ఏదీ 'సెట్' కాలేదు

14 Sep, 2014 01:13 IST|Sakshi
ఏదీ 'సెట్' కాలేదు

సకాలంలో వృత్తి విద్యా ప్రవేశాలు మిథ్య
సుప్రీంకోర్టు ఆదేశించినా ఏటా ఇదే పరిస్థితి
అన్ని కోర్సుల్లోనూ ప్రవేశాలు గందరగోళమే
ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇప్పటికీ అసంపూర్ణమే!
ఈసెట్, పాలిసెట్ అలాట్‌మెంట్లు మాత్రమే పూర్తి
ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, లాసెట్.. అన్నీ అంతే!
అడ్మిషన్ల కోసం లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు
 
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. విధానపర నిర్ణయాల్లో జాప్యం.. తప్పుడు నిర్ణయాల ఫలితం.. ఏదైతేనేం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల పరిస్థితి ఏటా గందరగోళంగా మారుతూనే ఉంది.. అడ్మిషన్లలో తీవ్ర జాప్యం జరుగుతూనే ఉంది.. విద్యా సంవత్సరం ప్రారంభమైనా కౌన్సెలింగ్ కోసమే విద్యార్థులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంటూనే ఉంది.. గడిచిన ఐదారేళ్లలో ఏ విద్యా సంవత్సరంలోనూ సరిగ్గా తరగతులు ప్రారంభమైంది లేదు.
 
 చివరకు సుప్రీంకోర్టు ఆదేశించినా అదే పరిస్థితి. ఈసారి కూడా అదే దుస్థితి. రాష్ట్ర విభజన సమస్యలు, అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం, ప్రభుత్వాల మొండిపట్టు వంటివన్నీ ప్రవేశాలు ఆలస్యం కావడానికి కారణమయ్యాయి. ఈసారీ పరిస్థితి అంతే. విద్యా సంవత్సరం సకాలంలో ప్రారంభం కావాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తి ఏ ఒక్క కోర్సు ప్రవేశాల్లోనూ కనిపించడం లేదు.
 
 జూలై 31 నాటికే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కోర్సులకు అయితే ప్రవేశాల షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, పాలిసెట్, లాసెట్ అన్నింటి పరిస్థితీ ఇంతే. ఏటా ప్రవేశాలు అక్టోబర్ వరకు కొనసాగుతుండటంతో.. లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
 
 ఎంసెట్..: విద్యార్థులకు ఆవేదనే!
 ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ విద్యార్థులకు ఆవేదనే మిగిల్చింది. కాలేజీలకు అఫిలియేషన్లు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మొండిపట్టు వంటివాటి కారణంగా కౌన్సెలింగ్ జాప్యమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగినా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో రెండో దశ కౌన్సెలింగ్‌కు అవకాశం లేకుండా పోయింది.
 
 మొదటి దశలో సీట్లు పొందిన వారు ఇతర కాలేజీల్లోకి మారలేకపోయారు, పూర్తిస్థాయిలో ఆప్షన్లు పెట్టుకోక సీట్లు పొందలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం లేకుండా పోయింది. చివరకు విద్యార్థులే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అవకాశం వస్తుందో లేదో తెలియదు. మొదటి దశలో చేరిన 1.04 లక్షల మంది విద్యార్థులకు మాత్రం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక ఎంసెట్ మేనేజ్‌మెంట్ కోటా భర్తీ, బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొంది.
 
 పీజీఈసెట్: అంతా గందరగోళం
 పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొదట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఉంది.
 
 ఎడ్‌సెట్..: అఫిలియేషన్లకే దిక్కులేదు
 ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్)లో ప్రవేశాలు చేపట్టాల్సిన కాలేజీలకు ఇంతవరకు అఫిలియేషన్ల ప్రక్రియే పూర్తి కాలేదు. ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 23వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినా... ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఈ కౌన్సెలింగ్‌తో తెలంగాణ, ఏపీల్లోని 69,068 బీఎడ్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన 1,47,188 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలోని 261 కాలేజీల్లో 27,744 సీట్లు అందుబాటులో ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లోని 386 కాలేజీల్లో 41,324 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది.
 
 డైట్‌సెట్..: పరిస్థితి మరీ దారుణం
 ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం డైట్‌సెట్‌లో అర్హత సాధించిన 2,25,000 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రవేశాలకు సంబంధించి 650కు పైగా ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. అఫిలియేషన్లు లభిస్తే తప్ప ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసే పరిస్థితి లేదు.
 
 అనేక డీఎడ్ కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వానికి సిఫారసులు అందాయి. దీంతో ప్రభుత్వాలు ఎన్నింటికి, ఎప్పుడు అనుమతిస్తాయో.. పాఠశాల విద్యా శాఖలు అఫిలియేషన్లు ఇస్తాయో తెలియదు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని సీట్ల భర్తీ కూడా ఆగిపోయింది. 2012లో అయితే ఏకంగా ఫిబ్రవరిలో తరగతులు ప్రారంభించారు. ఇక ఈసారి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు.
 
 పీఈసెట్: ఇంకా రాని షెడ్యూల్
 వ్యాయమ ఉపాధ్యాయ కోర్సులైన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ)లో ప్రవేశాల కోసం ఇంకా షెడ్యూల్ జారీ కాలేదు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 6వ తేదీ నుంచి చేపట్టాలని మాత్రం నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల్లోని దాదాపు 40 కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టాల్సి ఉంది. ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేసి.. వచ్చే నెల 6 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 7వ తేదీ నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 11న సీట్లను కేటాయించాలని నిర్ణయించారు.
 
 ఐసెట్..: ఆలస్యం తప్పేలా లేదు
 ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను శనివారం జారీ చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్లు లభించాల్సి ఉంది. 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల తనిఖీ, 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రవేశాల కోసం ఐసెట్‌లో అర్హత సాధించిన 1,19,756 మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక దీనిపై దృష్టి సారించాలని భావించడంతో.. దీనికి ఆలస్యం తప్పడం లేదు. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కలిపి మొత్తం 1.20 లక్షల వరకు సీట్లను భర్తీ చేయాల్సి ఉండగా.. తెలంగాణలోని 539 కాలేజీల్లో దాదాపు 64 వేల సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 628 కాలేజీల్లో 56 వేలకు పైగా సీట్లు ఉన్నాయి.
 
 లాసెట్‌దీ అదే పరిస్థితి..
 లాసెట్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను ఇంకా జారీ చేయాల్సి ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన యూజీ లాసెట్, పీజీ లాసెట్‌లో అర్హత సాధించిన వారు 19 వేల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
 
 పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇక ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ (ఈసెట్) ప్రవేశాలు పూర్తయి, 12న తరగతులు ప్రారంభమయ్యాయి.
 
 పీజీఈసెట్ గందరగోళం
 పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొద ట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఉంది.

 

మరిన్ని వార్తలు