చంద్రబాబు వైఖరి రైతులకు చేటు

3 Dec, 2013 01:45 IST|Sakshi
సాక్షి, గుంటూరు :టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరితోనే కృష్ణా, గోదావరి మిగులు జలాల విషయంలో రైతులు నష్టపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ విమర్శించారు. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్ట్‌ల గురించి ఏనాడూ ఆలోచన చేయలేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై ఏమాత్రం అవగాహన లేని టీడీపీ నేతలు వైఎస్సార్ గురించి, ఆయన చేపట్టిన జలయజ్ఞంపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్ట్‌లకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరపకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని ఆరోపించారు. 2004 కన్నా ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు అప్పుడే ప్రాజెక్ట్‌లు నిర్మించి ఉంటే, ఇప్పుడు ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపులు జరిగేవని పేర్కొన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి గొడ్డలిపెట్టన్నారు.
 
 బాబును ప్రజలు క్షమించరు..
 మిగులు జలాల సద్వినియోగం విషయంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన గడువును ఉపయోగించుకోకుండా.. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రాజెక్ట్‌ను నిర్మించకపోవడంతోనే కృష్ణామిగుల జలాలపై తీరని అన్యాయం జరిగింద ని రాజశేఖర్ ఆరోపించారు. పేదలు, రైతులకు మేలు తలపెట్టిన మహానేత వైఎస్‌ఆర్‌పై బురదజల్లుడు వ్యాఖ్యలకు పాల్పడటం టీడీపీ నేతల కుసంస్కారానికి నిదర్శనమన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌ల చుట్టూ పొర్లుదండాలు పెట్టి చంద్రబాబు క్షమాపణలు కోరినా, ఈ రాష్ట్ర ప్రజలు అంగీకరించరన్నారు. రైతులకు టీడీపీ చేసిన తీరని అన్యాయాన్ని కడవరకు ప్రజలు మరిచిపోరన్నారు. ఆల్మట్టి ఎత్తు తగ్గించగలిగామని చంకలు కొట్టుకుంటున్న టీడీపీ.. అప్పట్లో అధికారంలో ఉంది తామేనని మరిచిపోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్ ఇచ్చిన లేఖ కారణంగానే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పిందని టీడీపీ నేతలు ఎలా మాట్లాడగలుగుదుందని ప్రశ్నించారు..?  చంద్రబాబు తాబేదారులుగా మాట్లాడుతున్న వారికి రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు.
 
 జలయజ్ఞంతో వైఎస్‌ను దేవుడిగా కొలుస్తున్నారు..
 వృధాగా పోయే ప్రతీ నీటి చుక్క రైతులకు మేలుచేయాలనే తలంపుతో జలయజ్ఞం చేపట్టి సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఘనత  మహానేత వైఎస్‌దేనని పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు రావి వెంకటరమణ అన్నారు. వెలిగొండ, పులిచింతల, నాగార్జునసాగర్, గోదావరి ఆయక ట్టు ఆధునికీకరణ పనులు వైఎస్ చలవేనన్నారు. ఆయన ఆప్పట్లో కేంద్రానికి రాసిన లేఖలను వక్రీకరించి రాజకీయాల్లో లాభం పొందాలనే టీడీపీ ఎత్తుగడను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. టీడీపీ హయాం లో డెల్టాలో 20లక్షల ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితిని గుర్తుచేశారు. 
 
 కడ వరకు పోరాడతాం..
 మిగులు జలాల విషయంలో న్యాయం కోసం తమ పార్టీ కడవరకు పోరాడుతుందని పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారనే భయంతో టీడీపీ నేతలకు మతిభ్రమించి వైఎస్‌ఆర్‌పై బురదజల్లుతున్నారని, ప్రజలు ఆపార్టీకి తగిన సమయంలో బుద్ధిచెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం నేతలు కావటి మనోహర్‌నాయుడు, బాలవజ్రబాబు (డైమండ్), పెదకూరపాడు సమన్వయకర్తలు నూతలపాటి హనుమయ్య, రాతంశెట్టి రామాంజనేయులు, పార్టీనేతలు మార్కెట్‌బాబు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు