మహిళా హాకీ విజేత అనంతపురం

18 Feb, 2014 15:16 IST|Sakshi

కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న 4వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్‌షిప్ విజేతగా అనంతపురం జట్టు నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో కడపజట్టుపై 1-0 తేడాతో విజయం సాధించి ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం క్రీడాకారులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ వైస్ ప్రిన్సిపాల్ వి. జయచంద్రుడు విజేతలకు ట్రోఫీ బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ హాకీ క్రీడతోనే భారత్ ఒలంపిక్స్‌లో కీర్తిప్రఖ్యాతులు సాధించిందన్నారు. హాకీ క్రీడ జాతీయ క్రీడ అని దీనికి ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనడమేగొప్ప విషయమన్నారు. విజేతలుగా నిలిచిన వారు జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషిచేయాలన్నారు.
 
 జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుభాన్‌బాషా మాట్లాడుతూ క్రీడాకారిణులు మంచి ఆటతీరును ప్రదర్శించి ఆకట్టుకున్నారన్నారు. మార్చిలో భోపాల్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును ఎంపికచేస్తామన్నారు. రాయలసీమకే అనంతపురం ఆర్డీటీ తలమానికంగా ఉందన్నారు. అక్కడ మంచి వసతులతో చక్కటి శిక్షణ ఇవ్వడం సంతోషమన్నారు. కడపలో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు 5 ఎకరాల స్థలం కేటాయిస్తే అకాడమీని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కడపకు హాకీతో ఎంతో గుర్తింపు లభించిందన్నారు. అనంతరం విజేతగా నిలిచిన అనంతపురం జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన కడపజట్టుకు, మూడవ స్థానంలో నిలిచిన తూర్పుగోదావరి జట్టుకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డీఓ బాషామొహిద్దీన్, జిల్లా హాకీ అసోసియేషన్ కోశాధికారి చూడామణి, పంచాయతీరాజ్ ఇంజినీర్ జయచంద్ర, కోచ్‌లు రమేష్, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 కొనసాగిన అనంత ఆధిక్యం..
 
 కడప, అనంతపురం జట్ల మధ్య నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెషన్‌లో 26 నిమిషం వద్ద అనంతపురం జట్టు క్రీడాకారిణి మహేశ్వరి గోల్ చేయడంతో మొదలైన అనంతపురం జట్టు ఆధిక్యం చివరి వరకు కొనసాగింది. దీంతో 1-0 తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది. అంతకుమునుపు మూడవ స్థానానికి నిర్వహించిన పోటీలో తూర్పుగోదావరి జట్టు వైజాగ్‌పై 3-0 తేడాతో విజయం సాధించి మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. జట్టులోని శ్రీవాణి 2, సుధారాణి 1 గోల్ చేసింది.
 

మరిన్ని వార్తలు