జిల్లాకు మహానేత వైఎస్‌ హయాంలోనే న్యాయం 

10 Apr, 2019 10:50 IST|Sakshi

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ, సీనియర్‌ నేత  ‘అనంత’ వెంకటరామిరెడ్డి

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘‘జిల్లా గతిని మార్చేందుకు శాయశక్తులా శ్రమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నరంటే అది దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే. సొంత జిల్లా కడప కంటే ‘అనంత’ అభివృద్ధికే పరితపించారాయన. ఫలానా పని కావాలని మేం ఫైలు తీసుకెళితే ఒక్కటి కూడా ‘కాదు.. కూడదు’ అన్న మనిషేకాదు. ‘మీ జిల్లాకు ఎంత చేసినా తక్కువే..’ అంటూ చిరునవ్వుతో సంతకం చేసి పంపేవారు. అలాంటి మహామనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. చంద్రబాబు ఐదేళ్లపాలన చూస్తే వంచన, అబద్దాలు, మోసం మినహా మరొకటి లేదు. టీడీపీని ఆదరించిన పాపానికి జిల్లాను వంచించిన తీరు దుర్మార్గం. ఈ జిల్లాకు మళ్లీ న్యాయం జరగాలన్నా.. కష్టాలు తీరాలన్నా.. అభివృద్ధి పట్టాలెక్కి అన్ని వర్గాలు సుఖసంతోషాలతో ఉండాలన్నా వైఎస్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం. చంద్రబాబు పాలనను ఇన్నేళ్లు చూసిన ప్రజలంతా జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి. సంక్షేమపాలన చూస్తారు.’’ అని సీనియర్‌ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన జిల్లా స్థితిగతులు పంచుకున్నారు.


సాక్షి: ఇన్నేళ్లు ఎంపీగా పోటీ చేశారు? తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు? ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారని భావిస్తున్నారు?
‘అనంత’: నాలుగుసార్లు ఎంపీగా పోటీ చేశా. నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత సంతృప్తినిచ్చింది వైఎస్‌ ప్రభుత్వం. నేను రైతునే. నీళ్ల విలువ తెలిసినవాడిని. మా నాన్న పేరుతో ‘అనంత’ వెంకటరెడ్డి హంద్రీ–నీవా పథకాన్ని వైఎస్‌ ప్రారంభించినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. హెచ్చెల్సీ ఆధునికీరణ, ఛాగళ్లు, పెండేకల్లు, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా సగం జిల్లా మంచినీటి సమస్య తీర్చాం. అనంతపురం సిటీ కోసం పీఏబీఆర్‌ నుంచి పైపులైన్‌తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రామలు చేశాం. టీడీపీ నేతలు గత ఐదేళ్లలో ఫలాన అభివృద్ధి చేశామని చెప్పగలరా? వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. 12 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారు. ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు.


సాక్షి: చెరువులకు నీళ్లు ఇచ్చామని చెబుతున్నారు?
‘అనంత’: హంద్రీ–నీవా ద్వారా 3.50లక్షల ఎకరాలకు సాగునీరు, అన్ని చెరువులకు నీళ్లివ్వాలని జీఓ ఉంది. 7 ఏళ్లుగా నీళ్లు వస్తున్నాయి. 30 ఎకరాలకు నీరివ్వలేదు. ఏడాదిలోపు సాగునీరు ఇస్తామన్నారు. 25సార్లు సీఎం వచ్చారు. నీరివ్వలేదు. పాదయాత్ర ద్వారా కృష్ణాజలాలను 2012 నవంబర్‌ 29న జీడిపల్లికి తీసుకొచ్చాం. సాగునీరు ఉంటే వలసలు ఆగేవి. కేంద్ర ప్రభుత్వ సర్వేలో ‘అనంత’లో కనీవినీ ఎరుగని రీతిలో వలసలు ఉన్నాయని తేలింది. 280మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో కేరళకు ఓ బృందం వెళ్లింది. అయినా చీమకుట్టినట్లయినా లేని ప్రభుత్వం ఇది.


సాక్షి: పారిశ్రామిక అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం పాటుపడలేదా? 
‘అనంత’: ప్రత్యేకహోదా వచ్చి ఉంటే జిల్లా బాగుపడేది. చంద్రబాబు అడ్డుకున్నారు. బెల్,  సెంట్రల్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ అకాడమీలకు పసుపు, కాషాయ కండువాలు కలిపి వేసుకుని చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ రాళ్లు కూడా ఉన్నాయో లేదో తెలీదు. కియా వచ్చిందని చెబుతున్నారు. బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ఏపీఐఐసీ సేకరించిన భూములు ఇప్పటి వరకూ కియాకు బదిలీ చేయలేదు. ముడుపులు ఇవ్వలేదని ఆ ప్రక్రియ నిలిపేశారు. కియాలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. అధికారపార్టీ నేతలంతా కియా పేరుతో చేయని అవినీతి లేదు. అయినా సీఎం మాట్లాడలేదంటే ఆయనకు వాటాలు ఉండటమే.


సాక్షి: అనంతపురం రైల్వేబ్రిడ్జి తానే తెచ్చానని ఎంపీ జేసీ చెబుతున్నారు?
‘అనంత’: సిగ్గుపడాలి.రాయదుర్గం–తుముకూరు రైల్వేలైన్‌ వైఎస్‌ హయాంలో తెస్తే 90శాతం పనులు పూర్తి చేశాం. తక్కిన 10శాతం ఇప్పటికీ ఈయన చేయించలేదు. గుంతకల్లు–బెంగళూరు లైన్‌కు ఎలక్ట్రిఫికేషన్‌ మంజూరు చేస్తే ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఇదీ ఆయన పరిస్థితి. రాంనగర్‌ రైల్వేబ్రిడ్జికి నేను నిధులు మంజూరు చేయించా. అంతేకాదు.. నగరంలో మంచినీటిపైపులైన్‌ పనులకు నా హయాంలో టెండర్లు కూడా వేశారు. అవి ఇప్పడు వీరు చేస్తున్నారంతే. కొత్తగా వీళ్లు పూచిక పుల్ల తీసుకురాలేదు. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌ మూడు కుంపట్లలా కొట్టుకుని అభివృద్ధిని విస్మరించారు. ఆధిపత్యపోరు కోసం కార్పొరేటర్లు, టీడీపీ కేడర్‌ను విభజించి నిత్యం తగవులాడుతున్నారు. కార్పొరేషన్‌ అవినీతిలో కూరుకుపోయిందని ఎంపీ, ఎంపీ కళ్లజోడు తీస్తే తెలుస్తుందని మేయర్, జేసీ చిట్టా మొత్తం నా వద్ద ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ గుట్టు ఎంటో ముగ్గురూ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి.


సాక్షి: మీరు గెలిచి, మీ ప్రభుత్వం అధికారంలోకి  వస్తే ఏం చేస్తారు?
‘అనంత’: వైఎస్‌ హయాంలో కేంద్రం నుంచి జేఎన్‌యూఆర్‌ గ్రాంటు ద్వారా రూ.72కోట్లతో అనంతపురానికి మంచినీళ్లు తెచ్చాం. ఈరోజు 90శాతం ఇళ్లలో ఆటోల ద్వారా మినరల్‌ వాటర్‌ కొంటున్నారు. నేను గెలిస్తే  ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీళ్లు ఇస్తాం. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు పూర్తి చేసి డంప్‌యార్డు తరలిస్తాం. వైఎస్‌ హయాంలో కురుగుంట, ఉప్పరపల్లెలో వేల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చాం. మళ్లీ ఇళ్లు లేనివారికి  ఇళ్లు ఇస్తాం. ఇళ్లకోసం ప్రభాకర్‌చౌదరి ప్రజల సొమ్ముతో డీడీలు తీయించారు. ఇవేవీ లేకుండా ఇళ్లు ఇస్తాం.


సాక్షి: చివరగా మీ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుంది? 
‘అనంత’: ఎమ్మెల్యేల ఇళ్లే తహసీల్దార్, పోలీసు కార్యాలయాలు అయ్యాయి. మేం అధికారంలోకి వస్తే ప్రతీ ఉద్యోగి తన ఉద్యోగ ధర్మాని అంతఃకరణ శుద్ధితో చేయగలిగే స్వేచ్ఛ ఇస్తాం. నా అనుభవాన్ని నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధికి ఉపయోగిస్తా. 2 ఎంపీ, 14మంది ఎమ్మెల్యేలను గెలిపించండి. జగన్‌కు అవకాశం ఇవ్వండి, సుభిక్షపాలన అందిస్తారు. 

సాక్షి: మీ ప్రత్యర్థి ప్రభాకర్‌ చౌదరిపై రెండు మాటల్లో చెప్పమంటే..?
‘అనంత’:
కబ్జాకోరు. మునిసిపల్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు ట్రస్టులు పెట్టుకుని ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు. సంఘమిత్రకు 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధం. తీసుకున్నారు. ఇంటివద్దే మునిసిపల్‌ స్కూలుకు నాటకరంగం పేరుతో 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. 5ఎకరాలకుపైగా కార్పొరేషన్‌ స్థలాలు అమ్మేశాడు. 

సాక్షి: అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు నిర్మించక పోతే నామినేషన్‌ వేయనని గత ఎన్నిల్లో ప్రభాకర్‌ చౌదరి చెప్పారు? ఇప్పుడు మళ్లీ బరిలో ఉన్నారు? ఏమంటారు?
‘అనంత’:
అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రింగ్‌రోడ్డు పూర్తి చేస్తేనే నామినేషన్‌ వేస్తా. లేదంటే పోటీ చేయనని 2014లో చెప్పారు. ఇప్పుడు ఇంకో అవకాశం ఇవ్వండని సిగ్గులేకుండా అడుగుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి వారి జెండా కింద నిలబడలేని వ్యక్తులు. వీరు సమన్వయంతో జిల్లా, నగరం అభివృద్ధికి పాటుపడతారా? ఆలోచించాలి. ఎంపీగా రంగయ్య, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇ వ్వండి. మూన్నెల్లలోపు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు మంజూరు చేస్తాం. ట్రాఫిక్‌ నిర్మూలన కోసం రింగ్‌రోడ్డు పూర్తి చేసి, మరో టౌన్‌షిప్‌ నిర్మిస్తాం. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ఒప్పించి రోడ్ల విస్తరణ చేస్తాం. కేంద్ర నిధులతో తిలక్‌రోడ్డులో సిమెంట్‌రోడ్లు వేయించా. రూ.40కోట్లతో శివారు ప్రాంతాల్లో రోడ్లు వేశాం. రోడ్ల వెడల్పును ఓ సమస్యగా చిత్రీకరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ సమస్యను సీఎం కూడా పరిష్కరించలేకపోయారు. ఇతను ఒక ముఖ్యమంత్రా? సర్పంచ్‌ కంటే అధ్వానంగా వ్యవహరించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు