‘అనంత’ ఆక్రందనలపై కదలిన యంత్రాంగం

25 Nov, 2014 02:12 IST|Sakshi

 ‘సాక్షి’ కథనంపై స్పందించిన అనంతపురం కలెక్టర్, డ్వామా
 జాబితాను పరిశీలించి అర్హులను గుర్తించాలని ఆదేశం

 
 అనంతపురం: అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాల దయనీయతపై సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికార యంత్రాంగం స్పందించింది. ఆదుకునేందుకు అనంతపురం జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) సిద్ధమైంది. జాతీయ ఉపాధి హామీ పథకం, సమగ్ర వాటర్‌షెడ్ కార్యక్రమాల ద్వారా బాధిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. రైతు ఆత్మహత్యలపై సాక్షిలో ఈనెల 23వ తేదీన ‘అనంత ఆక్రందన’ శీర్షికన ప్రచురితమైన కథనంపై డ్వామా అధికారులు స్పందించారు. సాక్షిలో ప్రచురితమైన 40 మంది ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితాను సేకరించి ఆదుకోవటంపై చర్చలు జరుపుతున్నారు. అర్హులను గుర్తించాలని  ఆదేశించామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ నాగభూషణం ‘సాక్షి’కి తెలిపారు.
 
 ఆత్మహత్యలను అరికడతాం: కలెక్టర్
 జిల్లాలో రైతుల ఆత్మహత్యలను అరికట్టడానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి  ఆయన ‘సాక్షి’ తో మాట్లాడుతూ.. జిల్లాలో రైతాంగం పరిస్థితిపై ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందజేస్తామన్నారు. ఇటీవల జరిగిన రైతుల ఆత్మహత్యల వివరాల సేకరణకు త్వరలో రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు