విలేకరి దారుణ హత్య 

16 Oct, 2019 07:44 IST|Sakshi

కేసును సీరియస్‌గా తీసుకోవాలని డీజీపీకి సీఎం జగన్‌ ఆదేశం 

సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో  విలేకరిగా (ఆంధ్రజ్యోతి) పనిచేస్తున్న కాతా సత్యనారాయణ (50) దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం చీకటిపడే సమయంలో తుని మండలం తేటగుంట శివారు టి.వెంకటాపురం నుంచి ఎస్‌.అన్నవరంలో తన ఇంటికి మోటార్‌ సైకిల్‌పై వస్తుండగా లక్ష్మీదేవి చెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటికి వంద మీటర్ల దూరంలోనే ఈ ఘాతుకం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సీఐ సన్యాసిరావు, తుని రూరల్, కోటనందూరు ఎస్సైలు ఎస్‌.శివప్రసాద్, అశోక్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గత నెలలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రూరల్‌ పోలీసులకు సత్యనారాయణ ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పిస్తున్నామని, హత్యకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్‌ చేస్తామని పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

విలేకరి సత్యనారాయణ హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై వెంటనే తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ తో మాట్లాడినట్లు డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు