అగ్రిగోల్డ్‌ పై చర్చకు వైఎస్‌ఆర్‌సీపీ పట్టు

22 Mar, 2017 09:14 IST|Sakshi

అమరావతి: అగ్రిగోల్డ్‌ అంశంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది.  శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం కాగానే వాయిదా తీర్మానంపై చర్చకు ప్రతిపక్షం పట్టుబట్టింది. దీంతో సమావేశాలు ఆరంభం అయిన కొద్దిసేపటికే అసెంబ్లీ వాయిదా పడింది. ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే అగ్రిగోల్డ్‌ బాధితులు-ప్రభుత్వ వైఖరిపై చర్చించాలంటూ ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని  స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనంటూ ప్రతిపక్ష సభ్యులు  స్పీకర్‌ పోడియం​ వద్ద నిలబడి నినాదాలు చేశారు.

అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ప్రశ్నోత్తరాల అనంతరం చర్చిద్దామని, సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్‌ సూచించారు. అయినప్పటికీ వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యులు తమ నిరసన కొనసాగించారు. దీంతో సభ కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో స్పీకర్‌ సమావేశాలను పదినిమిషాలు వాయిదా వేశారు.

కాగా ఇవాళ్టి ప్రశ్నోత్తరాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రస్తావనతో పాటు ఆర్‌అండ్‌బీ, రవాణా, ఇరిగేషన్‌, వ్యవసాయం, విద్యుత్‌, అటవీశాఖ పద్దులపై చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు