ఆంధ్రజ్యోతికి ‘గుడా’ నోటీసులు

29 Jun, 2019 05:21 IST|Sakshi
ఆంధ్రజ్యోతికి గుడా జారీ చేసిన నోటీసు

రాజానగరంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రింటింగ్‌ కార్యాలయం

డీటీసీపీ, ‘గుడా’ అనుమతులు తీసుకోని వైనం

అక్రమ నిర్మాణాలపై కొత్త ప్రభుత్వం చర్యలతో అప్రమత్తం

బీఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండా అనుమతులివ్వాలని గుడాపై ఒత్తిడి

దీంతో వేమూరి రాధాకృష్ణ కుమార్తెకు ప్రొవిజినల్‌ ఆర్డర్‌ జారీ 

వారం రోజుల్లో స్పందించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ  

సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తుల ప్రింటింగ్‌ కార్యాలయాన్ని నిర్మించిన ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు.

నోటీసు అందిన ఏడు రోజుల్లోగా స్పందించాలంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్‌ ఆర్డర్‌ జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 208/5ఎలో ప్రింటింగ్‌ ప్రెస్‌ భవన నిర్మాణాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం గతేడాది 1.75 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభం కూడా చేసింది. ప్రస్తుతం ఇక్కడి నుంచే పత్రికా వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే, దీని నిర్మాణం కోసం డిస్ట్రిక్ట్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అధికారుల నుంచి గానీ, ‘గుడా’ నుంచిగానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించలేదు. భవన ప్రధాన ముఖ ద్వారం రోడ్డు కాకుండా మరో రోడ్డు (పెరిఫెరల్‌ రోడ్‌) కూడా నిర్మించాల్సి ఉండగా.. ఇక్కడ అలాంటిదేమీ చేపట్టలేదు. 

‘గుడా’ అధికారులపై ఆంధ్రజ్యోతి ఒత్తిళ్లు
అక్రమ నిర్మాణాలపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం అప్రమత్తమైంది. తమ భవనానికి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇవ్వాలని గుడా అధికారులపై ఒత్తిడి తెస్తోంది. భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్‌) కింద దరఖాస్తు చేసుకోవాలని గుడా వర్గాలు చెప్పినా పట్టించుకోవడం లేదు. బీఆర్‌ఎస్‌ కింద అయితే సుమారు రూ. 70 లక్షలు చెల్లించాల్సి వస్తోందని ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనూషకు గుడా అధికారులు ఈ నెల 25న ప్రొవిజినల్‌ ఆర్డర్‌ నోటీసు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. 

ఆంధ్రజ్యోతికి గుడా జారీ చేసిన నోటీసు 

మరిన్ని వార్తలు