హైటెక్‌ మార్ఫింగ్‌ మాయ!

13 Jul, 2019 08:04 IST|Sakshi

సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : ప్రభుత్వం అందించే పథకాలు అడ్డదారిలోనైనా దక్కించుకోవడానికి కుతంత్రాలు చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఎంతటి అక్రమాన్నైనా చేసేసే ప్రబుద్ధులు ఇందుకు తోడ్పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌కు అర్హత వయసు సరిపోకపోతే దానిని ఆధార్‌లో మార్చేసి అడ్డదారిలో డబ్బు సంపాదిస్తున్న వైనం తాజాగా బయటపడింది. చీపురుపల్లి పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్‌లో కొంతకాలంగా ఆధార్‌ నమోదు కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో డబ్బులిస్తే వయస్సు మార్చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

ఒక్కో వ్యక్తి నుంచి రూ.4 వేల నుంచి రూ.5 వేలు తీసుకుని పక్క జిల్లా శ్రీకాకుళం నుంచి కూడా లబ్ధిదారులను తీసుకొచ్చి ఇక్కడ వయస్సు మార్ఫింగ్‌ చేసేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ఓ మీసేవా కేంద్ర మాజీ నిర్వాహకుడు బ్రోకర్‌ అవతారమెత్తినడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్‌కార్డులో వయస్సు మార్చడానికి నాలుగైదు వేలు ఖర్చుచేస్తే ఆ తరువాత నెలకు రూ.2 వేలు దాటి పెన్షన్‌ వస్తుంది అంటూ లబ్ధిదారులను మభ్యపెట్టి 65 సంవత్సరాలు నిండని వారిని సైతం ఆధార్‌కార్డులో మార్చేస్తూ కొత్త కార్డులు సృష్టిస్తున్నారు. 

వెలుగు చూసిందిలా...
శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలో గల సీతారాంపురం గ్రామానికి చెందిన పది మంది లబ్ధిదారులు శుక్రవారం ఇక్కడకు రావడంతో ఈ తతంగం బయటపడింది. వారిని ప్రశ్నించగా తాము ఆధార్‌కార్డు మార్చడానికి వచ్చామని బదులిచ్చారు. ఓ ఆటోలో వచ్చిన పది మందిని ఆంధ్రాబ్యాంకు ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌కాలనీ సందులో ఉంచి ఇద్దరేసి ఒకసారిగా బ్యాంకులోకి వచ్చి తమ పనులు ముగించుకుని వెళుతుండటాన్ని గమనించిన విలేకరులు వారిని ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా చల్లగా జారుకున్నారు.

రాజాం పట్టణంలో ఓ మీసేవ కేంద్ర మాజీ నిర్వాహకుడు బ్రోకర్‌గా అవతారమెత్తి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. వీరిని తీసుకువచ్చిన ఆటోవాలా సత్యనారాయణ సాక్షితో మాట్లాడుతూ సీతారాంపురం నుంచి పది మందిని బేరం కుదర్చుకుని తీసుకొచ్చాననీ, రాజాంలో ఓ వ్యక్తికి వీరంతా డబ్బులిచ్చారనీ, తరువాత చీపురుపల్లి ఆంధ్రాబ్యాంకు దగ్గరకు తీసుకెళ్లమంటే తీసుకొచ్చాననీ తెలిపారు.

ప్రూఫ్‌ లేకుంటే మార్చడం కుదరదు
ప్రూఫ్‌ ఉంటే తప్ప వయస్సు మార్పిడి కుదరదు. రోజుకు 40 వరకు ఆధార్‌ నమోదు, మార్పిడులు వస్తాయి. అందులో అత్యధికంగా బయోమెట్రిక్, సెల్‌ నంబరు, అడ్రస్‌ మార్పులు వంటివి అధికంగా ఉంటాయి. ఒకటో రెండో వయస్సు మార్పిడి ఉంటే దానికి కచ్చితంగా ప్రూఫ్‌లు ఉంటేనే మారుతుంది. ప్రతీ దరఖాస్తును విచారించిన తరువాతే ఆధార్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఎలాంటి వయస్సు మార్పిడి ప్రక్రియ జరగడం లేదు.
– ఎ.ప్రసాద్, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్, చీపురుపల్లి  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు