నల్లధనాన్ని నిరోధించాలి

13 Oct, 2016 02:59 IST|Sakshi
నల్లధనాన్ని నిరోధించాలి

• దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నా    
• సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
• మావాళ్లు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలంటున్నారు
• అమెరికా ఎన్నికలకు నేను వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు
• వెలగపూడిలో సీఎం కార్యాలయం ప్రారంభం

సాక్షి, అమరావతి: ఐదేళ్లు పడుకుని ఎన్నికల్లో నిద్రలేచి రూ.వెయ్యి నోటు ఇస్తే సరిపోతుందనుకుంటున్నారు... కొందరు మొన్న ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టారు, మళ్లీ ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారు... అందుకే ఎమ్మెల్యేలు డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టి, అందుకోసం పోటీలు పడుతున్నారు... తమ పార్టీ వాళ్లు కూడా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలంటున్నారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయాన్ని బుధవారం ఉదయం ఆయన శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... బ్లాక్‌మనీ సంపాదించే వారికి రాజకీయం షెల్టర్‌గా మారిపోయిందన్నారు. కొంతమంది బ్లాక్ మనీని సంపాదించి ఎన్నికల్లో పంచుతుండడంతో తమ పరిస్థితి ఏమిటని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని చెప్పారు.

తాము ఐదేళ్లు ప్రజలకు కరెంటు, గ్యాస్, పెన్షన్ వంటివన్నీ ఇస్తే చివర్లో ఎన్నికలప్పుడు ఎవరైనా రూ.500 ఇస్తే వారికి ఓట్లేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్‌లో మొత్తం రూ.13 వేల కోట్ల నల్లధనాన్ని స్వచ్ఛంద ఆదాయం వెల్లడి పథకం కింద తెల్లధనంగా మార్చుకున్నారని, అందులో ఒకే వ్యక్తిది పది వేల కోట్లుందని తెలిపారు. అంత డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడితే తమ పరిస్థితి ఏమిటని మిగిలిన వాళ్లు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని నివారించాలంటే బ్లాక్‌మనీని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించేలా నగదు రహిత లావాదేవీలు జరపాలని చెప్పారు. వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మోదీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.

ప్యాకేజీ తీసుకుంటే తప్పేంటీ?
ప్రత్యేక హోదాలో ఉన్నవన్నీ ఇస్తానంటే ప్యాకేజీ ఎందుకు తీసుకోకూడదని చంద్రబాబు ప్రశ్నించారు. అగ్రదేశమైన అమెరికాలోనూ నాయకత్వ లేమి ఉందన్నారు. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ట్రంప్‌కు నాలుగో భార్య అనుకుంటా అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ట్రంప్ మహిళల పట్ల అశ్లీలంగా మాట్లాడాడని విమర్శించారు. అమెరికా ఎన్నికలకు తాను వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు.
 
చందాలు తీసుకుని రాజకీయాలు..: సచివాలయంలో తన కార్యాలయంలోకి అడుగు పెట్టడంతో నూతక శకం ప్రారంభమైందని  బాబు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద రూ.2,500 కోట్లు విడుదల చేసే ఫైలుపై తొలి సంతకం చేశానన్నారు. దీనిపై వడ్డీ కూడా రూ.1200 కోట్లు ఇస్తున్నామన్నారు. ఓట్లు, సీట్లు రాకపోయినా.. కొన్ని పార్టీలు చందాలు తీసుకుని రాజకీయాలు చేస్తున్నాయని వామపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు.

>
మరిన్ని వార్తలు