగా ఇసుక అక్రమ రవాణాతో ఏర్పడిన గోతులు

జేసీబీతో లోడింగ్‌ చేస్తున్న వైనం 

అనుమతి వారం రోజులు.. తరలింపు 15 రోజులకు పైనే.. 

వాహనాల్లో కనిపించని జీపీఎస్‌ వ్యవస్థ 

చేష్టలుడిగిన రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు  

ఇది శింగనమల నియోజకవర్గం  ఉల్లికల్లు గ్రామంలోని ఇసుక రీచ్‌. అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామనే పేరుతో ఇసుకను కర్నూలు జిల్లాలోని సిమెంటు ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఇక్కడ నేరుగా ఇసుక రీచ్‌లోకి టిప్పర్లు వెళ్లడంతో పాటు జేసీబీతో లోడింగ్‌ చేస్తున్నారు. వాస్తవానికి రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌ వరకు కేవలం ట్రాక్టర్ల ద్వారా, అది కూడా మనుషులతోనే ఇసుకను లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇసుకాసురులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు పట్టించుకోకపోవడంతో ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుగొండ, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. 

సాక్షి, అనంతపురం: ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా ముసుగులో విలువైన ఇసుక జిల్లా సరిహద్దులే కాదు.. ఏకంగా రాష్ట్ర సరిహద్దులను దాటి అక్రమంగా తరలిపోతోంది. ఈ వ్యవహారంలో కొద్దిమంది ఇసుక కాంట్రాక్టర్లు భారీగా వ్యవహారాలు నడుపుతూ.. రెవెన్యూ, పోలీసులను అటువైపు రాకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. బళ్లారి, బెంగళూరు వంటి నగరాలకు ఇక్కడి నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నారు. అయినప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీసు వ్యవస్థలు అచేతనంగా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వ్యవహారంలో అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా ఇసుకను తరలిస్తున్నారు. తద్వారా ఈ ఇసుకను అధిక ధరకు మార్కెట్లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇసుక రీచ్‌ నుంచి ఇసుకను తరలించే వాహనాల వివరాలను ముందుగా సంబంధిత రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగానే పేర్కొన్న వాహనాల్లో మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతిస్తారు. అది కూడా అనుమతించిన వాహనాలకు జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జీపీఎస్‌ వ్యవస్థను నిరంతరం రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌  అధికారులు పర్యవేక్షించాలి.

తద్వారా అనుమతి ఇచ్చిన ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే ఇసుక సరఫరా అవుతోందా? పక్కదారి పడుతుందా అనే విషయం తెలిసిపోతుంది. అయితే, ఇక్కడే ఇసుకాసురులు దోపిడీకి మార్గం ఏర్పడింది. అనుమతి తీసుకున్న వాహనాలకు జీపీఎస్‌ పరికరాలను అమర్చుకోవడం లేదు. ఒకవేళ అమర్చుకున్నప్పటికీ నిర్దేషిత ప్రాంతానికి వెళ్లిన తర్వాత జీపీఎస్‌ వ్యవస్థ పనిచేయకుండా చేస్తున్నారు. తద్వారా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అంతేకాకుండా నిర్దేషించిన వాహనాలను మాత్రమే కాకుండా ఇతర వాహనాలను కూడా ఇసుక సరఫరాలో వినియోగిస్తున్నారు. ఇందుకోసం అనుమతి తీసుకున్న వాహనం పనిచేయడం లేదని చెబుతున్నారు. ఈ విధంగా ఇసుకాసురులు రెచ్చి పోవడానికి ప్రధాన కారణం.. రెవెన్యూ, మైనింగ్, పోలీసు వ్యవస్థలు కూడా అమ్యామ్యాలకు అలవాటుపడటమే. పర్మిట్లు ఇచ్చే విషయం నుంచి ఇసుకను తరలించే వరకూ ఈ విధంగా అన్ని విధాల అధికారులు ఇసుకాసురులకు సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఇవీ నిబంధనలు..! 
ఇసుక సరఫరాలో ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేయనుంది. అప్పటి నుంచి ఇసుకాసురులు తమ ఆటలు సాగవని తెలుసుకుని సందట్లో సడేమియాగా ఇప్పుడే సొమ్ముచేసుకుంటున్నారు. నిబంధనల మేరకు ఇసుక రీచ్‌ నుంచి కేవలం మనుషుల ద్వారా లోడింగ్‌ చేసుకోవాలి. అది కూడా కేవలం ట్రాక్టర్లకు మాత్రమే. ఇక్కడి నుంచి స్టాక్‌ పాయింట్‌కు తీసుకొచ్చిన తర్వాత ఇతర వాహనాల్లో ఇసుకను తరలించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా దూరం మరీ ఎక్కువైతేనే టిప్పర్లను అనుమతిస్తారు. అదేవిధంగా ఈ వాహనాలకు జీపీఎస్‌ పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జిల్లాలో ఇసుక సరఫరా వ్యవహారంలో ఈ నిబంధలను అధికారులు ఎక్కడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా ఇసుకాసురులు ఆడింది ఆట.. పాడింది పాటగా వ్యవహారం సాగుతోంది. 

మరిన్ని వార్తలు